ఫార్మాసిటీ తరలింపు నిర్ణయంతో సంబరాలు
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:03 PM
యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని అక్కడ నుంచి తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఫార్మాసిటీ భూ బాధితులు, సమీప గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యాచారం, కందుకూరు మండలాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేసిన బాధిత రైతులు
యాచారం/కందుకూరు, డిసెంబరు 14 : యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని అక్కడ నుంచి తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఫార్మాసిటీ భూ బాధితులు, సమీప గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎం వెంకటరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డిలతో పాటు తాడిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాల సర్పంచులు రమేష్, దంతుక పెద్దయ్య, బి రాజశేఖర్‌రెడ్డి, ఫార్మాసిటి వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు శ్రీకాంత్‌నాయక్, కవుల సరస్వతిలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాబు జగ్జీవన్‌రాంల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు, గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం పేదల భూములను ఫార్మాసిటీ కోసం తీసుకొని పేదల జీవితాలను పాడుచేసిందన్నారు. విషతుల్యమైన ఫార్మాసిటీని పచ్చటి పంట పొలాల మధ్య ఏర్పాటు చేయడానికి బీఆర్‌ఎస్ పాలకులు పూనుకోవడం దారుణమన్నారు. విషతుల్యమైన ఫార్మాసిటీని తరలించాలని నిర్ణయించడం పట్ల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలముందు తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీ నిలుపుకుందన్నారు. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో మెగా టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దాంతో వేలాది మంది యువతకు ఉపాది కల్పించి ఆదుకుంటామన్నారు. ఫార్మాసిటీ తరలింపు పట్ట సీపీఎం నాయకుడు మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం : ఏనుగు జంగారెడ్డి
గత ప్రభుత్వం ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో ఫార్మాసిటీకి బదులుగా మెగా టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని, దానివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్, పీసీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి అన్నారు. ఫార్మాసిటీని ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం చిత్రపటానికి పీసీసీ ప్రచార కార్యదర్శి మల్లేష్, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి లతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు, యాచారం మండలాల్లో సేకరించిన 14వేల ఎకరాల భూములలో గత పాలకులు ఫార్మాసిటీని నెలకొల్పడానికి ప్రయత్నించారని, పరిశ్రమలను నెలకొల్పడం వలన ఈ ప్రాంత ప్రజలు రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీర్కాన్‌పేట, సాయిరెడ్డిగూడ, ముచ్చర్ల, సార్లరావులనల్లి గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీకి బదులుగా మెగాటౌన్‌షిప్ ఏర్పాటు చేయడం పట్ల సీపీఎం నేతలు డి.రాంచందర్ బి.శ్రీనివా్‌సలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో మీర్కాన్‌పేట మాజీ సర్పంచ్ నర్సింహ, నాయకులు ఎ.సత్యనారాయణ, కె.పాండురంగారెడ్డి, అప్జల్‌బేగ్, సరికొండ పాండు కురుమ, ఇంద్రకంటి రాకే్‌షగౌడ్, ఎస్ వెంకట్‌రాంరెడ్డి, రాణాప్రతా్‌పరెడ్డి, డి.నర్సింహాచారి, సరికొండ జగన్, ఎస్.వెంకటే్‌షగౌడ్, ఆంజనేయులు నాయక్, ఎగ్గిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మెగా టౌన్‌షిప్ నిర్మాణమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమే
ఫార్మాసిటీ వద్దంటే రైతుల భూములను వాపస్ చేయండి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురవారం ఆయన ఇబ్రహీంపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముందు ప్రకటించినట్లుగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగానే ఫార్మాసిటీ తరలింపు దాదాపుగా ఖాయమైంది. యాచారం, కందుకూరు మండలాల పరిధిలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన హైదరాబాద్ గ్రీన్ పార్మాసిటీని హైదరాబాద్ మహానగరానికి దూరంగా తరలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసున్నారు. దీనిని మంచిరెడ్డి తప్పుబట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో పొల్యూటెడ్ టెక్నాలజీతో ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం సంకల్పించి ఇప్పటికే దాదాపుగా భూసేకరణ పూర్తి చేసిందన్నారు. ఇక్కడ ఫార్మా కంపెనీలతోపాటు టౌన్‌షిప్‌లు, అడవుల పెంపకం, యూనివర్సిటీలు, కళాశాలలు ఇలా పలు రకాలుగా అభివృద్ధిలోకి తీసుకురావాలని గత ప్రభుత్వం పూర్తి కార్యచరణ రూపొందించిందన్నారు. అంతేగాక ఈ ప్రాంత యువత, మహిళలకు నైపుణ్య శిక్షణనిచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయింఇచనట్లు ఆయన గుర్తు చేశారు. కాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలనేదే ముందేసుకుంటున్నారని ఇది మంచిది కాదన్నారు. ఫార్మాసిటీని రద్దుచేసి ఇక్కడ మెగా టౌన్‌షిప్ నిర్మించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమనేది ఓ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమేనని ఆయన అన్నారు. ఫార్మాసిటీని ఇక్కడ కాదనుకుంటే రైతుల నుండి సేకరించిన భూములు తిరిగి వాపస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.