పత్తి విత్తనాల కృత్రిమ కొరత

ABN , First Publish Date - 2023-06-26T00:21:20+05:30 IST

జిల్లాలో పత్తి విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. విత్తనం, ఎరువులు మొదలు పండించిన పంటను విక్రయించే వరకు రైతులు అష్టకష్టాలనే ఎల్లదీస్తున్నారు.

పత్తి విత్తనాల కృత్రిమ కొరత

దొరకని డిమాండ్‌ కంపెనీల సీడ్‌

వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు

ఎమ్మార్పీ కంటే మూడురెట్ల ఎక్కువకు అమ్మకాలు

రూ.830ప్యాకెట్‌.. రూ.2,500కు విక్రయం

చర్యలు తీసుకోని ప్రభుత్వం

పత్తి రైతుల గగ్గోలు

రైతులను పత్తి విత్తనాల కొతర వేధిస్తోంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దుక్కి చేసిన రైతులు విత్తనాలు విత్తుకుందామంటే కావాల్సిన కంపెనీల సీడ్‌ అందుబాటులో లేవు. నాణ్యత లేని, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. రైతులు కోరుతున్న విత్తనాలను విత్తన వ్యాపారులు మొదలు డీలర్లు సైతం బ్లాక్‌ చేసి కొరత సృష్టిస్తున్నారు. ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాలను ఎమ్మార్పీ కంటే మూడు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.

పరిగి, జూన్‌ 25: జిల్లాలో పత్తి విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. విత్తనం, ఎరువులు మొదలు పండించిన పంటను విక్రయించే వరకు రైతులు అష్టకష్టాలనే ఎల్లదీస్తున్నారు. అధికారులు వ్యాపారులకు వత్తాసు పలకడంతో అడుగడుగునా కర్షకులు దోపిడీకి గురవుతున్నారు. పత్తి విత్తనాలను వ్యాపారులు బ్లాక్‌ చేసి కొరత సృష్టిస్తూ.. ఎమ్మార్పీ కంటే మూడింతల ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. ఎక్కువ డిమాండ్‌ ఉన్న కంపెనీల విత్తనాల కొరత సృష్టిస్తున్నారు. ఏ రకమైన విత్తనాలైనా ఒకటేనని వ్యవసాయాధికారులు చెబుతున్నా రైతులు మాత్రం కొన్ని కంపెనీల విత్తనాలనే ఆడుగుతున్నారు. ఈ సారి వర్షాల ఆలస్యానికి తోడు విత్తన కొరతతో రైతులు పాట్లు పడుతున్నారు. మార్కెట్‌లో పత్తికి ధర బాగా ఉండడంతో రైతులు కాటన్‌ సాగుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో గతేడాది 1.9లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయగా, రైతుల ఆసక్తి నేపథ్యంలో ఈ సారి 2.5లక్షల ఎకరాల మేర వేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. విత్తనాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఎక్కువ రేట్లకు విత్తనాలు అమ్ముతున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

కొన్ని కంపెనీల విత్తనాలకు భారీ డిమాండ్‌

తులసి, రాశి, అంబూజ, మహికో, క్యాష్‌, ఏటీఎం సిమ్రాన్‌, బయోసీడ్‌, జయాగోల్డ్‌, చంద్రగోవా, సదానంద్‌, ప్రవర్ధన్‌, రేవంత్‌, యాక్స్‌ తదితర బ్రాండ్ల పేరుతో మార్కెట్లో పత్తి విత్తనాలు ఉన్నాయి. కాగా రైతులు ఎక్కువగా ప్రవర్ధన్‌, సదానంద్‌ కంపెనీల విత్తనాలనే అడుగుతున్నారు. పత్తి బాగా దిగుబడి వస్తే ఎకరానికి 12 నుంచి 15క్వింటాళ్లు వస్తుంది. గతేడాది ప్రవర్ధన్‌, సదానంద్‌ విత్తనాలతో సాగు చేసిన రైతులకు ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడొచ్చింది. దీంతో రైతులు ఈ రెండు రకాల విత్తనాలనే ఎక్కువగా అడుగుతున్నారు. మార్కెట్లో ఈ రెండు బ్రాండ్ల విత్తనాలూ కొరత ఉన్నాయి. ఈ కంపెనీ విత్తనాలను సరఫరా చేసే డిస్ర్టిబ్యూటర్ల వద్ద నుంచే కొరత సృష్టిస్తున్నారు. ప్రవర్ధన్‌ విత్తనాలకు పెద్దఉమ్మెంతాల్‌కు చెందిన వ్యాపారి, సదానంద్‌ లాల్‌పహాడ్‌ వ్యాపారి డిస్ర్టిబ్యూటర్లుగా ఉన్నారు. వీరి నుంచే కొరత సృష్టి మొదలైతోందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 475 గ్రాముల విత్తన ప్యాకెట్‌ ఎమ్మార్పీ రూ.850 ఉంటే రూ.2,000 నుంచి రూ.2,500కు అమ్ముతున్నారు. అయినా ఈ విత్తనాలపై ఉన్న నమ్మకంతో ఎక్కువ రేటుకైనా కొంటున్నారు. అవి కూడా వ్యాపారులు తమ అనుకూలురకు మాత్రమే విక్రయిస్తున్నారు. ఎకరానికి కిలో(రెండు ప్యాకెట్లు) విత్తనాలు అవసరం. వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడం ద్వారా ఒక్క పత్తి విత్తనాలపైనే రూ.80కోట్ల నుంచి వంద కోట్ల వరకు రైతుల నుంచి అదనంగా దండుకుంటున్నారు. ఇక మిగతా విత్తనాలపై వచ్చే లాభాలూ ఉంటాయి. ఈ దోపిడీ అంతా వ్యవసాయ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

నాకు ప్రవర్ధన్‌ విత్తనాలే కావాలి : రాములు, రైతు, బాసుపల్లి

మార్కెట్‌లో మేం కావాలంటున్న పత్తి విత్తనాలు దొరకడం లేదు. కామన్‌ సీడ్‌ కూడా లేదనే చెబుతున్నారు. నేను గతేడాది ప్రవర్ధన్‌ సీడ్‌ వేశాను. ఎకరానికి 20క్వింటాళ్ల దిగుబడొచ్చింది. ఈసారి కూడా అవే విత్తనాలు వేయాలనుకుంటున్నా. అయితే ఆ విత్తనం లభించడం లేదు. దొరికినా రూ.830 ఉన్న ప్యాకెట్‌ను రూ.2,500కు అమ్ముతున్నారు. అయినా కొంటాం. అవీ తెలిసిన వాళ్లకే ఇస్తున్నారు. బ్లాక్‌ అమ్మకాలతో పట్టిస్తారనే భయంతో నమ్మకస్తులకే ఇస్తున్నారు. ఈ దోపిడీపై అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదు.

గోనూరులో నకిలీ విత్తనాల అమ్మకాలు

తాండూరు రూరల్‌: మండల వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లేక కల్తీ విత్తనాల అమ్మకాలు సాగతున్నాయి. గోనూరులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యాపారులు కొందరు రైతులకు గ్లైసిల్‌ అనే బ్రాండ్‌ నకిలీ పత్తి విత్తనాలను అమ్మారు. వారం రోజుల కింద గోనూరుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులొచ్చి సోదా చేయడంతో నకిలీ విత్తన వ్యాపారుల బండారం బయటపడింది. పోలీసు విచాణలో రాయచూర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన కొందరు వ్యాపారులు గోనూరులో స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు గుర్తించారు. వడ్డె ఎల్లప్ప, వడ్డె గోపాల్‌ ప్లాస్టిక్‌ సంచిలో 20కిలోల పత్తి విత్తనాలు తెచ్చి అమ్మినట్లు గుర్తించారు. ఈ విత్తనాల ప్యాకెట్లపై కంపెనీ అడ్రస్‌, బ్యాచ్‌/లాట్‌ నంబర్‌, గడువు తేదీ ఏమీ లేవు. ఈ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని కరన్‌కోట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంతమంది రైతులకు విక్రయించారనేదానిపై విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-06-26T00:21:20+05:30 IST