కడగండ్లు మిగిల్చిన వడగండ్లు
ABN , First Publish Date - 2023-03-19T00:59:00+05:30 IST
జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం వర్షం పడింది. వడగల్లతో కూడిన వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో పడింది. ఈ వర్షం వల్ల కొన్నిచోట్ల మొక్కజొన్న తడిసిపోగా, భీంగల్ మండలం పరిధిలో గోన్‌గొప్పుల ప్రాంతంలో రాళ్లు పడడంతో వరి గొలుసులు దెబ్బతిన్నాయి.

గోన్‌గొప్పులలో పడిన వడగండ్ల వర్షం
పలు ప్రాంతాల్లో గాలులకు కూలిన చెట్లు
మరో రెండు రోజుల పాటు వర్షాలు!!
నిజామాబాద్, మార్చి 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం వర్షం పడింది. వడగల్లతో కూడిన వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో పడింది. ఈ వర్షం వల్ల కొన్నిచోట్ల మొక్కజొన్న తడిసిపోగా, భీంగల్ మండలం పరిధిలో గోన్‌గొప్పుల ప్రాంతంలో రాళ్లు పడడంతో వరి గొలుసులు దెబ్బతిన్నాయి. ఈ వర్షం గాలిదుమారంతో రావడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూడా పడిపోయాయి. వర్షానికి, గాలుల కు కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా గంటల పాటు నిలిచిపోయింది. నగరం పరిధిలోని వాణిజ్య సముదాయాల పరిధిలో గంటల పాటు కరెంటు నిలిచిపోవడంతో ఆసుపత్రులతో పాటు వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. జిల్లాలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో గాలి దు మారాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం వల్ల పలుచోట్ల చెట్లు పడిపోయాయి. కోటగిరి, రుద్రూర్ ప్రదాన రహదారిలో రాణంపల్లి వద్ద చెట్లు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. భీంగల్ మండలం పరిధిలో వడగల్లు పడడంతో కొన్నిచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వర్ని, మోస్రా, చందూర్, ఎడపల్లి, బోధన్ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం పడింది. కమ్మర్‌పల్లి, వేల్పూర్, ఇతర మండలాల పరిధిలో కూడావర్షం పడడంతో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, ఇతర ప్రాంతాల్లోనూ జల్లులతో కూడిన వర్షం పడింది. నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో పిడుగు పడడంతో మదర్సాలో ఉన్న ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
గాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడి, ఇతర ప్రాంతాల్లో రెండున్నర గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరం పరిధిలో నిత్యం మరమ్మత్తులు కొనసాగిస్తున్న చిరు జల్లులకే కరెంటు సరఫరా నిలిచిపోతుంది. గత మూడు రోజులుగా పడుతున్న జల్లుల వల్ల నగరం పరిధిలోని వాణిజ్య సముదాయాలున్న ప్రాం తాల్లో విద్యుత్ అంతరాయం వస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. సాయంత్రం వేళ ఆసుపత్రులకు వచ్చే రోగులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ అంతరాయం వల్ల దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా జల్లుల తో కూడిన వర్షం పడుతుంది. ఈ వర్షం మరో రెండు రోజుల పాటు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులతో పాటు వ్యవసాయశాఖ అదికారులు తెలిపారు.
భీమ్‌గల్ మండలంలో వడగండ్ల బీభత్సం
భీమ్‌గల్ రూరల్: శనివారం సాయంత్రం భీమ్‌గల్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కు రిసింది. మండలంలోని పిప్రి, బాచన్‌పల్లి, బాచన్‌పల్లి, గోన్‌గొప్పుల, ము చ్కూర్ గ్రామాల్లో వడగండ్ల తో కూడిన రాళ్లవర్షం కురిసింది. పల్లికొండ గ్రామంలో చేతికొచ్చిన వరిపంట రాళ్లవర్షంతో వడ్లు నేలరాలాయి.పల్లికొండ గ్రామానికి చెందిన పోల్సాని సతీష్‌కు చెందిన సుమారు ఆరు ఎకరాల్లో రాళ్ల వర్షానికి వడ్లు పెద్దమొత్తంలో నేలరాలాయి.సుమారు అర గంటపాటు వర్షం కురిసింది.
కోటగిరిలో ఈదురుగాలుల బీభత్సం
కోటగిరి: కోటగిరి ఉమ్మడి మండలంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు, వర్షం కురిసింది. ఈదురు గాలులకు ఆయా ప్రాంతాలలో, గ్రామాలలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పొద్దుతిరుగుడు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రుద్రూరు: రుద్రూరు మండలంలో ఈదురు గాలుల భీభత్సవం సృష్టించింది. వర్షంతో పలు చోట్ల ఆరు తడి పంటలు దెబ్బతిన్నాయి.
ఆయా మండలాల్లో భారీ వర్షం
వర్ని: వర్ని ఉమ్మడి మండలంలో శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలుచోట్ల పంటలు నేలకొరగగా ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. వర్షం జోరు కొనసాగితే పంటలు చేజారిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
నవీపేట: మండలంలోని పలు గ్రామాలలో శనివారం రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులు వీయగా రాత్రి సమయానికి వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమలమయ్యాయి. గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బోధన్ రూరల్: బోధన్, సాలూర మండలాల్లోని పలు గ్రామాలలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో రైతులు ఆందోళన పడ్డారు. పలు చోట్ల వర్షం కురిసింది. వర్షంతో పలు చోట్ల ఆరు తడి పంటలు దెబ్బతిన్నాయి.