సిబ్బంది పనితీరుతోనే సీసీఐకి లాభాలు

ABN , First Publish Date - 2023-05-25T23:21:10+05:30 IST

సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకున్నప్పుడే సీసీఐ కర్మాగారానికి లాభాలు సమకూరుతాయని కేంద్ర సీసీఐ కర్మాగారాల సీఎండీ సంజయ్‌ బంగా అన్నారు.

సిబ్బంది పనితీరుతోనే సీసీఐకి లాభాలు
సీసీఐ కర్మాగారంలో టీబీ పేషంట్లకు కిట్లను పంపిణీ చేసిన సీఎండీ సంజయ్‌ బంగా

తాండూరు రూరల్‌, మే 25: సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకున్నప్పుడే సీసీఐ కర్మాగారానికి లాభాలు సమకూరుతాయని కేంద్ర సీసీఐ కర్మాగారాల సీఎండీ సంజయ్‌ బంగా అన్నారు. తాండూరు మండలం కరన్‌కోట్‌ సీసీఐ కర్మాగారాన్ని గురువారం ఆయన మరోమారు సందర్శించారు. బుధవారం కర్మాగారంలోని ప్యాకింగ్‌ ప్లాంట్‌, సిమెంట్‌మిల్‌, కంట్రోల్‌ రూం వంటి విభాగాలను సందర్శించిన ఆయన ప్యాకింగ్‌ ప్లాంట్‌ విభాగంలో సిమెంటు ఉత్పత్తి జరిగి బెల్టుపై బయటికి వస్తున్న సిమెంటు బస్తాలను పరిశీలించారు. ఆయా విభాగాలకు చెందిన హెచ్‌వోడీలకు కర్మాగారంలో ఉత్పత్తులకు అనుగుణంగా సిమెంటు విక్రయించాలని ఆదేశించారు. అనంతరం మంగళవారం రాత్రికి కరన్‌కోట్‌ సీసీఐలో బసచేశారు. గురువారం ఉదయం కర్మాగారం ఆవరణలో మొక్కలు నాటి 12మంది టీబీ పేషంట్లను గుర్తించారు. వారికి ఆరునెలల వరకు సీసీఐ కర్మాగారం తరఫున రేషన్‌ సరుకులతోపాటు మందుల కిట్లను పంపిణీ చేశారు. ఆయన వెంట జీఎం మహాన, మెకానికల్‌ హెచ్‌వోడీ విపుల్‌ కుమార్‌, ఆయావిభాగాల హెచ్‌వోడీలు ఉన్నారు.

సీఎండీ సందర్శన అందుకేనా?

సీసీఐ కర్మాగారంలో పనిచేసే కార్మికులు వారం రోజుల క్రితం నారాయణపేట్‌ జిల్లాను సందర్శించిన కేంద్ర మంత్రికి సీసీఐ కార్మికుల వేతన సవరణపై వినతిపత్రం అందజేశారు. అప్పట్లో కార్మికులకు త్వరలోనే సీసీఐ కర్మాగారాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. అయితే అట్టి హామీ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి రానున్న విషయం తెలుసుకున్న కేంద్ర సీసీఐ కర్మాగారాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌బంగా సీసీఐ కర్మాగారాన్ని ముందస్తుగా సందర్శించినట్లు సమాచారం. సీఎండీ కర్మాగారాన్ని విజిట్‌ చేసిన అనంతరం కార్మికులకు పలు సూచనలు, సలహాలు అందించినట్లు తెలిసింది. కర్మాగారాన్ని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు కార్మికులు కృషి చేయాలని సూచించారు.

Updated Date - 2023-05-25T23:21:10+05:30 IST