మైనింగ్ తవ్వకాలపై ఏడీ విచారణ
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:15 AM
అక్రమ మైనింగ్ తవ్వకాలపై తాండూరు మైన్స్ ఏడీ శామెల్ జాకబ్ శనివారం గనుల్లో తిరిగి విచారణ చేపట్టారు.
తాండూరు రూరల్, డిసెంబరు 30: అక్రమ మైనింగ్ తవ్వకాలపై తాండూరు మైన్స్ ఏడీ శామెల్ జాకబ్ శనివారం గనుల్లో తిరిగి విచారణ చేపట్టారు. మండలంలోని కరన్‌కోట్ గ్రామానికి చెందిన నామ్‌దార్ సురేందర్, భార్య విజయలక్ష్మీ అక్రమ తవ్వకాలపై వారం రోజుల కిందట కలెక్టర్ నారాయణరెడ్డికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఇట్టి ఫిర్యాదును స్వీకరించిన మైన్స్ ఏడీ జాకబ్‌తోపాటు విద్యుత్ శాఖ, మైన్స్ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. విజయలక్ష్మి తన భర్త పేరిట కరన్‌కోట్ గ్రామ శివారులోని సర్వేనెంబర్-2లో 1 ఎకరాల 25గుంటల భూమిని ప్రభుత్వం 2009లో తన భర్త నామ్‌దార్ సురేందర్ పేరిట కేటాయించిందని, అయితే 2017లో తన భర్త మృతిచెందగా 2018లో లీజు కోసం దరఖాస్తు చేసుకున్నామని ఏడీతో వివరించింది. అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది మల్లికార్జున్ పేరిట సుధాకర్, బసప్ప, అయ్యప్పలు సమీపంలోని సర్వేనెంబర్-2లోనే అక్రమ తవ్వకాలు జరుపుతూ తన భూమిలో కూడా అక్రమ తవ్వకాలు జరిపి విలువైన నాపరాతిని కొల్లగొట్టారని ఆరోపించింది. ఇట్టి భూమిపై కరన్‌కోట్ గ్రామానికి చెందిన కొందరు నకిలీ ధృవపత్రాలు సృష్టించి విలువైన తమ నాపరాతి భూమిలో తవ్వకాలు జరిపి తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయింది. ఈ మేరకు ఏడీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమేరకు తవ్వకాలు జరిపారు? సురేందర్‌పేరిట ఎన్ని ఎకరాల్లో నాపరాతి విస్తరించి ఉందనే దానిపై సమగ్ర వివరాలు సేకరించారు. మల్లికార్జున సొసైటీ వారు ఏ మేరకు తవ్వకాలు జరిపారనే దానిపై పరిశీలించారు. అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామన్నారు. తవ్వకాలు జరుపకుండా నాలుగు విద్యుత్ సరఫరా లైన్లను సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా మిషన్లను సీజ్ చేశామన్నారు. ఆయన వెంట మైన్స్ ఆర్‌ఐ రవి, విద్యుత్ శాఖ అధికారులు, మల్లికార్జున సొసైటీ సభ్యులున్నారు.