ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ర్టార్
ABN , First Publish Date - 2023-03-01T00:59:23+05:30 IST
కామారెడ్డి సబ్ రిజిస్ర్టార్ శ్రీలత ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని.. డాక్యుమెంట్ రైటర్లతో పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబోద్దిన్ ఆరోపించారు.
- పలుమార్లు మాట్లాడినా.. పనితీరు మార్చుకోవడం లేదు
- ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బంది
- బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజిబోద్దిన్ ఆగ్రహం
కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 28: కామారెడ్డి సబ్ రిజిస్ర్టార్ శ్రీలత ప్రతీ పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని.. డాక్యుమెంట్ రైటర్లతో పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబోద్దిన్ ఆరోపించారు. మంగళవారం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక అధికారిపై ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీ వేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గు చేటన్నారు. సబ్ రిజిస్ర్టార్ అవినీతితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నోసార్లు ఆమెతో మాట్లాడినా మారలేదన్నారు. తన వద్ద పనిచేసే వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం రూ.15వేలు డిమాండ్ చేశారన్నారు. డాక్యుమెంటరీ రైటర్లు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు రాగా తాను డాక్యుమెంటరీ రైటర్లను అడిగితే టైపింగ్ చార్జీలు కూడా సబ్ రిజిస్ట్రార్‌కు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆమె ఎక్కడ పని చేసినా ఇదే రకమైన ఆరోపనలు వినిపిస్తున్నాయన్నారు. 317 జీవో ద్వారా ఆమె ఇక్కడికి వచ్చారని, ఈ జీవో ద్వారా ఎవరికి మేలు జరిగిందో తెలియదు గాని కామారెడ్డి ప్రజలకు మాత్రం శాపంగా మారిందన్నారు. కానీ సబ్ రిజిస్ట్రార్‌కు మాత్రం వరంగా మారిందన్నారు. వీఎల్‌టీ లేకపోతే గతంలో 2 వేలు ఇస్తే రిజిస్ట్రేషన్ జరిగేదని, ఇప్పుడు 5వేల ఇవ్వాల్సి వస్తుందన్నారు. డాక్యుమెంట్‌లో అక్షరం తప్పుగా టైపు అయితే వేలకు వేలు ఇవ్వాల్సి వస్తుందన్నారు. గతంలో సబ్ రిజిస్ట్రార్ వైద్యశాఖలో పని చేసేవారని ప్రస్తుతం ఆ శాఖలో ఎల్‌డీసీగా పనిచేసి ప్రమోషన్ మీద 317 జీవో ద్వారా ఇక్కడికి వచ్చారన్నారు. సబ్ రిజిస్ర్టార్ మీద ఎవరైన ఫిర్యాదు చేస్తే డిస్ట్రిక్ట్ రిజిస్ర్టార్ నవుతున్నారన్నారు. ఆమె ఏది చెబితే అది డీఆర్ వింటున్నారని తెలిపారు. 8 రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ మీద అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తామన్నారు. డాక్యుమెంట్ రైటర్లు పద్ధతి మార్చుకుని ప్రజలకు సహకరించాలని కోరారు. ఎవరైన డాక్యుమెంటరీ రైటర్లు డబ్బులు అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఎల్లుండి నుంచి 8 రోజుల పాటు డాక్యుమెంట్లు చేయవద్దని, సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లు సమర్పించకుండా తమతో నిరసనలో పాల్గొనాలని డాక్యుమెంట్ రైటర్లను కోరారు. అయితే సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి ప్రజలను ఎందుకింత ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముజిబోద్దిన్ ప్రశ్నించగా తాము నిబంధనల ప్రకారం చేస్తున్నామని కొందరు పడని వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సబ్ రిజిస్ట్రార్ శ్రీలత వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్ గుప్తా, భూమేష్ యాదవ్, లద్దురి లక్ష్మీపతి యాదవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు,డాక్యుమెంట్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు.