బీటీ రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా?

ABN , First Publish Date - 2023-03-30T23:46:33+05:30 IST

మండల పరిధిలోని పోలెపల్లి గేటు నుంచి పోలెపల్లి మీదుగా మంగళి కుంట తండా వరకు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగాపాడై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బీటీ రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా?
పూర్తిగా పాడైన పోలెపల్లి-మంగళికుంట తండా రోడ్డు

పూర్తిగా పాడైన పోలెపల్లి-మంగళికుంట తండా రోడ్డు

రెండు దశాబ్దాలుగా నిర్వహణకు నోచని రోడ్డు

రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఆమనగల్లు, మార్చి30: మండల పరిధిలోని పోలెపల్లి గేటు నుంచి పోలెపల్లి మీదుగా మంగళి కుంట తండా వరకు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగాపాడై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన 3 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్వహణ లేక కళాహీనంగా మారింది. చాలా చోట్ల బీటీ లేచి, కంకర కొట్టుకుపోయి గోతులేర్పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్డు మరింత దెబ్బతింది. దీంతో తరచూ చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోడ్డు మీదుగా ఆమనగల్లు, వెల్దండ మండలాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు, ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వెల్దండ మండలంలోని అంకమోని కుంట, సల్లపల్లి, బొల్లంపల్లి గ్రామస్థులకు ఈ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మాడ్గుల, ఆమనగల్లు మండలాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదుగానే కల్వకుర్తి పట్టణానికి వెళ్తుంటారు. ప్రస్తుతం పాడైన రోడ్డుతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, యంత్రాలతో కాకుండా కూలీల ద్వారా చేపట్టడం, నిర్వహణ లోపంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పాడైన రోడ్డుకు మరమ్మతు చేసి ఆధునికీకరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నిధులు మంజూరయ్యాయి

పోలెపల్లి గేటు నుంచి మంగళికుంట తండా వరకు మూడు కిలోమీటర్ల పీఆర్‌ రోడ్డు మరమ్మతు, ఆధునికీకరణకు స్థానిక ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ సహకారంతో రూ.60 లక్షలు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం రోడ్డు పూర్తిగా పాడై రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమే.

- దోనాదుల కుమార్‌, ఎంపీటీసీ, పోలెపల్లి

Updated Date - 2023-03-30T23:46:33+05:30 IST