15 రోజులైనా పైసల్‌ పడుతాలేవ్‌

ABN , First Publish Date - 2023-05-26T00:00:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలుగకుండా రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అందుకు ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తోంది. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని తీసుకున్న వారంలోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కేసీఆర్‌తో పాటు సంబంధిత శాఖ మంత్రి జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

15 రోజులైనా పైసల్‌ పడుతాలేవ్‌

- తూకం వేసిన తర్వాత మిల్లర్ల కటింగ్‌

- అన్ని విధాలుగా నష్టపోతున్న అన్నదాతలు

దోమకొండ, మే 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలుగకుండా రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అందుకు ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తోంది. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని తీసుకున్న వారంలోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కేసీఆర్‌తో పాటు సంబంధిత శాఖ మంత్రి జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో పనులు అలా జరగడం లేదు. రైతుల వద్ద నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి 17 రోజులైనా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. దీనికి తోడు రైతు వద్ద నుంచి కల్లంలో తూకం వేసిన అనంతరం రైస్‌మిల్లర్లు లారీ నుంచి గంప గుత్తగా తరుగు తీస్తూ కొన్ని క్వింటాళ్ల ధాన్యాన్ని కట్‌ చేసి సెంటర్‌ ఇన్‌చార్జీలకు తెలియజేస్తున్నారు. రైస్‌మిల్‌కి వెళ్లాక రైతు కాంటా చేసిన బస్తాలలో లారీల్లో వెళ్లిన బస్తాలను డివైడ్‌ చేసి ఒక్కో రైతుకు ఇంత అన్నట్లు ఇన్‌చార్జీలు రైతుకు చెబుతున్నారు. అసలు విషయం తెలిసి రైతులు ఖంగుతింటున్నారు. మైచర్‌ వచ్చే వరకు ఆరబెట్టి ఎలాంటి పొల్లు లేకుండా బస్తాకి 42.300 తూకం వేసిన కూడా తిరిగి మిల్లర్లు కట్‌ చేయడం ఏంటని రైతులు ఆవేదన చెందుతున్నారు. వీటన్నింటిని ఓర్చుకుని తరలించిన ధాన్యం డబ్బుల కోసం కొందరు రైతులు మండల కేంద్రంలో ఉన్న బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. పంటలకు పెట్టిన పురుగు మందుల దుకాణాల్లో ఉద్దెర, ట్రాక్టర్‌ అద్దెలు, ఇతర ఖర్చులు చేల్లించేందుకు రైతులు ధాన్యం డబ్బులపైనే ఆధారపడవలసిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం పంటలు వేసేందుకు సమయం దగ్గర పడటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని మండల రైతులు కోరుతున్నారు.

డబ్బులు జమ కావడం లేదు

- శేఖర్‌, రైతు, దోమకొండ

దాన్యం కాంటా చేసి ఓటీపీ చెప్పి 15 రోజులు ఆయింది. అయినా డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదు. పంటలకు రోగం వచ్చిన, అకాల వర్షాలతో తల్లడిల్లి అన్నింటికీ ఓర్చుకుని ధాన్యాన్ని సెంటర్‌లోకి తెచ్చి అరబెట్టి తూకం వేసి పంపినా ఇప్పటికీ డబ్బులు జమ కాలేదు. ఉద్దెర ఇచ్చిన మందుల దుకాణాల వారు రోజు ఫోన్‌లు చేస్తున్నారు. ఇంటి వరకు వస్తున్నారు. ఉద్దెర ఉన్న అప్పులు, ట్రాక్టర్‌ కిరాయిలు చెల్లించాలి. అధికారులు తొందరగా డబ్బులు జమ చేయాలి.

Updated Date - 2023-05-26T00:00:13+05:30 IST