పుస్తకాలొచ్చేశాయ్‌!

ABN , First Publish Date - 2023-06-02T23:33:09+05:30 IST

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈవిద్యాసంవత్సరం స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 పుస్తకాలొచ్చేశాయ్‌!

మేడ్చల్‌ జిల్లాకు చేరిన 70 శాతం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు

2.50 లక్షల పుస్తకాలు పాఠశాలలకు పంపిణీ

పార్ట్‌-1, పార్ట్‌- 2 గా విభజన

స్కూళ్ల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేత

మేడ్చల్‌ జూన్‌ 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈవిద్యాసంవత్సరం స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత విద్యాసంవత్సరం సగం రోజులు గడిచినా పుస్తకాలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఈ విద్యాసంవత్సరం ఏర్పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 2వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ద్విభాషా పుస్తకాలు(ఒకే పుస్తకంలో ఒకవైపు ఇంగ్లీష్‌ మీడియం, మరోవైపు తెలుగు మీడియం పాఠాలు) అందించనున్నారు. పేజీల సంఖ్య, బరువు పెరుగడంతో ఆప్షన్స్‌ సబ్జెక్టులను(మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌) పార్ట్‌ 1, పార్ట్‌2 గా విభజించి విద్యార్థులకు అందించనున్నారు. మొదటి విడత గా పార్ట్‌- 1 పుస్తకాలు బడుల ప్రారంభోత్సవం రోజు జూన్‌ 12న విద్యార్థులకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పార్ట్‌-పుస్తకాలను అక్టోబర్‌లో ఇవ్వనున్నారు.

మొదటి విడతలో 6 లక్షల పుస్తకాలు అవసరం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పాటు కేజీబీవీ, రెసిడెన్షియల్‌, మైనార్టీ గురుకులాల్లో 1నుంచి 10వ తరగతి వరకు చదివే మొత్తం విద్యార్థులు 98,733 వేల మంది ఉన్నారు. వీరికి ఆరు లక్షల పుస్తకాలు అవసరం. ఇప్పటి వరకు జిల్లాలకు 4,,66,440 పుస్తకాలు 70 శాతం చేరాయి. జూన్‌ 12 వరకు వంద శాతం పుస్తకాలు వచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినపుస్తకాలను ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బడులు ప్రారంభమైన రోజే విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 2.50 లక్షల పుస్తకాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వేశారు. మరో 3 రోజుల్లో మిగిలిన పుస్తకాలు రానున్నాయి. రాగానే పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.

2 నుంచి 9 వరకు ద్విభాషా పుస్తకాలు

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి విద్యార్థులకు పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాలను అందిస్తున్నారు. 2 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ద్విభాషా పుస్తకాలను అందిస్తున్నారు. మొదటి విడతలో పార్ట్‌-1 పుస్తకాలను జూన్‌ 12న అందించనున్నారు. పార్ట్‌-1 విభాగంలో 1వ తరగతి విద్యార్థులకు పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం మొత్తం పుస్తకాలు, 2 నుంచి9వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లతో పాటు ద్విభాషా పుస్తకాలు 50 శాతం ఆప్షన్స్‌ సబ్జెక్టులు(మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌) పుస్తకాలు, 10వ తరగతి విద్యార్థులకు తెలుగు మీడియం ఇంగ్లీష్‌ మీడియం మొత్తం పుస్తకాలను అందిస్తున్నారు. పార్ట్‌-2 విభాగంలో 2 నుంచి 9వ తరగతి వరకు సగం సిలబస్‌ పూర్తయిన తర్వాత మిగిలిన 50 శాతం ఆప్షన్‌ సబ్జెక్టుల పుస్తకాలను అందించనున్నారు.

స్కూళ్ల ప్రారంభం నాటికి విద్యార్థుల చేతిలో పుస్తకాలు : డీఈవో విజయకుమారి

ఈ విద్యా సంవత్సరం బడులు ప్రారంభమైన రోజు నాటికి విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడతలో 70 శాతం వరకు పుస్తకాలు వచ్చాయి. ఇంకో పది రోజుల్లో వంద శాతం పుస్తకాలు వస్తాయి. వీటిని జూన్‌ 11లోపు అన్ని పాఠశాలలకు చేరవేస్తాం. రెండో విడత పుస్తకాలు అక్టోబర్‌లో అందిస్తాం.

Updated Date - 2023-06-02T23:33:30+05:30 IST