పెండింగ్‌ పనులకు మోక్షం

ABN , First Publish Date - 2023-01-26T01:22:09+05:30 IST

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారుల అనుసంధానంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని రోడ్లను పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

పెండింగ్‌ పనులకు మోక్షం

కొనసాగుతున్న నిజామాబాద్‌ బైపాస్‌ రోడ్డు పనులు

ఆరు నెలల్లో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు

మరమ్మతు పనులకు ప్రతిపాదనలు

జాతీయ రహదారుల కోసం భూసేకరణకు అధికారుల కసరత్తు

నిజామాబాద్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారుల అనుసంధానంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని రోడ్లను పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించడంతో వాటిని పూర్తిచేసేందుకు టెండర్లను ఖరారు చేశారు. రోడ్డు పనులను కూడా పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొనసాగుతున్న బైపాస్‌ రోడ్డు పనులు

ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కార్పొరేషన్‌ పరిధిలోని బైపాస్‌ ఫోర్‌లేన్‌ రోడ్డు పనులు 15 రోజులుగా కొనసాగిస్తున్నారు. మాధవనగర్‌ రైల్వేగేట్‌ నుంచి కంఠేశ్వర్‌ బైపాస్‌ వరకు ఉన్న రోడ్డు పనులను చేస్తున్నారు. ఇప్పటికే రెండు లైన్‌ల రహదారి ఉండగా మిగతా రెండు లైన్‌లను కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. త్వరలో వర్ని రోడ్‌ బైపాస్‌ కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

బైపాస్‌ రోడ్డుకు పెరిగిన రద్దీ

నిజామాబాద్‌ బైపాస్‌ రోడ్డుకు రద్దీ పెరిగింది. కొన్నేళ్లుగా బాసర, భైంసా, బోధన్‌, నాందేడ్‌కు ట్రాఫిక్‌ పెరగడంతో వాహనాలన్నీ బైపాస్‌ మీదుగా మళ్లిస్తున్నారు. అర్సపల్లి మీదుగా పంపిస్తున్నారు. ఈ బైపాస్‌ రోడ్డు మాధవనగర్‌ నుంచి కంఠేశ్వర్‌ వరకు రెండు లైన్‌లే పూర్తయింది. కంఠేశ్వర్‌ బైపాస్‌ నుంచి నాలుగు లైన్‌లరోడ్డు కొత్త కలెక్టరేట్‌ వరకు ఉంది. అక్కడ నుంచి అర్సపల్లి వరకు నాలుగులైన్‌ల రోడ్డు లేదు. ప్రస్తుతం కంఠేశ్వర్‌ బైపాస్‌ నుంచి మాధవనగర్‌ వరకు ఉన్న బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఉన్న రెండు లేన్‌ల రోడ్డుకు అదనంగా మరో రెండులేన్‌ల రోడ్డు నిర్మిస్తున్నారు. రెండు లేన్‌ రోడ్డు నిర్మించి ఎనిమిదేళ్లు ఏళ్లు దాటగా ప్రస్తుతం కొత్తగా మరో రెండు లేన్‌ల రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఆరు నెలలోపు రోడ్డు నిర్మాణం పూర్తిచేసే విధంగా పనులు చేస్తున్నారు. ముందే భూసేకరణ చేపట్టడం వల్ల రోడ్డు నిర్మాణాన్ని వేగంగా చేస్తున్నారు. మాధవనగర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద రైల్వేఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ పనులు జరుగుతుండడంతో హైదరాబాద్‌కు వెళ్లేభారీ వాహనాలన్నీ బైపాస్‌ మీదుగానే మళ్లిస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు ఈ బైపాస్‌ మీదుగానే వెళ్తున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణ చేపడుతున్న అధికారులు డబుల్‌ లేన్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నారు. మొదట మట్టిరోడ్డు నిర్మాణం పూర్తిచేసి తర్వాత మెటల్‌తో కలిపి రోడ్డును వేయనున్నారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణం కోసం వర్ని రోడ్‌తో కలిపి మొత్తం 26కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఆరు నెలలలోపు ఈ బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తిచేసి వర్ని, బైపాస్‌ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టనున్నారు. బైపాస్‌ రోడ్డు పనులు జరుగుతున్నందున రాత్రివేళల్లో వెళ్లే వాహనాలకు కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్నిచోట్ల రోడ్డు తవ్వకాలు ఉండడం, అక్కడక్కడ ఇసుక బస్తాలు ఉంచిన రేడియం స్టిక్కర్స్‌ పూర్తిస్థాయిలో వేయకపోవడం వల్ల సమస్యలు ఎదరవుతున్నాయి. మట్టి బాగా పోస్తుండడం వల్ల నిరంతరం వాటర్‌ కొట్టకపోవడంతో దుమ్ములేసి వచ్చిపోయే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మట్టి వేసేదగ్గర మాత్రమే నీళ్లుపోయడం, ఇతర ప్రాంతాల్లో పోయకపోవడం వల్ల దుమ్ము ఎక్కువగా లేస్తోంది. ఇదే పరిస్థితి మాధవనగర్‌ రైల్వే బ్రిడ్జి వద్ద కూడా ఉంది. అక్కడ కూడా పనులు కొనసాగుతుండడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. బైపాస్‌కు బ్రిడ్జి నిర్మాణం పక్కనే ఉండడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బంది పడుతున్నారు. వచ్చేది వేసవి కావడం వల్ల జూన్‌లోపు పనులు పూర్తిచేసేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరమ్మతు పనులకు ప్రతిపాదనలు

జిల్లాలో పంచాయతీ, ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం పనులు కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. భారీ వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలో ఈ రెండు శాఖలకు చెందిన రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి రూ.84 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు పనులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. టెండర్‌లను పిలిచిన అధికారులు పనులు చేపడుతున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్లతో పాటు బ్రిడ్జిల నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. జిల్లాలో కొన్ని గ్రామాల పరిధిలో సింగిల్‌రోడ్‌ నుంచి డబుల్‌ రోడ్డుకు మంజూరు కూడా చేశారు. కొన్నింటికి గత బడ్జెట్‌లో నిధులు కేటాయించ క మరికొన్ని రోడ్లకు వచ్చే ఈ బడ్జెట్‌లో నిధులను కేటాయించనుండడంతో ఆ పనులు కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉన్న రోడ్ల మరమ్మతు పనులు కూడా చేపడుతున్నారు. కొన్ని రోడ్లకు అనుమతులు రావడంతో టెండర్‌లను పిలిచారు. మొదట గ్రామాల పరిధిలో దెబ్బతిన్న రోడ్లను చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవేకాకుండా జిల్లాలో జాతీయ రహదారుల సంస్థ కూడా కొత్త రోడ్లను మంజూరు చేయడంతో వాటిని కూడా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మెదక్‌ నుంచి భైంసా వరకు రోడ్లను మంజూరు చేయడంతో రెండు భాగాలుగా చేసి జాతీయ రహదారుల సంస్థ టెండర్‌లను ఖరారు చేసింది. మెదక్‌ నుంచి ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనుండడంతో జిల్లా పరిధిలో భూసేకరణ కోసం అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించారు. రైతులతో చర్చలు జరిపారు. భూములను తీసుకోవడంతో పాటు రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూసేకరణ పూర్తయితే వర్ని నుంచి బోధన్‌ మీదుగా షాటాపూర్‌, ఫకీరాబాద్‌ నుంచి భైంసా వరకు బాసర మీదుగా రోడ్‌ నిర్మాణం జరగనుంది. ఇవేకాకుండా ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన గ్రామాల పరిధిలో ఉన్న పెండింగ్‌ రోడ్లను, సింగిల్‌ నుంచి డబుల్‌ రోడ్ల కోసం ఇచ్చిన ప్రతిపాదనలు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు పనులు చేపడుతున్నామని రోడ్లు భవనాలశాఖ జిల్లా అధికారి రమేష్‌ తెలిపారు. నగర బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు రూ.26 కోట్లతో చేపట్టామని ఆరు నెలల లోపు పనులు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2023-01-26T01:22:10+05:30 IST