Share News

‘ఆరోగ్యశ్రీ’తో పేదలందరికీ మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2023-12-10T23:48:26+05:30 IST

ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి అన్నారు.

‘ఆరోగ్యశ్రీ’తో పేదలందరికీ మెరుగైన వైద్యం
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జడ్పీచైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి

మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 10: ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి అన్నారు. మేడ్చల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి నిరుపేద వాడికి రూ.10లక్షలు వర్తించే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నిరుపేదలు నిర్భయంగా ఈ పథకం ద్వార కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఈ పథకం పట్ల నిరుపేదలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని రకాల రోగులు చికిత్స కోసం వినియోగించుకోవచ్చన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకాన్ని వెంటనే ప్రారంభించామన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ప్రజలకు సేవచేసే దిశలో ప్రభుత్వం పనిచేయాలని మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మర్రి దీపిక నర్సింహారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ డీఎం అండ్‌ హెచ్‌ ఓ డాక్టర్‌ ఆనంద్‌, తహసీల్దార్‌ శైలజ, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రమేష్‌, కౌన్సిలర్లు చాపరాజు, భవాని, శివకుమార్‌ యాదవ్‌, సర్పంచ్‌ సురేందర్‌ ముదిరాజ్‌, కోఆప్షన్‌ సభ్యులు మహెబూబ్‌అలీ, గీతా మధుకర్‌ కాంగ్రెస్‌ నాయకులు రమణారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, బూషి రాఘవేందర్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు శేఖర్‌ గౌడ్‌ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రొటోకాల్‌ పాటించ లేదంటూ నిరసన

కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించలేదంటూ గౌడవెల్లి సర్పంచ్‌ సురేందర్‌ ముదిరాజ్‌ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా విదంగా తనకు సమాచారం ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక వద్ద ఏర్పాటుచేసిన బ్యానర్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఫొటో లేకపోవడంతో కొంతమంది నేతలు మండిపడ్డారు. దీంతో అధికారులు, కొందరు నేతలు సముదాయించడంతో శాంతించారు. అధికారిక కార్యక్రమం కావటంతో పార్టీ నేతలకు సంబంధం ఉండదని, కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకు కార్యక్రమం పట్ల సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇకపై ప్రొటోకాల్‌ తప్పనిసరిగా పాటిస్తామని చెప్పారు.

Updated Date - 2023-12-10T23:48:35+05:30 IST