Share News

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌, మరో యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-11-01T00:01:17+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌తో పాటు ఓ యువకుడు మృతి చెందారు. ఈ ఘటన మండలంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌, మరో యువకుడి మృతి
ఇస్మాయిల్‌పూర్‌లో జవాన్‌ అంత్యక్రియలు

బొంరా్‌సపేట్‌, అక్టోబరు 31: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌తో పాటు ఓ యువకుడు మృతి చెందారు. ఈ ఘటన మండలంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇస్మాయిల్‌పూర్‌ తండాకు చెందిన లక్ష్మీబాయి, హుమ్యానాయక్‌ దంపతుల కుమారుడు బల్‌రాం(25) ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బల్‌రాంకు పూడూరు మండలం తిర్మాలాపూర్‌ తండాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్‌మెంట్‌ కోసం ఆర్మీ జవాన్‌తో పాటు కుటుంబ సభ్యులు సోమవారం తండాకు చేరుకున్నారు. కార్యక్రమం అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు వెళ్లిపోయాక అదే తండాకు చెందిన నవీన్‌ (16)తో కలిసి బల్‌రాం బైక్‌పై రాత్రి సమయంలో సొంత గ్రామం ఇస్మాయిల్‌పూర్‌కు బయలుదేరాడు. మార్గమధ్యలో రేగడిమైలారం పరిధి హైవే పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. మృతదేహాలను వారి గ్రామాలకు చేర్చారు. ఆర్మీ జవాన్‌ బల్‌రాం మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తోటి ఆర్మీ జవాన్లు ఇస్మాయిల్‌పూర్‌ తండాకు వచ్చారు. మంగళవారం తండాలో బల్‌రాం పార్థివదేహంపై ఆర్మీ లాంఛనాలతో త్రీవర్ణ పతకాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తండాకు చెందిన ఆర్మీ జవాన్‌ బల్‌రాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-11-01T00:01:17+05:30 IST