Share News

NTR statue: అమీర్‌పేటలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తా..

ABN , First Publish Date - 2023-11-19T11:27:33+05:30 IST

తనకు రాజకీయ బిక్ష పెట్టిన మహానీయుడు ఎన్‌టీఆర్‌ను ఎప్పటికీ మరువనని, అమీర్‌పేటలో ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని

NTR statue: అమీర్‌పేటలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తా..

- అధికారం ఎవరికీ శాశ్వతం కాదు

- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సనత్‌నగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తనకు రాజకీయ బిక్ష పెట్టిన మహానీయుడు ఎన్‌టీఆర్‌ను ఎప్పటికీ మరువనని, అమీర్‌పేటలో ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని సనత్‌ నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Thalasani Srinivas Yadav) స్ఫష్టం చేశారు. కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం సనత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, అధికారంలో ఉన్నవారు వ్యక్తిగత కక్షసాధింపు చర్యలు చేయడం సరికాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Former Chief Minister Chandrababu Naidu) పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తలసాని ఖండించారు. ఎన్టీఆర్‌ 1994లో తనను ఆశీర్వదించి పార్టీ టికెట్‌ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. అప్పుడు నాటిన మొక్కగా ఉన్న శ్రీనివాస్‌ యాదవ్‌ నేడు వృక్షంగా మారి రాజకీయాల్లో ఉన్నానని, ఇదంతా ఎన్‌టీఆర్‌ దయ అన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మహా వ్యక్తి ఎన్‌టీఆర్‌ను జీవితాంతం మరువనన్నారు. ఎప్పుడూ కమ్మవారి సేవా సమితి వెంటే ఉంటానని, ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మదుసూధన్‌రావు, కార్పొరేటర్‌ లక్ష్మీబాల్‌రెడ్డి, శాయిలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం తలసాని సనత్‌నగర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

mmmm.jpg

ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్‌ఎస్‏దే విజయం

అమీర్‌పేట: ఎన్నికల్లో అనైతికంగా గెలిచేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అమలుకాని హామీలు ఇస్తూ జిమ్మికులు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని తలసాని అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‏దే విజయమని ఆయన ధీమావ్యక్తం చేశారు. అమీర్‌పేట డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు శేఖర్‌, శ్రీనివాస్‌, అబ్దుల్‌ వాహీద్‌, రషీద్‌ వెంకట్‌ యాదవ్‌, నవీన్‌, నూతన్‌ బీఆర్‌ఎ్‌సలో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు విస్మరించిన కాంగ్రెస్‌, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు నిధులు ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. రూ.400 ఉన్న సిలిండర్‌ ధర రూ.1,200లు పెంచారని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపారని ఆరోపించారు.

Updated Date - 2023-11-19T11:27:35+05:30 IST