అట్టహాసంగా గులాబీ మినీ ప్లీనరీ
ABN , First Publish Date - 2023-04-26T00:56:06+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ మంగళవారం నియోజకవర్గ స్థాయి ప్లీనరీని నిర్వహించింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ నియోజవర్గ స్థాయిలో సభలు, సమావేశాలు
పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు
భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
వాడవాడలా ఎగిరిన పార్టీ జెండాలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ మంగళవారం నియోజకవర్గ స్థాయి ప్లీనరీని నిర్వహించింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు ఏర్పాటు చేశారు. గులాబీ ముఖ్య నాయకులంతా ఈ కార్య క్రమంలో పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరిం చారు. అమరవీరులకు నివాళులర్పించారు. పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలను ఎండగట్టారు.
బీఆర్‌ఎస్‌దే మళ్లీ అధికారం : మంత్రి సబితారెడ్డి
మహేశ్వరం, ఏప్రిల్ 25 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం సుల్తాన్‌పూర్ పరిధిలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, సీఎం కేసీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గం అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఓట్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనితాడ్డితో కలిసి మంత్రి అమరులకు నివాళులర్పించారు.
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం నెంబర్ వన్
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం : రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ వన్‌గా తీర్చిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని, అందుకే దేశానికి ఆయన నాయకత్వం వహించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మన్నెగూడలోని వేద కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కేంద్రంలో బీజేపీ పేదలను కొట్టి పెద్దలకు దోచి పెడుతుందని ఆరోపించారు. ధరలు విచ్చలవిడిగా పెంచుతున్నారని కేసీఆర్ నిలదీస్తే.. ఈడీ, సీబీఐలతో బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.2391 కోట్ల వ్యయంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్లీనరీలో వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలను ప్రవేశ పెట్టారు. కార్యక్రమంలో క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (బంటి), సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, చంద్రయ్య, బూడిద రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు : ఎంపీ రంజిత్‌రెడ్డి
చేవెళ్ల : వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ సమావేశం ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధుల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రూ.5.180 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ మొదలైందన్నారు. హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి రోడ్డు భూసేకరణ 72శాతం పూర్తయిందని, ఏడాదిలో రోడ్డు అందుబాటులోకి వస్తుందన్నారు. జీవో 111 ఎత్తి వేసి చేవెళ్ల రైతులకు సీఎం కేసీఆర్ మేలు చేశారని చెప్పారు. అంతకు ముందు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ కింద రూ.72.52 కోట్లు ఇచ్చామన్నారు. ఆసరా పింఛన్లు ప్రతి నెలా రూ.7.33 కోట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రూ.584 కోట్లతో ఆర్‌అండ్‌బీ, రూ.310 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు వేశామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద నియోజకవర్గంలో కే,12.50 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. బీసీల కోసం ప్రత్యేకంగా బీసీ మంత్రితత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిని నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. అంతకు ముందు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్‌తో ముందుకు సాగుతూ అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. మినీ ప్లీనరి సందర్భంగా చేవెళ్లలో మహిళలు బోనాలతో తరలివచ్చారు. బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే పార్టీజెండాను ఆవిష్కరించి అంబేడ్కర్, పూలే, బాబు జగ్జీన్‌రామ్ విగ్రహలకు పూలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విజయలక్ష్మి, గోవర్థన్‌రెడ్డి, నక్షత్రం, భవాని, శివప్రసాద్, ఎం. మాలతి, శ్రీకాంత్, జయమ్మ, అవినా్‌షరెడ్డి, గోవిందమ్మ, ప్రభాకర్, మహేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, స్వప్న, పాపారావు, నర్సింలు, బాల్‌రాజ్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర అభివృద్ధి దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్‌అర్బన్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ తెలిపారు. మంగళవారం షాద్‌నగర్ ఏవీ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ సమావేశానికి విచ్చేసి మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు దశల వారీగా కొనసాగుతున్నాయన్నారు. ఉదండపూర్ పనులు పూర్తి కాగానే లక్ష్మీదేవి పల్లి పనులు ప్రారంభించి షాద్‌నగర్ నియోజక వర్గంలోని ప్రతి గుంటకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలంలోని కిషన్‌నగర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. శంకర్‌రెడ్డి, కమ్మదనం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రమణారెడ్డి, చటాన్‌పల్లి గ్రామానికి చెందిన మహేష్‌మాలలు తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార సొసైటీల చైర్మన్ రాజా వరప్రసాద్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్, జడ్పీ వైస్ చైర్మన్ ఈటే గణేష్, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కె. నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, వై.రవీందర్‌యాదవ్, ఖాజా ఇద్రీష్ అహ్మద్, ప్రియాంకశివశంకర్‌గౌడ్, పి.వెంకట్‌రాంరెడ్డి, శ్రీలత లక్ష్మీనారాయణ, బంగారు స్వరూప, తాండ్ర విశాలశ్రవణ్‌రెడ్డి, బక్కన్నయాదవ్, జి.అశోక్, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనను కోరుకుంటున్న దేశ ప్రజలు : కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్
ఆమనగల్లు : సీఎం కేసీఆర్ జనరంజక, సంక్షేమ పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్ పార్టీ మరోమారు అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆమనగల్లులోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ప్లీనరీలో ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్ మాట్లాడారు. దేశ రాజకీయాలలో బీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని విపక్ష పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలను, నేతలను వేధింపులకు గురి చేస్తుందని వారు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తుందని మండి పడ్డారు. ప్లీనరీలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అంతకు ముందు పట్టణంలోని బస్టాండ్ ఎదుట పార్టీ జెండాను ఎంపీ రాములుతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అక్కడి నుండి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్లీనరీలో వివిధ అంశాలపై పలువురు నాయకులు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో శ్రీనివా్‌సరెడ్డి, విజయ్‌గౌడ్, ఎడ్మ సత్యం, అనురాధపత్యనాయక్, దశరథ్‌నాయక్, విజితారెడ్డి, కమ్లినాయక్, మనోహర, విజయ, జక్కు అనంతరెడ్డి, శంకర్‌నాయక్, శాంతి, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, సిఎల్ శ్రీనివా్‌సయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం : ఎంపీ రాములు
కడ్తాల్ : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. మంగళవారం కడ్తాలలో పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్‌ఎస్ మినీ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం పార్టీ బిఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి వృద్ధులు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.