చెరువుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2023-06-07T23:56:30+05:30 IST

చెరువుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం చీర్యాల్‌లోని నాటికన్‌ చెరువు వద్ద జిల్లా నీటి పారుదల శాఖ అధ్వర్యంలో సాగునీటి ఉత్సవం నిర్వహించారు.

చెరువుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
చీర్యాల్‌ నాటికన్‌ చెరువుకు ప్రత్యేక పూజలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి

కీసర, జూన్‌7: చెరువుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం చీర్యాల్‌లోని నాటికన్‌ చెరువు వద్ద జిల్లా నీటి పారుదల శాఖ అధ్వర్యంలో సాగునీటి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. సాగునీటి విషయంలో రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. గతంలో నియోజకవర్గంలో 36 వేల టన్నుల పంట దిగుబడి ఉండేదని, ఇప్పుడు అదే పంట దిగుబడి 70 వేల టన్నులకు పెరిగిందన్నారు. మిషన్‌ కాకతీయతో గ్రామాల్లో చెరువులు జలకళలాడుతున్నాయన్నారు. చెరువుల్లో నీటి నిల్వలతో చేపలు పెంచి, విక్రయించి మత్స్యకారులు ఆర్థికంగా రాణించారన్నారు. అనంతరం సాగునీటి ఉత్సవాల సందర్భంగా చీర్యాల్‌ నాటికన్‌ చెరువులో మంత్రిమల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కాగా కీసర మండల పరిధి రాంపల్లి దాయరలో రూ. 50 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీహాల్‌, సీసీ రోడ్డు నిర్మాణాలకు బుధవారం మంత్రి మల్లారెడ్డి, జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. శంకుస్థాపన చేసిన పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఈఈ జితేందర్‌రెడ్డి, రేవతి, పూస వెంకటేష్‌, ఇందిర లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి, గరుగుల ఆండాలు, మాధురి, ఆకిటి మహేందర్‌రెడ్డి, పెంటయ్య, రాజు, ఉపసర్పంచ్‌లు రాము, ఆంజనేయులు, ఎంపీటీసీలు నారాయణ శర్మ, కవిత, జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, కందాడి శ్రీకాంత్‌రెడ్డి, భాను శర్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:56:30+05:30 IST