జిల్లాలో మరో మండలంగా పల్వంచ

ABN , First Publish Date - 2023-04-19T00:23:38+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి 2016 సంవత్సరంలో కామారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడింది. అప్పటికీ జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా బీబీపేట, రాజంపేట, రామారెడ్డి, నస్రూల్లాబాద్‌, పెద్దకొడప్‌గల్‌లను నూతన మండలాలుగా ఏర్పాటు చేశారు.

జిల్లాలో మరో మండలంగా పల్వంచ
పల్వంచ గ్రామ పంచాయతీ

- పల్వంచ కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ

- ఇప్పటికే డొంగ్లి కొత్త మండలంగా ఏర్పాటు

- దీంతో జిల్లాలో 24 మండలాలు

- మరో రెండు మండలాలకు సైతం డిమాండ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి)/మాచారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి 2016 సంవత్సరంలో కామారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడింది. అప్పటికీ జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా బీబీపేట, రాజంపేట, రామారెడ్డి, నస్రూల్లాబాద్‌, పెద్దకొడప్‌గల్‌లను నూతన మండలాలుగా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల జుక్కల్‌ నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా డొంగ్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండలంలోని పల్వంచను మండల కేంద్రంగా చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో జిల్లాలో మొత్తం 24 మండలాలు ఏర్పడ్డాయి.

పల్వంచను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జీవో జారీ

కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం నుంచి పలు గ్రామాలను వేరు చేసి రామారెడ్డి మండలంను ఏర్పాటు చేశారు. మంగళవారం మరోమారు మాచారెడ్డి మండలం నుంచి 9 గ్రామాలను, రామారెడ్డి మండలం నుంచి మరో గ్రామాన్ని కలిపి జీవో 38 ద్వారా ్తపల్వంచను సైతం మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఆగస్టులో 5న గెజిట్‌ నోటిఫికేషన్‌ సైతం విడుదల చేశారు. అప్పటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో పల్వంచ మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పల్వంచ, వెల్పుగొండ, వాడి,ఫరీద్‌పేట్‌, బండరామేశ్వర్‌పల్లి, ఇసాయిపేట్‌, మంఽథన్‌దేవునిపల్లి, పోతారం, భవానిపేట్‌, సింగరాయిపల్లి గ్రామాలను కలుపుతూ కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు.

మరో రెండు మండలాల ఏర్పాటుకు డిమాండ్‌

కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పడడంతో పాటు ఐదు కొత్త మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 22 మండలాలతో కామారెడ్డి జిల్లా ఆవిర్భంచింది. ఇటీవల మద్నూర్‌ మండలంలోని డొంగ్లిని మంజూరు చేశారు. తాజాగా పల్వంచ మండల కేంద్రం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పాటు మరో రెండు మండలాలు ఏర్పాటు చేయాలంటూ స్థానికంగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌నగర్‌ కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలంటూ అక్కడి ప్రజాప్రతినిధులు నాయకులంతా ఎమ్మెల్యే హన్మంత్‌షిండేపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోని హన్మాజీపేట మండలంగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఈ రెండు మండలాలపై ప్రతిపాదనలు సైతం పంపినట్లు తెలుస్తోంది.

పల్వంచ మరింత అభివృద్ధి చెందుతుంది

- గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌, కామారెడ్డి

మాచారెడ్డి మండలంలోని పల్వంచ మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. 10 గ్రామ పంచాయతీలతో కూడిన పల్వంచను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడంతో మరింత అభివృద్ధి చెందనుంది. కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిపై పల్వంచ ఉండడం అభివృద్ధికి మరింత కలిసిరానుంది. కొత్త మండలంలోని చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు సేవలు మరింత చేరువ కానున్నాయి.

Updated Date - 2023-04-19T00:23:38+05:30 IST