ఉపశమనం

ABN , First Publish Date - 2023-05-31T23:46:09+05:30 IST

పగలంతా భానుడి భగభగలు... సగటు 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు... అయితే సాయంత్రం అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఉపశమనం

ఒక్కసారిగా మారిన వాతావరణం

పగలు భానుడి భగభగ... సాయంత్రం చిరుజల్లులు

మరో మూడు రోజులు వర్ష సూచన

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, మే 31 : పగలంతా భానుడి భగభగలు... సగటు 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు... అయితే సాయంత్రం అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై చిరుజల్లులు కురవడంతో ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఉక్కబోతల నుంచి ఉపశమనం పొందింది. రోహిణీకార్తె కావడంతో కొద్ది రోజులుగా భానుడు ఉగ్రరూపం చూపుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో సగటు 41 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఎండ తీవ్రత, రాత్రిపూట ఉక్కబోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రివేళ కొన్ని ప్రాంతాల్లో 30 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే బుధవారం సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చల్లటి గాలులతో చిరుజల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సాయంత్రం చల్లటి గాలులకు ప్రజలు ఉపశమనం పొందారు. బుధవారం మధ్యాహ్నం వికారాబాద్‌ జిల్లా యాలాల్‌లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌లో 41.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సాయం త్రం వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రంగారెడ్డిజిల్లా యాచారం మండలం నల్లవెల్లిలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌లో 22.8 డిగ్రీలు, మేడ్చల్‌ జిల్లా కీసరలో 22.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కీసరలో అత్యధిక వర్షం

ఉమ్మడి జిల్లాలో దాదాపు సగం మండలాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మేడ్చల్‌ జిల్లా కీసరలో అత్యధికంగా 42.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డిజిల్లా కందుకూరులో 28 మి.మీ, రాచలూరులో 18.8 మి.మీ, శేరిలింగంపల్లిలో 13.3మి.మీ, గండిపేటలో 10 మి.మీ, కడ్తాల్‌లో 8.3 మి.మీ వర్షం కురిసింది. కుల్కచర్లలో 14.3 మి.మీ, ఘటకేసర్‌లో 7.8 మి.మీ, మాదాపూర్‌లో 7.5 మి.మీ, అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 6.5 మి.మీ, బొమ్మరాశిపేటలో 6.3 మి.మీ వర్షం పడింది. రాత్రి కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. ఇదిలా ఉంటే రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

Updated Date - 2023-05-31T23:46:09+05:30 IST