కారు, బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:06 AM
కారు, బైక్ ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వ్యక్తి చికిత్స సొందుతూ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ శివారులో జరిగింది.
న్యాయం కోసం మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద రాస్తారోకో
కొందుర్గు, డిసెంబరు 25 : కారు, బైక్ ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వ్యక్తి చికిత్స సొందుతూ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ శివారులో జరిగింది. కాగా తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబీకులు ఆదివారం మృతదేహంతో రాస్తారోకో చేశారు. ఈ సంఘటనకు సంబంధించి షాద్‌నగర్ రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చౌదరిగూడ గ్రామానికి చెందిన జాండ్ర చంద్రశేఖర్(31) ఆదివారం రాత్రి షాద్‌నగర్ నుంచి చౌదరిగూడకు బైక్‌పై వస్తుండగా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ శివారు సబ్‌స్టేషన్ వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో చంద్రశేఖర్‌కు కుడికాలు విరగడంతో పాటు ఇతర చోట్లా గాయాలయ్యాయి. అతడిని మొదట షాద్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి ఓ ప్రైవేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రశేఖర్ ఆదివారం రాత్రి 11.30కి మృతిచెందాడు. అతడికి భార్య పూజిత, 3 నెలల కూతురు ఉంది. చంద్రశేఖర్ పిన్ని భానుశ్రీ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై కృష్ణయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. చంద్రశేఖర్ మృత దేహాన్ని చౌదరిగూడ తీసుకువస్తూ సోమవారం మధ్యాహ్నం కొందుర్గులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద షాద్‌నగర్-పరిగి రోడ్డుపై కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేశారు. చంద్రశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అరగంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చంద్రశేఖర్ కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హమీ ఇచ్చి రాస్తారోకో విరమింపజేశారు.