Allu Arjun: అంబరాన్ని అంటిన ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన బన్నీ

ABN , First Publish Date - 2023-08-24T19:39:34+05:30 IST

మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కితే.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. అప్పటివరకూ పడ్డ కష్టం మొత్తం ఒక్కసారిగా మర్చిపోయి.. ఆ సంతోష ఘడియల్ని ఆస్వాదిస్తాం. ఒకవేళ దీనికి ప్రోత్సాహకం కూడా తోడైతే..

Allu Arjun: అంబరాన్ని అంటిన ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన బన్నీ

మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కితే.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. అప్పటివరకూ పడ్డ కష్టం మొత్తం ఒక్కసారిగా మర్చిపోయి.. ఆ సంతోష ఘడియల్ని ఆస్వాదిస్తాం. ఒకవేళ దీనికి ప్రోత్సాహకం కూడా తోడైతే.. ఇక సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఆ సందర్భాన్ని పండుగలాగా జరుపుకుంటాం. ఇప్పుడు పుష్ప చిత్రబృందం కూడా అదే స్థాయిలో సెలెబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారం లభించడంతో.. ‘పుష్ప’ సినిమా యూనిట్ అంబరాన్ని అంటేలా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది కేవలం ఒక్క ‘పుష్ప’ యూనిట్‌కే కాదు.. తెలుగు చిత్రసీమకే ఎంతో గర్వకారణం. ఎందుకంటే.. ఇప్పటివరకూ ఏ తెలుగు నటుడు కూడా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ అవార్డ్‌ని తెచ్చిపెట్టి, టాలీవుడ్‌ని ఉన్నతస్థానాల్లో నిలబెట్టాడు.


తనకు ఈ పురస్కారాన్ని ప్రకటించడమే ఆలస్యం.. బన్నీ ఆనందంతో దర్శకుడు సుకుమార్‌ని ఆలింగనం చేసుకున్నాడు. తనకు ఈ అవార్డ్ రావడానికి కారణం.. ‘పుష్ప’ పాత్రని అద్భుతంగా మలిచిన దర్శకుడు సుకుమార్ హస్తం ఉంది కాబట్టి, సుకుమార్‌ని పట్టుకొని బన్నీ కన్నీరు పెట్టుకున్నాడు. సుకుమార్ కళ్ల నుంచి కూడా ఆనందభాష్పాలు వచ్చాయి. చిత్రబృందం ఈ అద్భుతమైన దృశ్యానికి సంబంధించిన వీడియోని ట్విటర్‌లో పంచుకుంది. ఈ వేడుకల్లో పుష్ప నిర్మాతలతో పాటు ప్రముఖ నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్, బన్నీ భార్య స్నేహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అటు.. బన్నీ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి ఉత్తమ జాతీయ పురస్కారం రావడంతో గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. నెట్టింట్లో ఈ వీడియోని షేర్ చేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. చివరగా ఒక మాట.. ఈ పురస్కారంతో ఇక పుష్ప ‘తగ్గేదే లే’దని చెప్పుకోవచ్చు. పార్ట్ 2తో మరింత ప్రభంజనాలు సృష్టించడానికి ఈ అవార్డ్ వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు.

Updated Date - 2023-08-24T19:39:34+05:30 IST