కారు-బైక్ ఢీ.. బ్యాంక్ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2023-03-19T23:36:04+05:30 IST
హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి తక్కళ్లపల్లి గేటు సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి మరణించాడు.

యాచారం, మార్చి 19 : హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి తక్కళ్లపల్లి గేటు సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి మరణించాడు. మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన వస్పరి పర్వతాలు(38) తమ్మలోనిగూడ గేటు సమీపంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం పర్వతాలు తన బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈక్రమంలో తక్కళ్లపల్లి గేటు సమీపంలోకి రాగానే.. కారుడ్రైవర్ వేగంగా వచ్చి సడెన్ బ్రేక్ వేశాడు. వెనకాల బైక్‌పై వస్తున్న పర్వతాలు కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలు కాగా, స్థానికులు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతిచెందాడని ధ్రువీకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్ తెలిపారు.