సీఎంఆర్‌పై సీరియస్ ఏదీ?
ABN , First Publish Date - 2023-02-19T23:43:01+05:30 IST
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం చేరడం లేదు. సీఎంఆర్ విధించిన గడువు ఈనెల చివరికల్ల్లా ముగియనుంది.
- జిల్లాలో సీఎంఆర్ లక్ష్యం చేరని మిల్లులు
- ఇప్పటికీ ప్రభుత్వానికి చేరని కస్టం మిల్లింగ్ రైస్
- మూడు సీజన్‌లకు సంబంధించి ధాన్యం మిల్లుల్లోనే..
- కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వడంలో సాకులు చెబుతున్న మిల్లర్లు
- జిల్లాలో 130 రా... మరో 35 బాయిల్డ్ రైసుమిల్లులు
కామారెడ్డి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం చేరడం లేదు. సీఎంఆర్ విధించిన గడువు ఈనెల చివరికల్ల్లా ముగియనుంది. కానీ జిల్లాలో ఇంకా చాలా మిల్లులు నిర్ధేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. నెలరోజుల కిందట పౌర సరఫరాల శాఖ హెచ్చరికలు చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు సైతం జారీ చేసింది. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం బియ్యం అప్పగించాల్సిందేనని అందులో పేర్కొంది. ఇప్పటికే మూడు సార్లు గడువు పెంచిన దృష్ట్యా మరోసారి పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొన్ని మిల్లుల యాజమాన్యాలు పెద్దఎత్తున బియ్యం బకాయి పడ్డాయి. ఇలా జిల్లాలో సీఎంఆర్ రైసుమిల్లుల నుంచి సేకరించడంలో అధికారులు సీరియస్ తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ కేటాయించడంలో మిల్లర్లు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో వందకు పైగా రైసుమిల్లులు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 165లకు పైగా రైసుమిల్లులు ఉన్నాయి. ఇందులో 130 రా రైసుమిల్లులు ఉండగా మరో 35కి పైగా బాయిల్డ్ రైసుమిల్లులు ఉన్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 557 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2.46 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రతినెల 5,450 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీకి ప్రతీ ఏటా రెండు సీజన్‌లలో రైతులు పండించే ధాన్యాన్ని రైసుమిల్లులో మర ఆడించి బియ్యంగా మార్చి పేదలకు పంపిణీ చేస్తుంటారు.
మూడు సీజన్‌ల సీఎంఆర్ మిల్లుల్లోనే..
జిల్లాలో మూడు సీజన్‌లకు సంబంధించి ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోయింది. జిల్లాలో 2021-22లో వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి 4.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆయా రైసుమిల్లులకు కేటాయించారు. రైసుమిల్లర్లు మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి 3.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 2.54 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్‌ను మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. మరో 65,494 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి 2,76,677 మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి మిల్లులకు కేటాయించారు. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద తిరిగి ప్రభుత్వానికి 1.88 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 97వేలు మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించారు. మరో 91 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మిల్లుల్లోనే ఉంది. గత వానాకాలం సీజన్‌లోనూ 4.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. ఈ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ ఇప్పటికీ తిరిగి అప్పగించలేదు.
ఈనెల చివరి కల్లా ముగియనున్న గడువు
2021-22 వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని పలు రైసుమిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్ కింద 3.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఇందులో 2.54 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ఇచ్చినట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. మరో 65వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం వచ్చేది ఉందని ఈనెల చివరి వరకు ఇవ్వాలని ప్రభుత్వం మిల్లర్లకు గడువు పెంచింది. అయితే ఈ గడువు సమీపిస్తున్నప్పటికీ మిల్లర్ల నుంచి ఇంకా సీఎంఆర్ బియ్యం అందలేదని వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది. బాధిత రైసుమిల్లు యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే గడువు ముగియనుండగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ సీజన్‌దే కాకుండా యాసంగి, వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌కు కూడా పూర్తిస్థాయిలో మిల్లర్ల నుంచి రాలేదు.
వానాకాలం సీఎంఆర్ ఆలస్యంపై మిల్లులపై ఒత్తిడి
గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గడువు ఇదివరకే ముగిసింది. అయితే మిల్లుల యాజమాన్యాలు కోరిన నేపథ్యంలో మూడు పర్యాయాలు గడువును పొడిగించారు. గత యాసంగి సీజన్‌కు కూడా గడువు దగ్గర పడుతోంది. అయితే దీనికి మరోమారు పెంచేందుకు అవకాశం ఉండడంతో మిల్లుల యాజమాన్యాల జోలికి వెళ్లడం లేదని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు యాసంగి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం సేకరణ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిల్లులకు కేటాయింపు, వాటిని తిరిగి ఎఫ్‌సీఐ సేకరణ ప్రారంభంలో కొంత ఆలస్యం చోటు చేసుకుంది. దీంతో సీఎంఆర్ అప్పగించడానికి కొందరు వెసులుబాటు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ వానాకాలం విషయంలో ఇప్పటికే ఆలస్యం అవడంతో అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు.