కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2023-03-26T00:03:14+05:30 IST

కేంద్రప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తెలిపారు.

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
సమావేశంలో మాట్లాడుతున్న జంగయ్య

ఇబ్రహీంపట్నం, మార్చి 25 : కేంద్రప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నంలో జరిగిన సీపీఐ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందంటూ ఆరోపించారు. నల్లధనాన్ని వెలికితీస్తామంటూ ప్రజలను మోసం చేశారని, ఏటా 2లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఇంటింటికీ సీపీఐ పేరుతో ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి నుంచి మే 15 వరకు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రవీంద్రచారి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. అభివృద్ధి పేరిట దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు నిదులు కేటాయించకుండా అన్యాయం చేశారంటూ విమర్శించారు. జిల్లాలో భూదాన్‌ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. ఫార్మాసిటీ భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నందున సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సీసీఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నర్సింహ, ఓ.యాదయ్యగౌడ్‌, ముత్యాల యాదగిరిరెడ్డి, పర్వతాలు, జిల్లా కార్యవర్గసభ్యులు నీలమ్మ, నాయకులు అలీమొద్దీన్‌, శివరాల లక్ష్మయ్య, పూల యాదయ్య తదితరులున్నారు.

Updated Date - 2023-03-26T00:03:14+05:30 IST