కారోబార్ల కష్టాలు తీరేదెన్నడో...!
ABN , First Publish Date - 2023-04-29T23:35:51+05:30 IST
కారోబార్ అంటే గ్రామ పంచాయతీకి ఆల్ రౌండర్. ఇంటి పన్నులు, రికార్డుల నిర్వహన, సమాచారం, జనన మరణాల నమోదు, పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, తాగు నీరు, పారిశుధ్యం, డ్రైవింగ్, మెకానిక్, వీధి దీపాలు ఇలా ఒకటేమిటీ పంచాయతీ పరిధిలో దాదాపు 30కిపైగా విధులు నిర్వహిస్తారు.
- తక్కువ జీతాలు.. కానరాని గుర్తింపు
- డిగ్రీలు చేసినా పారిశుధ్య పని చేయాల్సిందే..
- మే 5 నుంచి సమ్మెకు దిగుతున్న సిబ్బంది
కామారెడ్డి, ఏప్రిల్ 29: కారోబార్ అంటే గ్రామ పంచాయతీకి ఆల్ రౌండర్. ఇంటి పన్నులు, రికార్డుల నిర్వహన, సమాచారం, జనన మరణాల నమోదు, పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, తాగు నీరు, పారిశుధ్యం, డ్రైవింగ్, మెకానిక్, వీధి దీపాలు ఇలా ఒకటేమిటీ పంచాయతీ పరిధిలో దాదాపు 30కిపైగా విధులు నిర్వహిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతీ గ్రామ పంచాయతీకి వీరు ఆరో ప్రాణం లాంటివారు. అంతటి ప్రాధాన్యమున్న కారోబార్, పంచాయతీ సిబ్బంది తమకు కనీస వేతనాలు, హక్కుల కోసం ఈనెల 5 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు.
కారోబార్‌ల పని ఇలా..
గ్రామ పంచాయతీలో వివిధ పనుల నిర్వహణకు స్థానికులను గతంలో కారోబార్‌లుగా నియమించుకుంది. వీరిని పంచాయతీ తీర్మానం ద్వారా విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా వీరిని చేర్చుకునేవారు. ఉదాహరణకు డిగ్రీ ఆపైన చదివిన వారికి బిల్ కలెక్టర్, రికార్డుల నిర్వహణ వంటి పనులు, డ్రైవింగ్, ఎలక్ర్టీషియన్, ఫ్లంబర్ పని తెలిసిన వారికి అవే ఉద్యోగాలు మిగిలిన వారిని సపాయి కార్మికులుగా నియమించుకునేవారు. వీరిలో రికార్డుల నిర్వహణ, బిల్లుల వసూళ్లు, సమాచార సేకరణ వంటి రాత పనులు చూసే వారిని కారోబార్‌లుగా మిగిలిన వారిని సిబ్బందిగా పిలిచేవారు. అదేక్రమంలో 2019లో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లను నియమించుకుంది. అదే సమయంలో ప్రభుత్వం జీవో నెం. 54 విడుదల చేసింది. దీని ప్రకారం గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందిని మల్టీపర్పస్ వర్కర్(ఎంపీడబ్ల్యుగా) నామకరణం చేసింది. ఏ పని చెబితే ఆ పని చేయాల్సి ఉంటుంది. ప్రతీ గ్రామానికి ఐదుగురు చొప్పున వీరిని నియమించారు. ఒకప్పుడు 2000 నుంచి రూ.3వేలకు పని చేసిన వీరికి జీవో నెం. 51 కారణంగా రూ.8500 చొప్పున వేతనం ఇచ్చేవారు. ప్రతీ 500 మందికి ఒక కారోబార్ ఉండాలన్న నిబంధన ప్రతికూలంగా మారింది. వెయ్యి జనాభా ఉన్న గ్రామంలో ఐదుగురు కారోబార్‌లో ఉంటే అందులో కేవలం ఇద్దరికి రూ.8500 చొప్పున ఇస్తారు. దాన్నే అంతా పంచుకోవాల్సిన దుస్థితి. డ్రైవర్లు, ఎలక్ర్టీషియన్ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం దక్కడం లేదు. ప్రస్తుతం దాదాపుగా అన్ని గ్రామాల్లో కారోబార్‌లు జేపీఎస్‌లకు సహాయకులుగా వ్యవహరిస్తున్నారు. అలా కుదరని పక్షంలో జీవో నెం. 51 ప్రకారం డిగ్రీ, పీజీలు చదివిన సరే డ్రైవింగ్, ప్లంబింగ్, చివరికి సపాయి కార్మికునిగా కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 30 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఎప్పటికైన మంచి భవిష్యత్తు దక్కుతుందన్న ఆశతో విధులు నిర్వహిస్తున్నారు.
వీరి డిమాండ్‌లు ఇవే..
గతంలో కారోబార్లుగా వ్యవహరించిన అందరిని జేపీఎస్‌లకు సహాయకులుగా అధికారికంగా నియమించాలి. వీరికి గ్రామ పంచాయతీ కార్యదర్శి హోదా కల్పిస్తూ రూ.21,500 వేతనం అందించాలి. 500 ఒక కారోబార్ కాకుండా గ్రామ పంచాయతీలో ఇప్పటికే పని చేస్తున్న కారోబార్లందరికీ రూ.15,500 చొప్పున వేతనం ఇవ్వాలి. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి. జీవో నెం. 51కు కారోబార్ల సిబ్బంది సమస్యలకు అనుగుణంగా సవరణలు చేయాలి. కారోబార్, సిబ్బందికి పీఎఫ్, ఈఎస్‌ఐ, పింఛన్, సదుపాయం కల్పించాలి. సిబ్బందిలో ఎవరు ప్రమాదవశాత్తు మరణించినా వారికి రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి
- రాజిరెడ్డి, కారోబార్, ముత్యంపేట,
ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.51 కారణంగా కారోబార్లు, సిబ్బంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మల్టీపర్పస్ వర్కర్ పేరిట అందరిని దాదాపుగా సపాయి కార్మికులుగా చూస్తున్నారు. విధి నిర్వహణలో మా ప్రాణాలు పోయినా పరిహారం కూడా అందడం లేదు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా జీతాలు అందించాలి.
10 ఏళ్ల నుంచి చేస్తున్నా జీతాలు పెరగడం లేదు
- స్వామి గౌడ్, కారోబార్, మల్కాపూర్
మల్కాపూర్‌లో 10 సంవత్సరాల నుంచి కారోబార్‌గా పని చేస్తున్నా. కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీ అన్ని పనులు తామే చేయాల్సి వస్తోంది. ఇంటిపన్ను, కులాయి పన్నుల వసూలు చేయడంతో పాటు గ్రామంలో ఏ సమస్య వచ్చిన సర్పంచ్‌కు, కార్యదర్శికి అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాం. వేతనం మాత్రం 8,500లు మాత్రం వస్తుంది. రూ.21వేల వరకు జీతాలు అందించి అసిస్టెంట్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి కల్పించాలి.