యాసంగి కొనుగోళ్లకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-03-19T22:42:29+05:30 IST

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు మేడ్చల్‌ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

యాసంగి కొనుగోళ్లకు ఏర్పాట్లు
పూడూరులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం(ఫైల్‌)

ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధాన్యం సెంటర్లు

మేడ్చల్‌ జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటు

30వేల టన్నుల ధాన్యం సేకరణకు సన్నాహాలు

7.5లక్షల గోనె సంచులు సిద్ధం : జిల్లా సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌

యాసంగి వరి పంట మరి కొద్ది రోజుల్లో చేతికందనున్న తరుణంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మేడ్చల్‌ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోకేంద్రాలను ప్రారంభించనున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో 11 వడ్ల కొనుగోలు కేంద్రాలను నిర్వహించనున్నారు. ఈ సీజన్‌లో 30వేల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల ఏర్పాటు ప్రదేశాలను గుర్తించారు.

మేడ్చల్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగి ధాన్యం కొనుగోళ్లకు మేడ్చల్‌ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్‌ నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ యాసంగిలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలేర్పాటు చేస్తారు. మేడ్చల్‌, డబిల్‌పూర్‌, పూడూరు, శామీర్‌పేట, కీసర, కేశవరం, లక్ష్మాపూర్‌, ఉద్దమర్రి, ప్రతాపసింగారం, ఏదులాబాద్‌, మాదారం, మూడుచింతలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 30వేల టన్నుల వడ్లు కొనేందుకు లక్ష్యంగా పెట్టుకున్నా 25వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో ధాన్యం దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. గతేడాది 10,454 ఎకరాల్లో వరి సాగు చేయగా 28వేల టన్నుల ధాన్యం వచ్చింది. ఈ ఏడాది 13,015 ఎకరాల్లో వరి వేశారు. ఈ మేరకు దిగుబడీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈసారి మద్దతు ధర పెంపు

వరి మద్దతు ధరను ప్రభుత్వం ఈసారి క్వింటాలుకు రూ.100 చొప్పున పెంచింది. గ్రేడ్‌-ఎ రకం ధాన్యం క్వింటాలుకు గతేడాది రూ.1,960 ఉండగా ఈసారి ధర రూ.2,060 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. సాధారణ రకం ధాన్యానికి గతంలో రూ.1,940 ఇవ్వగా ఇప్పుడా రేటును రూ.2,040కి పెంచారు. భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) సూచించిన నిబంధనల మేరకు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. వడ్లను శుభ్రంగా తూర్పారబట్టి, తాలు, మట్టి బెడ్డలు లేకుండా చూసుకొని నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా ఎండబోసి కాంటకు తెచ్చి రైతులు మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

అవసరమైన మేర గోనె సంచులు సిద్ధం

ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచులను అధికారులు సిద్ధం చేశారు. 30వేల టన్నుల వడ్ల కొనుగోళ్లకు 7లక్షల సంచులు అవసరముండగా 7.5లక్షల బ్యాగులను సిద్ధం చేసినట్టు పౌరసరఫాల శాఖ అధికారులు పేర్కొన్నారు. కొనుగోళ్లకు అవసరమైన ఎలక్ర్టానిక్‌ వెయింగ్‌ మిషన్లు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, ఇతర సామగ్రి అన్నీ అందుబాటులో ఉంచుతామని వారు తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని ఐదు రైస్‌ మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూర్చేందుకు చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు. కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు.

అన్ని ఏర్పాట్లూ చేశాం : జి.రాజేందర్‌, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌

మేడ్చల్‌ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఏప్రిల్‌ మొదటి వారంలో కేంద్రాలను ప్రారంభిస్తాం. 7.5లక్షల గన్నీ బ్యాగులను ఇప్పటికే సిద్ధం చేశాం. గతంలో తలెత్తిన ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందడంతో పాటు మోసాలకు గురికాకుండా ఉండొచ్చు. వ్యాపారులు ఆశ్రయించొద్దు.

Updated Date - 2023-03-19T22:42:29+05:30 IST