సర్పంచ్‌లను అప్పులపాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-02-21T00:09:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లను అప్పుల పాలుచేస్తోందని, చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

సర్పంచ్‌లను అప్పులపాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బిచ్కుంద,ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లను అప్పుల పాలుచేస్తోందని, చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం బిచ్కుందలో బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టిన అనంతరం మున్నూర్‌కాపు సంఘంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కుటుంబపాలనగా మారి ప్రశ్నించిన వారిపై కేసులు నమోదుచేస్తూ పోలీసు వ్యవస్థను కూడా పార్టీ కార్యకర్తలుగా మార్చేస్తున్నారన్నారు. మంజీరా పరివాహక ప్రాంతాల్లో నామమాత్రం అనుమతులు ఇస్తూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ లక్షల కోట్ల సంపాదనను దోచుకుంటున్నారన్నారు. దళితబంధు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు,మూడు నియోజకవర్గాలలోని ఒక మండలాన్ని ఎంపిక చేసి పథకానికి శ్రీకారం చుట్టి మిగతా దళిత ప్రజలను ఆశచూపుతూ రాజకీయం చేస్తున్నారని తెలిపారు. మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతాల గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగుగంటి పోకుండా ఉండేందుకు వెంటనే ఇసుక క్వారీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వేల లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే గోదావరి వరద తాకిడికి రూ.1300 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం ధనార్జన కోసమే ప్రాజెక్టుల పనులు చేస్తోందని తెలిపారు. మంత్రి హరీష్‌ రావు కొండపోచమ్మ ప్రాజెక్టు కాల్వ ప్రారంభించిన రోజే కూలిపోయిన పరిస్థితి ఉందంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన ఎంతగుడ్డిగా ఉందో అందరికీ అర్థమవుతుందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో ఉన్న డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు వెనుకబడిన జుక్కల్‌ నియోజకవర్గంలో ఎందుకు లేవని ప్రశ్నించారు. 15వ ఆర్థిక నిధులను సైతం రాష్ట్రప్రభుత్వం మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-21T00:09:59+05:30 IST