మున్సిపల్ నిధుల స్వాహా కేసులో పట్టుబడిన బిల్ కలెక్టర్?
ABN , First Publish Date - 2023-09-19T23:48:49+05:30 IST
: ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో కోట్ల రూపాయాల స్వాహా కేసులో అదృశ్యమైన బిల్‌కలెక్టర్ హేమంత్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడినట్లు విశ్వాసనీయంగా తెలిసింది.

ఏపీలోని గన్నవరంలో అదుపులోకి..
ఘట్‌కేసర్‌కు తరలించిన పోలీసులు
ఘట్‌కేసర్, సెప్టెంబరు 19: ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో కోట్ల రూపాయాల స్వాహా కేసులో అదృశ్యమైన బిల్‌కలెక్టర్ హేమంత్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడినట్లు విశ్వాసనీయంగా తెలిసింది. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ బిల్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న హేమంత్‌కుమార్ మున్సిపాలిటీకి చెందిన రూ.3.13కోట్లను స్వాహా చేశాడని అధికారులు అనుమానం వ్యక్తం చేయడం, ఇంతలో ఆయన అదృశ్యం కావడంతో అతనిపై అనుమానాలు బలపడ్డాయి. ఈనెల 7న సదరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్‌కలెక్టర్ కనిపించక పోవడంతో అతని భార్య ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్‌లో 8వ తేదీన ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతను పూణేలో తలదాచుకున్నట్లు ప్రచారం జరగడంతో అతని కోసం పోలీసులు అక్కడికి వెళ్లి వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో అతని సన్నిహితుల ద్వారా సమాచారం సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకొని ఘట్‌కేసర్‌కు తీసుకొచ్చినట్లు తెలిసింది. బిల్‌కలెక్టర్ హేమంత్ కుమార్‌ను విచారిస్తే నిధుల గోల్‌మాల్ విషయం బయటపడే అవకాశముంది. అతని వద్ద డబ్బులు గానీ, ఆస్తులు గాని ఏమైన ఉన్నాయా? అనే కోణంలో విచారించే అవకాశముంది. దాదాపు మూడేళ్ల నుంచి మున్సిపాలిటీలో నిధులను పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా నమ్మకంగా వ్యవహరిస్తూనే మొత్తం ఖాజనాకు కన్నం వేయడంతో అసలు విషయం తెలుసుకున్న అధికారులు లబోదిబోమంటున్నారు. ఏమాత్రం సంబంధం లేకుండానే తాము ఆర్థికంగా, మానసికంగా, అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోయామని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలను బిల్‌కలెక్టర్ పట్టుబడటంతో కేసు కొలిక్కి వచ్చే అవకాశముందని మున్సిపాలిటీలో జోరుగా చర్చ జరుగుతున్నది.