మహిళలు రోడ్డెక్కినా.. స్పందించకపోవడం విచారకరం

ABN , First Publish Date - 2023-02-06T23:23:25+05:30 IST

తమ రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు రొడ్డెక్కిన స్పందించకపోవడం విచారకరమని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి వెంకటరమణరెడ్డి అన్నారు.

మహిళలు రోడ్డెక్కినా.. స్పందించకపోవడం విచారకరం

కామారెడ్డిటౌన్‌, ఫిబ్రవరి 6: తమ రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు రొడ్డెక్కిన స్పందించకపోవడం విచారకరమని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి వెంకటరమణరెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపల్‌ వద్ద డ్వాక్రా మహిళలతో కలిసి రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీలేని రుణాలు, స్త్రీనిధి బకాయిలు, అభయహస్తం డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. వారంరోజులుగా వేలమంది మహిళలు రోడ్డెక్కినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలు నిరసనకార్యక్రమాలలో పాల్గొన్నారని, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయనందుకు మాచారెడ్డి, రామారెడ్డి, కామారెడ్డి మండలాలకు చెందిన ఏపీఎంలపై బదిలీ వేటువేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. మాస్టర్‌ ప్లాన్‌ గురించి రైతులు రోడ్డెక్కినప్పుడు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు. మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు పడే వరకు ఉద్యమం ఆగదన్నారు. మహిళా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందకముందే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని, అప్పటివరకు బీజేపీ మహిళల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.

Updated Date - 2023-02-06T23:23:27+05:30 IST