సర్వేలతో రాజకీయ వేడి
ABN , First Publish Date - 2023-05-26T22:47:16+05:30 IST
జిల్లాలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండే నేతలపై, ప్రజాప్రతినిధులపై రహస్యంగా సర్వేలు చేపిస్తుండడంతో రాజకీయం వేడెక్కుతోంది.

- సర్వే ఏజెన్సీలతో గ్రామాలను జల్లెడ పడుతున్న ప్రధాన పార్టీలు
- రహస్యంగా సర్వేలు చేపిస్తున్న అధిష్ఠానాలు
- బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకు టికెట్ భయం
- ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- అధిష్ఠానం నుంచే కాంగ్రెస్, బీజేపీల సర్వేలు
- వివరాలు సేకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు
కామారెడ్డి, మే 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండే నేతలపై, ప్రజాప్రతినిధులపై రహస్యంగా సర్వేలు చేపిస్తుండడంతో రాజకీయం వేడెక్కుతోంది. అధిక సంఖ్యలో సర్వే ఏజెన్సీలు ప్రజల నాడి తెలుసుకునేందుకు పల్లెలను జల్లెడ పడుతున్నాయి. రాబోయే మూడు నెలల పాటు విస్తృతంగా పర్యటించాల్సి ఉండడంతో ముందుగా తాము ఎక్కడున్నాం. ప్రత్యర్థి ఎవరు.. ఏ రీతిలో ముందుకు వెళ్లాలనే ప్రశ్నలతో జిల్లా ఎమ్మెల్యేలు ఏజెన్సీలను ఆరా తీస్తున్నారు. 10 రోజుల్లో నివేదికలు కావాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు సైతం ప్రత్యేకంగా ఎవరికి వారే బడా ఏజెన్సీలను రంగంలోకి దింపి ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీయడమే కాకుండా గెలుపోటములపై సర్వే చేపిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు గెలుపోటములను పక్కన పెడితే టికెట్ ఖాయం చేసుకునే పనిలో ఉంటున్నారు. ఆ పార్టీ అధిష్ఠానం సైతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై రహస్యంగా సర్వే చేపిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కీలక నేతలు జిల్లాలో అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు.
ఎమ్మెల్యేలపై కేసీఆర్, కేటీఆర్ వేర్వేరు సర్వేలు
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధికార బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అందులో ముఖ్యంగా తమ రేస్ గుర్రాలను ఖరారు చేసుకునే పనిలో పడింది. రాష్ట్రంలో సుమారు 30 మంది సిట్టింగ్‌లకు ప్రమాదం పొంచి ఉందని అధిష్ఠానం సంకేతాలు పంపింది. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు వేర్వేరుగా 12 బడా సంస్థల ద్వారా ప్రతీ మూడు నెలలకోసారి సర్వేలు చేయిస్తున్నారు. వారి ఇరువురి నివేదికలను పరస్పరం బేరీజు వేసుకుంటున్నారు. దోకా లేదు అనుకున్న ఎమ్మెల్యేలను పిలిపించి సర్వే రిపోర్టులను వారికి అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇబ్బందే.. ఏ మాత్రం పనికిరారు అనుకున్న అభ్యర్థులకు సంబంధించి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు మౌనంగా ఉంటున్నారు. ఓపెన్‌గా ఉన్న విషయం సదరు అభ్యర్థులకు చెప్పేస్తే పార్టీ ఫిరాయించే అవకాశం లేదా పార్టీ నిలబెట్టే అభ్యర్థిని ఓటమి పాలు చేసే అవకాశాలు ఉండడంతో అధిష్ఠానం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అయితే వారికి ఉన్న విషయం తెలిపేందుకు పార్టీ పెద్దలు కొత్త ఎత్తుగడ వేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేయించిన సర్వేలో మీ పరిస్థితి ఇది అంటూ తెలంగాణ భవన్ నుంచి ఆయా ఎమ్మెల్యేలకు లీక్‌లు ఇస్తూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.
పోటాపోటీగా సర్వేలు
జిల్లాలోని ఆయా ఎమ్మెల్యేలు సైతం తమ పనితీరుపై ప్రత్యేక ఏజెన్సీలతో సర్వే చేయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో, ఎన్నికల్లో ఏఏ వ్యూహాలు పాటిస్తే విజయ తీరాలకు చేరుతారో స్పష్టం చేస్తామని, గతంలో తన సంస్థ చేసిన సర్వేలు వచ్చిన ఫలితాలు వివరిస్తూ ఏజెన్సీల నిర్వాహకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా పట్టించుకో లేదు. కాగా ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సర్వే ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తున్నారు. 10 నుంచి 15 రోజుల్లో తమకు నివేదికలు ఇవ్వాలని డబ్బులు ఎంతైనా పర్వాలేదంటూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏజెన్సీలను కోరుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో పల్లెపల్లెనా జల్లెడ పట్టి నివేదిక రూపొందించాలంటే కనీసం 25 రోజులు పడుతుందని ఏజెన్సీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నా ఎమ్మెల్యేలు వినిపించుకునే పరిస్థితి లేదు. ఆత్మీయ సమ్మేళనాలు, ప్లీనరీలు పూర్తి చేశాం దీంతో గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి కొంత మెరుగుపడింది ఇప్పుడు సర్వేలు చేసుకుంటే ఫలితం కొంత ఆశాజనకంగా ఉంటుంది. అంతకంటే ముందు సర్వే చేయించుకుంటే ఫెయిల్ మార్కులు వచ్చి అది అధిష్ఠానం దృష్టికి వెళితే మొత్తానికే మోసం అనే యోచనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంతకాలం సర్వేలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేల గెలుపోటములపై అధిష్ఠానం అసంతృప్తితో ఉండడంతో ఏజెన్సీల ద్వారా తమ పనితీరుపై సర్వే చేయించుకుంటున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
అఽధిష్ఠానం నుంచే కాంగ్రెస్, బీజేపీ సర్వేలు
అధికార బీఆర్‌ఎస్ తర్వాత జిల్లాలో అత్యధికంగా సర్వేలు చేయిస్తున్నది కాంగ్రెస్, బీజేపీలే. ఆ ఇరు పార్టీలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సైతం సర్వే చేయిస్తున్నారు. కాంగ్రెస్‌లో గెలుపోటములను పక్కన పెడితే ప్రధానంగా టికెట్ సాధించే అంశంపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ఎవరిని సంప్రదిస్తే టికెట్ సాధించుకోవచ్చనే అంశంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అదేవిధంగా బీజేపీ సైతం ఆ పార్టీ అధిష్ఠానం ఓ ఏజెన్సీ ద్వారా అభ్యర్థులపై సర్వే చేయిస్తుండగా అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేకంగా మరో ఏజెన్సీని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
వివరాలు సేకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు
రాష్ట్ర ఏజెన్సీల లాగానే కేంద్ర నిఘా ఏజెన్సీలు కూడా రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులపై అంచనా వేస్తున్నాయి. తాజా పరిస్థితులు అని ఏ విధంగా ఉన్నాయి. ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి ఎక్కడ వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలపై వివరాలు సేకరిస్తున్నాయి. వాటి నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తాజా పరిస్థితులను కూడా అంచనా వేస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రైవేట్ సంస్థలతో పాటు ఇంటలిజెన్స్ నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ప్రతీ మండలంలో 30 శాంపిళ్ల చొప్పున ప్రతీ నెల ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి సేకరిస్తున్నారు. ఎన్నికలు సమీపించాక 10 రోజులకు ఒకసారి ఇంటలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అంశాల వారిగా ఫీడ్‌బ్యాక్ కావాల్సిన సందర్భంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సమాచారం.