బస్సుల్లో వరుస దొంగతనాలు
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:51 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించిన నాటి నుంచి బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జేబు దొంగలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు.
వికారాబాద్, డిసెంబరు 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించిన నాటి నుంచి బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జేబు దొంగలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో వికా రాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న మంబాపూర్ గ్రామానికి చెందిన ఆర్.శిరీష ఎన్టీఆర్ చౌరస్తాలో తాండూరు బస్సు ఎక్కుతుండగా పర్సు పోగొట్టుకుంది. అందులో రూ.5వేల నగదు, ఆధార్‌కార్డు ఇతర కార్డులు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. అదేవిధంగా సాయంత్రం తాండూరు నుంచి వికారాబాద్‌కు బస్సులో వచ్చిన బైసింగ్ అనే వ్యక్తి ఫోన్ ఎవరో కొట్టేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు కానిస్టేబుళ్లు వికారాబాద్ బస్టాండ్‌కు చేరుకున్న బస్సులో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను ఒక్కొక్కరిగా తనిఖీలు చేశారు. బస్టాండుల్లో, ప్రధాన కూడళ్లలో బస్సు ఎక్కే క్రమంలో జేబు దొంగలు ఇలా చేస్తున్నారని అక్కడ పోలీసు భద్రత కల్పిస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.