Share News

నియోజకవర్గం ఇక్కడ.. ఏసీపీ కార్యాలయం అక్కడ?

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:16 PM

నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌లో ఏసీపీ కార్యాలయం ఉన్నా... మరో నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ కార్యాలయంలో కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్ల లిమిట్స్‌ను కలపడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తమ మండలాల పోలీ్‌సస్టేషన్‌ పరిధిని షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయంలోనే కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

నియోజకవర్గం ఇక్కడ.. ఏసీపీ కార్యాలయం అక్కడ?
కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌

ఇబ్బందుల్లో కొత్తూర్‌, నందిగామ మండలాల ప్రజలు

షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయంలోనే కొనసాగించాలి

కొత్తూర్‌, డిసెంబరు 16 : నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌లో ఏసీపీ కార్యాలయం ఉన్నా... మరో నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ కార్యాలయంలో కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్ల లిమిట్స్‌ను కలపడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తమ మండలాల పోలీ్‌సస్టేషన్‌ పరిధిని షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయంలోనే కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు. షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయ పరిధిలో నియోజకవర్గంలోని మండలాలైన ఫరూఖ్‌నగర్‌, కొత్తూర్‌, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాలు ఉండేవి. ఏడాది క్రితం కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లను శంషాబాద్‌ ఏసీపీ కార్యాలయ పరిధిలోకి మారుస్తూ పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఆ మండలాలకు చెందిన ప్రజలు శంషాబాద్‌ పరిధిలోకి తమ పోలీ్‌సస్టేషన్లను మార్చొద్దని అప్పటి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఎమ్మెల్యే స్పందిస్తూ కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లను షాద్‌నగర్‌ ఏసీపీ పరిధిలోనే ఉంచాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులను నిలిపివేయించారు. కొద్దినెలల తర్వాత తిరిగి ఉత్తర్వులు జారీ చేస్తూ.. కొత్తూర్‌, నందిగామలను శంషాబాద్‌ ఏసీపీ పరిధిలోకి మార్చాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆ రెండు మండలాలు శంషాబాద్‌ ఏసీపీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. షాద్‌నగర్‌ పట్టణంలో ఏసీపీ కార్యాలయంతో పాటు, ఆర్డీవో, తదితర డివిజన్‌ కార్యాలయాలు ఉన్నాయి. కొత్తూర్‌, నందిగామ మండలాల ప్రజలు పనులు నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, వ్యాపార పనుల నిమిత్తం తరచూ షాద్‌నగర్‌కు వచ్చి వెళ్తుంటారు. కొత్తూర్‌, నందిగామ మండలాల ప్రజలకు షాద్‌నగర్‌ ప్రాంతం రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుంది. అయితే, ఏసీపీ కార్యాలయం శంషాబాద్‌లో ఉండడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పనులకు షాద్‌నగర్‌కు, మరికొన్ని పనులకు శంషాబాద్‌ వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. రెండు మండలాల ప్రజలు శంషాబాద్‌కు వెళ్లాలంటే దూరభారం కూడా పెరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల పని నిమిత్తం షాద్‌నగర్‌తో పాటు శంషాబాద్‌కు వెళ్లాలంటే సమయం వృథా అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్‌ నూతన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వెంటనే స్పందించి కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లను షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయ పరిధిలోకి తిరిగి మార్చేందుకు కృషి చేయాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:16 PM