రేషన్ షాప్ ఇక సీఎస్‌సీ
ABN , First Publish Date - 2023-05-26T00:18:12+05:30 IST
రేషన్ దుకాణాలు ఇక కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్‌సీ)గాను సేవలందించనున్నాయి. రేషన్ డీలర్లకు వచ్చే కమీషన్ అరకొర కాగా ఖర్చులకు సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో డీలర్లకు ఆదాయం సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- త్వరలోనే ఆన్‌లైన్ సేవలు
- డీలర్లకు శిక్షణ.. తదుపరి అమలు
- రెవెన్యూ మినహా 56 రకాల సేవలు
కామారెడ్డి, మే 25: రేషన్ దుకాణాలు ఇక కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్‌సీ)గాను సేవలందించనున్నాయి. రేషన్ డీలర్లకు వచ్చే కమీషన్ అరకొర కాగా ఖర్చులకు సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో డీలర్లకు ఆదాయం సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ సరుకుల పంపిణీతో పాటు ఆన్‌లైన్ సేవలతో కొంతమేర ఆర్థిక ప్రగతి ఉండనుందనేది ప్రభుత్వ భావన. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా జిల్లా పౌరసరఫరాల శాఖ తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 578 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో కొంతమంది రేషన్ దుకాణాదారులు నిర్వహణ చేయలేక ఇతర దుకాణదారులకు అప్పగించడంతో ఒక్కొక్కరు రెండేసీ చొప్పున దుకాణాలను చూసుకుంటూ ప్రజలకు సరుకులను అందిస్తున్నారు.
56 రకాల సేవలు
జాతీయ ఆహారభద్రత చట్టం 2015 అమలులోకి రాకముందు కిలోకు 20 పైసల చొప్పున క్వింటాల్‌కు రూ.20 డీలర్లకు కమీషన్ వచ్చేది. అయితే చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి కమీషన్ రూ.70కి పెరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.35, రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చొప్పున చెల్లించాలి. 2015 అక్టోబరు నుంచి 2018 ఆగస్టు వరకు ప్రభుత్వం నుంచి డీలర్లకు కమీషన్ రావాల్సి ఉంది. ఆన్‌లైన్ ద్వారా ఒక్కో కార్డు ట్రాన్సక్షన్ చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.17 అదనంగా ఇస్తోంది. గతంలో కమీషన్ బకాయిలు 25 శాతం మాత్రమే ఇచ్చారని రేషన్ డీలర్‌లు ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్‌కు రూ.70 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.22.50 మాత్రమే వచ్చిందని వాపోతున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణం సీఎస్‌సీ సెంటర్‌గా ఏర్పాటైతే ప్రజలకు చేరువగా సేవలందడంతో పాటు రేషన్ దుకాణదారులకు ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఐటీ రిటర్న్స్, ఆధార్ సీడింగ్, ఆయుష్మాన్ భారత్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఉజ్వల కనెక్షన్, ప్రధామంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, డీజీపే, విద్యాసేవలు, సూక్ష్మ తయారీ యూనిట్లు ఇలా 56 రకాల సేవలు అందనున్నాయి.
మినీ సిలిండర్లపై వీడని పీటముడి
ఎల్‌పీజీ మినీ గ్యాస్ సిలిండర్లను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశం నేటికి కార్యరూపం దాల్చలేదు. వాణిజ్యపరమైన సిలిండర్లు కావడంతో ధర ఎక్కువ ఉన్నందున విక్రయాలు అంత సులభం కాదని రేషన్ డీలర్లు తేల్చి చెబుతున్నారు. రేషన్ డీలర్లను ఒప్పించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే కేజీల సిలిండర్‌ను విక్రయిస్తే కేవలం రూ.40 మాత్రమే కమీషన్ వస్తుండడంతో రేషన్ డీలర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మినీ సిలిండర్ల వ్యవహారం ఎటూ తేలకపోగా సీఎస్‌సీ సెంటర్లు తెరపైకి వచ్చాయి.