బురిడీ బాబా అరె్‌స్ట.. రిమాండ్‌కు తరలింపు

ABN , First Publish Date - 2023-06-03T00:04:05+05:30 IST

మండలంలోని ఈదులపల్లిలో ఓ మహిళను నమ్మించి నట్టేట ముంచిన బురిడీ బాబాను నందిగామ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

బురిడీ బాబా అరె్‌స్ట.. రిమాండ్‌కు తరలింపు

నందిగామ, జూన్‌ 2: మండలంలోని ఈదులపల్లిలో ఓ మహిళను నమ్మించి నట్టేట ముంచిన బురిడీ బాబాను నందిగామ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపూర్‌ జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన ముగ్గు ఎర్రసుంకన్న నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలోని శ్రీశైలం రోడ్డులో గుడిసె వేసుకుని బట్టలు అమ్ముతుంటాడు. ఈజీ మనీ కోసం బురిడీబాబా అవతారం ఎత్తి.. ప్రజలను మోసం చేస్తుండేవాడు. ఈక్రమంలో నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన వానరాసి సునీత దగ్గరకు రెండు నెలల క్రితం వచ్చాడు. తనకు జ్యోతిషం తెలుసునని ఆమె భర్తకు గండం ఉందని, ఆ గండం పోవడానికి పూజలు చేస్తానని చెప్పాఊడు. అందుకు ఆమెను పరిహారం ఇవ్వాల్సిందిగా సూచించాడు. దీంతో ఆమె మొదట రూ.15 వేలు ముట్టజెప్పింది. అనంతరం పూజలు చేయాలని.. తాను తర్వాత వస్తానని వెళ్లిపోయాడు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ వచ్చాడు. దీంతో ఆమె అతడిని నమ్మడంతో మరో పథకం వేశాడు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని.. తవ్వితే బోలెడంత బంగారం బయటకి వస్తుందని నమ్మించాడు. కానీ, ఈ విషయం తన భర్తతో సహా ఎవ్వరికీ చెప్పొద్దని, ఎవరికైనా చెబితే నీ భర్తకు ప్రాణహాని ఉంటుందని హెచ్చరించాడు. బంగారం బయటకు తీయాలంటే రూ.2.50లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు. సునీత డబ్బులు మొత్తం ఇచ్చేసింది. రెండు నెలలైనా అతడు ఇంటికి రాకపోవడంతో విషయాన్ని భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, శుక్రవారం నిందితుడిని కల్వకుర్తిలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2023-06-03T00:04:05+05:30 IST