నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులే..

ABN , First Publish Date - 2023-05-26T22:44:30+05:30 IST

రైతులకు కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్‌ టాస్క్‌ఫోర్సు టీం అధికారి నూతన్‌ కుమార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో కలిసి బీర్కూర్‌ మండలంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలు, విత్తన షాపులను ముమ్మరంగా తనిఖీలు చేశారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులే..

సీడ్‌ టాస్క్‌ఫోర్సు టీం అధికారి నూతన్‌ కుమార్‌ హెచ్చరిక

బీర్కూర్‌, మే 26: రైతులకు కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్‌ టాస్క్‌ఫోర్సు టీం అధికారి నూతన్‌ కుమార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో కలిసి బీర్కూర్‌ మండలంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలు, విత్తన షాపులను ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నూతన్‌ కుమార్‌ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున రైతులు విత్తనాలు కొనుగోలు కోసం షాపులకు వెళ్తారన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని విత్తన విక్రేతలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉందన్నారు. అందుకే విత్తనాలు, ఎరువులు విక్రేత షాపులను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విత్తన విక్రేతలు నకిలీ విత్తనాలు విక్రయించవద్దన్నారు. షాపుల్లో విత్తనాల స్టాక్‌, సెల్లింగ్‌ రిజిస్టార్లు, బిల్లులను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఎమ్మార్పీ ధరకే అమ్మాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామన్నారు. రైతులు ఏది కొన్నా రశీదు తప్పక తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. టాస్క్‌ఫోర్సు అధికారుల వెంట ఏవో కమల, ఏవో అమర్‌ ప్రసాద్‌, ఏఎస్సై రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

రైతులు ప్రలోభాలకు మోసపోవద్దు

సదాశివనగర్‌: గ్రామాల్లోని రైతులు నకిలీ విత్తనం అమ్మకందార్ల ప్రలోభాలకు నమ్మి మోసపోవద్దని మండల వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లైసెన్స్‌దారుల దుకాణాల్లో కొనుగోలు చేసి రశీదు తప్పక తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితంగా ఎరువులు వాడాలన్నారు. అనుమతిలేని బీటీ-3, దొంగ బీటీ, రౌండప్‌ బీటీ, హెటీబీటీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతు పేరుమీదనే బిల్లులు పొంది వాటిని పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా దాచి ఉంచుకోవాలన్నారు. విత్తన మొలక శాతంతో ఇబ్బందులు కలిగినట్లయితే విత్తనాలు 10 నుంచి 20 రోజులతో వాటికి సంబంధించిన బిల్లులతో వ్యవసాయాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. నేలలో తగిన తేమ శాతం ఉన్నప్పుడే విత్తనం వేయాలని కోరారు.

Updated Date - 2023-05-26T22:44:30+05:30 IST