Share News

కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు

ABN , First Publish Date - 2023-10-28T00:49:35+05:30 IST

ఉమ్మడి జిల్లాలో రాజకీయం జోరందుకుంది. అధికార బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ రెండు విడతల్లో మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలో పదిమందిని ప్రకటించగా.. శుక్రవారం రాత్రి రెండో విడతలో మిగిలిన ఏడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. టికెట్‌ కోసం అనేకమంది పోటీ పడడంతో అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగానే మారింది. ఎట్టకేలకు రెండు విడతల్లో అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది.

కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు

రెండు విడతల్లో అన్ని నియోజకవర్గాల క్యాండిడేట్ల ప్రకటన

కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన బుయ్యని మనోహరెడ్డి, బండి రమేష్‌ను వరించిన టికెట్‌

ఈసారి మహేశ్వరంలో రసవత్తరంగా మారనున్న రాజకీయం

తాండూరు టికెట్‌ ఆశించిన కేఎల్లార్‌కు మహేశ్వరం ఖరారు

గత ఎన్నికల్లో టికెట్‌ కోల్పోయిన మల్‌రెడ్డి రంగారెడ్డికి ఈ సారి ఇబ్రహీంపట్నం నుంచి చాన్స్‌

ఎల్బీగనర్‌ నుంచి మధుయాష్కీ, రాజేంద్రనగర్‌ నుంచి కస్తూరి నరేందర్‌ను వరించిన అదృష్ఠం

అసంతృప్తిలో ఆశావహులు, అమ్మతిని చల్లార్చేందుకు రంగంలోకి నేతలు

ఉమ్మడి జిల్లాలో రాజకీయం జోరందుకుంది. అధికార బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ రెండు విడతల్లో మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలో పదిమందిని ప్రకటించగా.. శుక్రవారం రాత్రి రెండో విడతలో మిగిలిన ఏడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. టికెట్‌ కోసం అనేకమంది పోటీ పడడంతో అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగానే మారింది. ఎట్టకేలకు రెండు విడతల్లో అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది.

తాండూరు, వికారాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి )అక్టోబరు 27 : అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన జోష్‌తో తెలంగాణలోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటి వరకు మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం రెండో విడత జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో రెండో జాబితాకు ఆమోద ముద్ర వేశారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు సారథ్యంలో కమిటీ సమావేశమైన స్ర్కీనింగ్‌ కమటీ సిఫార్సు చేసిన జాబితాపై చర్చింది. రెండో విడతలో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఏడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొదటి విడతలో 10 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాల అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. ఆయా స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి ఇవ్వాలనే విషయంపై తీవ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఢీకొనే సమర్ధుడైన అభ్యర్థులను ప్రకటించింది.

సబితను ఢీకొట్టేది కేఎల్లారే..

మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు టికెట్‌ కోసం పోటీ పడ్డారు. అక్కడ సమర్ధుడైన నాయకుడి కోసం పార్టీ అన్వేశించింది. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమెను ఢీకొనే సమర్ధుడైన నేతను రంగంలో దింపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ఇక్కడ నుంచి బరిలో నిలిపింది. వాస్తవానికి కేఎల్లార్‌ వికారాబాద్‌ జిల్లా తాండూరు టికెట్‌ ఆశించారు. ఆయన అదేవిధంగా బీఆర్‌ఎస్‌ నుంచి పరిగి అసెంబ్లీ టికెట్‌ ఆశించిన భంగపడిన డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయనకు తాండూరు టికెట్‌ను కేటాయించారు.

మహేశ్వరంలో పాత కాపులే..

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ మల్‌రెడ్డి రంగారెడ్డికి కేటాయించింది. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను సామ రంగారెడ్డికి కేటాయించింది. అప్పుడు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ కోల్పోవడంతో ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అంతర్గతంగా కాంగ్రెస్‌ నేతల మద్దతు మల్‌రెడ్డి రంగారెడ్డికి ఉంటంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓట్లన్నీ మల్‌రెడ్డి రంగారెడ్డికే వచ్చాయి. అధికార పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గత ఎన్నికల్లో కోల్పోయిన పార్టీ టికెట్‌ ఈసారి మల్‌రెడ్డి రంగారెడ్డినే వరించింది. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రధాన పోటీ మల్‌రెడ్డి, మంచిరెడ్డి మధ్యే జరగనుంది.

ఎల్‌బీనగర్‌ స్థానం మధుయాష్కీకే..

ఎల్బీనగర్‌ స్థానం నుంచి పదిమంది ఆశావహులు టికెట్‌ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ టికెట్‌ కోసం మల్‌రెడ్డి రాంరెడ్డి, మధుయాష్కీ ప్రధానంగా పోటీ పడ్డారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ సతీమణి, మాజీ కార్పొరేటర్‌ మద్దగోని లక్ష్మీప్రసన్న పేరు తెరపైకి వచ్చినా చివరకు మధుయాష్కీ గౌడ్‌కే టికెట్‌ దక్కింది. అదేవిధంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 14 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో రఘునాథ్‌ యాదవ్‌, జగదీశ్వర్‌గౌడ్‌ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. చివరకు జగదీశ్వర్‌గౌడ్‌ను అదృష్టం వరించింది. రాజేంద్రగనర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బొర్ర జ్ఞానేశ్వర్‌, నరేందర్‌, సతీష్‌ పోటీ పడ్డారు. ఈ ముగ్గురికి కాకుండా మరో నేత కస్తూరి నరేందర్‌కు టికెట్‌ దక్కింది. కూకట్‌పల్లి స్థానానికి 16 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వారెవరికీ కాకుండా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌కు ఇక్కడి టికెట్‌ దక్కింది. శేరిలింగంపల్లి నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో బండి రమేష్‌ ఇటీవలే రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి కూకట్‌పల్లి స్థానాన్ని ఆశించారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కూకట్‌పల్లి స్థానాన్ని బండి రమేష్‌కు కేటాయించింది.

పార్టీని వీడకుండా జాగ్రత్తలు..

అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి, వ్యతిరేకత ఎదురు కాకుండా.. ఎవరూ పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా అసంతృప్తి నాయకుల బుజ్జగింపుపై ముఖ్య నేతలు దృష్టి సారించారు. కొందరితో ఏఐసీసీ నాయకులే నేరుగా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతలను ఇప్పటికే ఢిల్లీ పిలిపించి చర్చించారు.

మలి విడత అభ్యర్థులు

ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి

ఎల్బీగనర్‌ : మధుయాష్కీగౌడ్‌

మహేశ్వరం : కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

రాజేంద్రనగర్‌ : కస్తూరి నరేందర్‌

శేరిలింగంపల్లి : వి. జగదీశ్వర్‌గౌడ్‌

కూకట్‌పల్లి : బండి రమేష్‌

తాండూరు : బుయ్యని మనోహర్‌రెడ్డి

-------------------------------------------

నియోజకవర్గం: తాండూరు

పేరు : బుయ్యని మనోహర్‌రెడ్డి

పుట్టిన తేది : 05/06/1965

పుట్టిన స్థలం : గ్రామం తిర్మలాపూర్‌, కులకచర్ల మండలం, వికారాబాద్‌ జిల్లా.

తల్లిదండ్రులు : సత్తమ్మ, బాలకృష్ణారెడ్డి

భార్య : అరుణ:

కుమారులు: శివకుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి

వృత్తి :మేనేజింగ్‌ డైరెక్టర్‌ జేబీఇన్‌ఫ్రా గ్రూప్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీఎంఆర్‌ సర్తా కన్వెన్షన్‌, బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌.

రాజకీయ చరిత్ర : 1995లో పరిగి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 1996 డీిసీఎంఎస్‌ డైరెక్టర్‌, 2006లో కులకచర్ల జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2014 నుంచి ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కులకచర్ల పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

నియోజకవర్గం : ఇబ్రహీంపట్నం

పేరు: మల్‌రెడ్డి రంగారెడ్డి

పుట్టిన తేది: 1/10/1956

విద్యార్హత: బీఏ

స్వస్థలం: తొర్రూరు, అబ్దుల్లాపూర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా

తల్లిదండ్రులు : రాములమ్మ, బాల్‌రెడ్డి

భార్య: అనసూయ

కూతుళ్లు: రజిత, రమ, పద్మజ, అర్చనారెడ్డి

కుమారుడు: అభిషేక్‌రెడ్డి

రాజకీయ ప్రస్థానం : 1981-89 వరకు తొర్రూర్‌ సర్పంచ్‌గా ఉన్నారు. 1990-94 వరకు తుర్కయాంజాల్‌ రైతు సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 1994- 99 వరకు టీడీపీ నుంచి మలక్‌పేట్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004-09 వరకు కాంగ్రెస్‌ నుంచి మలక్‌పేట్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాగ్రెస్‌ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిచెందారు. 2018లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి 396 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.

నియోజకవర్గం : కూకట్‌పల్లి

అభ్యర్థి పేరు : బండి రమేష్‌

పుట్టిన తేదీ : 15/07/1963

విద్యార్హతలు : డిప్లొమా ఇన్‌ ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌

తల్లిదండ్రులు: సరోజిని దేవి, భాస్కర్‌రావు (లేట్‌)

భార్య పేరు : లుకుమాదేవి

కుమార్తె పేరు : మానస్వినీ

చిరునామా : ప్లాట్‌ నెంబర్‌ 239, రోడ్డు నెంబర్‌ 78, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

నియోజకవర్గం: రాజేంద్రనగర్‌

అభ్యర్థి పేరు కస్తూరి నరేందర్‌

భార్య కస్తూరి లావణ్య

సంతానం ఇద్దరు కొడుకులు

వయసు 52ఏళ్లు

కులం ముదిరాజ్‌

చిరునామా పుప్పాల్‌గూడ, గండిపేట మండలం రంగారెడ్డి జిల్లా

రాజకీయ అనుభవం ప్రస్తుతం మణికొండ మున్సిపల్‌ చైర్మన్‌, గతంలో నరేందర్‌, ఆయన భార్య, సోదరుడు పుప్పాల్‌గూడ సర్పంచ్‌గా పని చేశారు

నియోజకవర్గం : శేరిలింగంపల్లి

అభ్యర్థిపేరు : వాలిదాసు జగదీశ్వర్‌గౌడ్‌

పుట్టిన తేది : జూన్‌ 24, 1975

విద్యార్హతలు : ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ

తల్లిదండ్రులు : భాగ్యమ్మ, హరిశంకర్‌

భార్య : పూజిత

సంతానం : హారిక, వైభవ కృష్ణ

చిరునామా : నల్లగండ్ల

రాజకీయ అనుభం : 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి, ఒకసారి కాంగ్రెస్‌, రెండుసార్లు బీఆర్‌ఎస్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. చినాన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రిగా పనిచేశాడు.

నియోజకవర్గం : మహేశ్వరం

అభ్యర్థి పేరు : కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

పుట్టిన తేది : 23-04-1956

విద్యార్హత : ఎంఎస్‌సి కెమిస్ర్టీ

తల్లిదండ్రులు : కె. రామ లక్షమ్మ, కొండారెడ్డి

స్వగ్రామం : మాసానిగూడ, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా.

వృత్తి : వ్యాపారం, రాజకీయం, కేఎల్లార్‌ ట్రస్టు

భార్య : విజయలక్ష్మీ

పిల్లలు : అనురూప్‌, అభిషేక్‌

రాజకీయ అనుభవం : 1994లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009 మేడ్చల్‌ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Updated Date - 2023-10-28T00:49:35+05:30 IST