నేటినుంచి బడిబాట

ABN , First Publish Date - 2023-06-02T23:36:35+05:30 IST

చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.

నేటినుంచి బడిబాట

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 2 : చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. జూన్‌ 3 నుంచి జూన్‌ 17వ తేది వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. జూన్‌ 3 నుంచి 9 వరకు ఉదయం 7గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఇంటింటికీ తిరిగి పిల్లలను, తల్లిదండ్రులను కలిసేలా ప్రణాళిక చేశారు. ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ తరగతులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, రెండు జతల యూనిఫాం అందజేస్తున్న విషయాన్ని ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. పాఠశాల ప్రత్యేకతలు, సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయనున్నారు. బడులు తెరిచాక జూన్‌ 12 నుంచి 17వ తేది వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. జూన్‌ 12న మన ఊరు- మన బడి పేరిట కార్యక్రమం నిర్వహిస్తారు. బడుల్లో పెరిగిన సదుపాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. 13న తొలిమెట్టు కార్యక్రమంపై వివరిస్తారు. జూన్‌ 14న పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభలు నిర్వహిస్తారు. 15వ తేదిన ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం, జూన్‌ 16న బడుల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్‌ మీడియంలో బోధన సదుపాయాలు, రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలపై అవగాహన పెంచుతారు. జూన్‌ 17న బాలికల విద్యపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు.

Updated Date - 2023-06-02T23:36:35+05:30 IST