నర్సరీల నిర్వహణపై ప్రత్యేకదృష్టి సారించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-03-19T01:00:52+05:30 IST

హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు.

నర్సరీల నిర్వహణపై ప్రత్యేకదృష్టి సారించాలి : కలెక్టర్‌
అభంగపట్నంలో నర్సరీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

నవీపేట, మార్చి 18: హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. శనివారం మండలంలోని అబ్బాపూర్‌(ఎం), అభంగపట్నంలలో నర్సరీలను పరిశీలించగా నవీపేటలో మన ఊరు-మనబడి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అభంగపట్నంలో ఉపాధి హామీ పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి రోజువారిగా ఎంత కూలీ డబ్బులు వస్తున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా నర్సరీలను పరిశీలించారు. నర్సరీలలో మొలకెత్తిన మొక్కల శాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున నిర్ణీత గడువులోపు మొక్కలు అందించేలా ప్రణాళికబద్దంగా వ్యవహరించాలని నర్సరీల నిర్వాహకులను ఆదేశించారు. నర్సరీల నిర్వహణను నిషితంగా పర్యవేక్షించాలని మండల అధికారులకు సూచించారు. మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటి నుండే అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం నవీపేట జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి పనులను పరిశీలించారు. అంతేకాకుండా పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించే విధంగా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా నవీపేటలో ప్రతీశనివారం జరిగే మేకల సంతకు గ్రామ శివారులో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలని ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌ కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విఠల్‌ రావు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాంకిషన్‌ రావు, డీఈవో దుర్గాప్రసాద్‌, డీఆర్‌డీవో చందర్‌ నాయక్‌, ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, సర్పంచులు ఏటీఎస్‌ శ్రీనివాస్‌, సాడారం శ్రీనివాస్‌, రమాదేవి, తహసీల్దార్‌ వీర్‌సింగ్‌, ఎంపీడీవో సయ్యద్‌ సాజిద్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:00:52+05:30 IST