వైద్య కళాశాల ప్రారంభానికి వేళాయే..!

ABN , First Publish Date - 2023-09-15T00:14:17+05:30 IST

రాష్ట్రంలో వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయగా అందులో కామారెడ్డి సైతం ఉంది. దేవునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన మెడికల్‌ కళాశాలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అదనంగా ఏర్పాటు చేసిన అనుబంధ ఆసుపత్రి 330 పడకలతో సిద్ధం అయింది. ఈ కళాశాలను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

వైద్య కళాశాల ప్రారంభానికి వేళాయే..!

- నేడు వర్చువల్‌ విధానంలో కామారెడ్డి వైద్య కళాశాల ప్రారంభించనున్న సీఎం

- ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్లు

- అనుబంధ ఆసుపత్రిలో సైతం 330 పడకల నిర్మాణం పూర్తి

- ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం

కామారెడ్డి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి)/కామారెడ్డి టౌన్‌ : రాష్ట్రంలో వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయగా అందులో కామారెడ్డి సైతం ఉంది. దేవునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన మెడికల్‌ కళాశాలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అదనంగా ఏర్పాటు చేసిన అనుబంధ ఆసుపత్రి 330 పడకలతో సిద్ధం అయింది. ఈ కళాశాలను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఇందుకు గాను మెడికల్‌ కళాశాల వద్ద ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజిబొద్ధీన్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పర్యవేక్షణలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య కళాశాల ప్రారంభిస్తున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా నలుమూలల నుంచి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపనున్నారు.

ప్రజల కోరిక నెరవేరిన వేళ

జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాలని విద్యార్థి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవిస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టరేట్‌ భవన ప్రారంభం సమయంలో సీఎం కేసీఆర్‌ వైద్య కళాశాల ఏర్పాటుపై హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా వైద్యకళాశాల ప్రారంభానికి కావాల్సిన అన్ని అనుమతులు, వసతులు కల్పించేందుకు ప్రిన్సిపాల్‌ను సైతం నియమించి జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) నుంచి రావాల్సిన అనుమతులకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గత కొన్ని నెలలుగా ఒక్కో ప్రక్రియ జరుగుతూ ప్రస్తుతం కళాశాలలో చేరేందుకు అడ్మీషన్‌లు పూర్తయి విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించేందుకు సిద్ధమైంది. మొత్తం 100 సీట్లకు గాను ఆలిండియా కోటా మెడికల్‌ కౌన్సిలింగ్‌లో 15 సీట్లు కేటాయించగా మరో 85 సీట్లు రాష్ట్ర కోటా కింద భర్తీ చేశారు.

330 పడకలతో ఆసుపత్రి సిద్ధం

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 180 పడకలతో సేవలు అందుతుండడం, ఆసుపత్రి మొత్తం ఇరుకుగా మారడంతో అటు ప్రజలకు, ఇటు సేవలు అందించేందుకు వైద్యులకు కష్టంగా మారేది. ప్రస్తుతం మెడికల్‌ కళాశాల ఏర్పాటు కావడంతో దాని అనుబంధంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే మరిన్ని అదనపు పడకలతో పై అంతస్తులో ఏర్పాటు చేసి మొత్తం 330 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలకు గతంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో హైదరాబాద్‌, నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలకు మెరుగైన చికిత్స కోసం వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం నిపుణులైన వైద్యులతో పాటు పలు విభాగాలకు చెందిన వైద్యులు, ప్రొఫెసర్లు రావడంతో మెరుగైన వైద్యం అందనుంది.

మరిన్ని సేవలు అందుబాటులోకి..

జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారిన ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు, సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు ప్రతీసారి పెదవి విరుస్తూనే ఉన్నారు. ఆసుపత్రిలో నిత్యం పదులసంఖ్యలో ప్రసవాలు జరుగుతుండగా వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రసవం అయ్యాక తగిన బెడ్డు సౌకర్యాలు లేవంటూ ప్రసవం కోసం వచ్చే వారు విమర్శలు గుప్పిస్తున్నారు. రోజులో ఐదారు రోడ్డు ప్రమాదం భారిన పడి ఆసుపత్రికి ప్రాణాపాయ స్థితిలో వస్తున్న వారు ఉంటున్నారు. వీరికి సిటీ స్కాన్‌ చేయిద్దామంటే అసలు ఆ సౌకర్యమే లేదు. ప్రతీసారి ప్రైవేట్‌ వైపు పరుగులు పెట్టాల్సిందే. ఇక ఒకే ఒక ఎక్స్‌రే యంత్రం ఉండడంతో ఎముకలు విరిగి అవస్థలు పడుతూ పదుల సంఖ్యలో క్యూకట్టాల్సి వస్తోంది. అది కూడా మధ్యాహ్నం వరకు మాత్రమే ఈ సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం వైద్య కళాశాల ఏర్పాటు అయితే నిపుణులైన వైద్యులతో పాటు జూనియర్‌ డాక్టర్లు అందుబాటులోకి వస్తుండడంతో ఒకటి రెండు సంవత్సరాలలో ప్రస్తుతం అందుతున్న సేవలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది.

Updated Date - 2023-09-15T00:14:17+05:30 IST