ఏకగ్రీవ పంచాయతీలకు నజరాన విడుదలయ్యేనా?
ABN , First Publish Date - 2023-04-03T00:15:32+05:30 IST
ఎన్నికలంటే సుక్క.. ముక్క.. పైస లేనిదే ఓటు వేయని ఈ రోజుల్లో ప్రజలంతా కలిసి తమ గ్రామాలను అభివృద్ధిమయం చేసుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందరు పోటీపడినా గ్రామస్థులందరు వారిలో అభివృద్ధికి పాటు పడే వ్యక్తిని ఎంచుకొని వారినే తమ ప్రజాప్రతినిఽధిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని తమ గ్రామ పంచాయతీలను ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రజలే ఎంచుకున్నారు.
- నజరాన కోసం సర్పంచ్‌ల ఎదురు చూపులు
- ఏకగ్రీవంగా కావడంతో ప్రజల నుంచి సర్పంచ్‌లకు ఒత్తిళ్లు
- నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్నారంటూ సర్పంచ్‌లపై ప్రజల ఆగ్రహం
- ప్రభుత్వానికి విన్నవించలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న సర్పంచ్ లు
- మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా
- ఇప్పటికైన నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్న సర్పంచ్‌లు
కామారెడ్డి, ఏప్రిల్ 2: ఎన్నికలంటే సుక్క.. ముక్క.. పైస లేనిదే ఓటు వేయని ఈ రోజుల్లో ప్రజలంతా కలిసి తమ గ్రామాలను అభివృద్ధిమయం చేసుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందరు పోటీపడినా గ్రామస్థులందరు వారిలో అభివృద్ధికి పాటు పడే వ్యక్తిని ఎంచుకొని వారినే తమ ప్రజాప్రతినిఽధిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని తమ గ్రామ పంచాయతీలను ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రజలే ఎంచుకున్నారు. అయితే ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల నగదు అందిస్తామని చెప్పి ఆ హామీని అటకెక్కించింది. దీంతో కొత్త పంచాయతీలుగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరగక ప్రభుత్వ నజరాన కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రూ.10లక్షలు నజరానాగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి పంచాయతీలకు రూ.10లక్షలు కేటాయిస్తామని ప్రకటించింది. దీంతో 2019 జనవరిలో కామారెడ్డి జిల్లాలో మొత్తం 526 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వీటిలో 120 వరకు ఏకగ్రీవమయ్యాయి. వీటిన్నంటికీ ప్రభుత్వం నజరానాను మంజూరు చేయాల్సి ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎప్పుడు నిధులు మంజూరు అవుతాయోనని ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు.
నజరానాలు అందితే గ్రామ పంచాయతీల అభివృద్ధి
పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం చిన్న గ్రామాలను, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. తక్కువ జనాభా ఉన్న తండాలకు పెద్దగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వచ్చే అవకాశం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కమిటీ నిధులు జనాభాను బట్టి మంజూరు చేస్తారు. అయితే తండాల్లో జనాభా 500ల నుంచి 600ల లోపు మాత్రమే ఉంది. జనాభా ప్రతిపాదికన నిధులు కేటాయిస్తే తండాలకు కేవలం రూ.50వేలు మాత్రమే సమకురుతున్నాయి. ఏకగ్రీవమైన తండాలకు ప్రభుత్వం అందించే రూ.10లక్షల సహాయంతో కొంత వరకు అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రభుత్వ తలసరి గ్రాంట్ కింద పంచాయతీ అభివృద్ధి కోసం కేవలం రూ.4వేలు మాత్రమే కేటాయిస్తోంది. ప్రస్తుతం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో ఒక్కో తండాలో 500ల జనాభా మాత్రమే ఉంది. సగటున ఒక్కో పంచాయతీలో రూ.20వేలకు మించి ఆదాయం లేదు. 100 నుంచి 150 ఇళ్లు ఉండడంతో పన్నులపరంగా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఆ నిధులతో పారిశుధ్యం, తాగు నీరు, వీధి దీపాల నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం సీనరేజి, ఆర్థిక సంఘం నిధులు మంజూరు కూడా అంతంత మాత్రమే కావడంతో తండాల్లో అభివృద్ధి కానరావడం లేదు. ప్రభుత్వం సర్పంచ్‌లకు నెలకు రూ.6,500లు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే తండాల్లోని పంచాయతీలకు నిధులు అంతకంటే తక్కువగా లభిస్తున్నాయి. యేటా సర్పంచ్‌ల వేతనమే రూ.60వేల వరకు ఉంటే గ్రామంలో మొత్తం ఆదాయం రూ.60వేల లోపే ఉండడం గమనార్హం.
మరో ఏడాది వరకే అవకాశం
ఏకగ్రీవ పంచాయతీలు జిల్లాలో 120 వరకు ఉన్నాయి. ప్రభుత్వ నజరానా కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. గ్రామ పంచాయతీల ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండడంతో ఇక డబ్బులు వస్తాయో రావోనని ఏకగ్రీవ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. ఒక్కో పంచాయతీకి ప్రభుత్వం రూ.10లక్షల నజరానా ఇవ్వాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.12కోట్లకు పైగా ప్రభుత్వ నజరానా ఇవ్వాల్సి ఉంది. ఇవేకాక ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధుల నుంచి ఏకగ్రీవ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.10లక్షల చొప్పున అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిధులతో పంచాయతీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఏకగ్రీవ నిధుల కోసం ఎదురు చూస్తున్నాం
- సురేఖ, సర్పంచ్, వెంకటాపూర్ గ్రామ పంచాయతీ
ఏకగ్రీవమైతే రూ.10లక్షలతో పాటు మరిన్ని నిధులు ప్రోత్సాహకంగా వస్తాయని గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాం. మా పదవి కాలం వచ్చే జనవరిలో ముగుస్తోంది. ఇప్పటికీ మా గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడంతో వర్షాకాలం వస్తే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నిధులు సరిగా విడుదల కాకపోవడంతో అభివృద్ధి చేయలేకపోతున్నాం. గ్రామస్థుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి ఆదుకోవాలి.
ప్రభుత్వం నుంచి సమాచారం లేదు
- డి. శ్రీనివాస్‌రావు, డీపీవో, కామారెడ్డి
జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుపై ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే పంచాయతీలకు వెంటనే అందజేస్తాం.