బడి బస్సు భద్రమేనా?

ABN , First Publish Date - 2023-05-31T23:26:41+05:30 IST

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నాణ్యమైన విద్య నందిస్తున్నామని ప్రకటనలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలో కార్పొరేట్‌ స్థాయి విద్య అందకపోవడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు పట్టణాల్లో పిల్లలను చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు.

బడి బస్సు భద్రమేనా?

- సమీపిస్తున్న విద్యాసంస్థల పునఃప్రారంభం గడువు

- జిల్లాలో 275 ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు

- ప్రతీ ఏటా అంతంత మాత్రంగానే ఫిట్‌నెట్‌ పరీక్షలకు హాజరు

- నిబంధనల ప్రకారం ఉంటేనే ఫిట్‌నెస్‌ అందిస్తామంటున్న రవాణాశాఖ

కామారెడ్డి టౌన్‌, మే 31: ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నాణ్యమైన విద్య నందిస్తున్నామని ప్రకటనలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలో కార్పొరేట్‌ స్థాయి విద్య అందకపోవడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు పట్టణాల్లో పిల్లలను చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్‌ విద్యాసంస్థల యజమాన్యాలు వారి గ్రామాల నుంచి పిల్లలను పట్టణంలోని పాఠశాలలకు తీసుకొచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను రవాణా చేసినందుకు రవాణా చార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. అయితే విద్యాసంస్థల యజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా బస్సులను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలుమార్లు విద్యాసంస్థలకు చెందిన బస్సులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. బస్సు సీట్లకు మించి విద్యార్థులను ఎక్కువగా చేరవేస్తున్నారు. అంతేగాక బస్సుల ఫిట్‌నెస్‌ను డ్రైవర్‌ కండీషన్‌ను పట్టించుకోవడం లేదు. ఇలాంటి బస్సులపై దృష్టి సారించి పిల్లలకు ఎలాంటి ఆపద ఏర్పడకూడదని ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఫిట్‌నెస్‌కు సంబందించిన పరీక్షలు చేయాలని నిర్ణయించింది. అందుకుగాను ప్రతీ సంవత్సరం బస్సులకు అందించే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల గడువు మే 15 వరకు ముగిసేట్లుగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతీ సంవత్సరం అధికారులు బస్సులు ఎంత మేర ఫిట్‌నెస్‌ ఉన్నాయనే దానిపై తనిఖీలు చేస్తూ విద్యాసంస్థల పునఃప్రారంభం వరకు సర్టిఫికెట్లను జారీ చేస్తుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిట్‌నెస్‌ చర్యల్లో భాగంగా ఈ నెల 16 నుంచి విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ జిల్లాలోని పలు విద్యాసంస్థలకు చెందిన బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించుకోవడానికి ముందుకు రావడం గమనార్హం.

మరో 12 రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలు

యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు పాఠశాల భవనాలకు రంగులు వేస్తూ అడ్మిషన్లు పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ విద్యార్థులను తరలించే వాహనాల ఫిట్‌నెస్‌పై మాత్రం దృష్టి పెట్టడం లేదు. మరో 12 రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కావడం అప్పటిలోగా అన్ని బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్ష పాస్‌ నిర్వహించడం అంత ఈజీ కాదు. మరోవైపు కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ పరీక్ష పాస్‌ కావడానికి వాహనాలకు తాత్కాలికంగా మరమ్మతు నిర్వహించి మమ అనిపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. గతేడాది బడి బస్సులకు ఇచ్చిన ఫిట్‌నెస్‌ సర్టిపికెట్ల గడువు మే 15వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంఽధించి ఫిట్‌నెస్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నా ఫిట్‌నెస్‌ ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గడువు ముగిసినా విద్యా సంస్థల బస్సులు యథేచగా తిరుగుతున్నాయని అధికారులు మాత్రం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సారైన యాజమాన్యాలు పాఠాలు నేర్చుకుంటాయా.. ధనార్జనే ధ్యేయంగా అర్హతలేని బస్సులకు మెరుగులు దిద్ది దర్జాగా తిప్పుతారా అన్న సందేహాలు విద్యార్థి సంఘ నాయకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

ఫిట్‌నెస్‌ పరీక్షలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు

బడి బస్సు ఫిట్‌నెస్‌ అర్హత సాధించాలంటే అనేక నిబంధనలున్నాయి. కానీ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లు వదలుతున్నారన్న ఆరోపణలున్నాయి. పాత బస్సులకు కొత్త రంగులద్ది బస్సులను నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రవాణాశాఖ నిర్ధేశించిన ప్రమాణాలు యాజమాన్యలు పట్టించుకోవడం లేదని విమర్శలు లేకపోలేదు. జిల్లాలో రవాణాశాఖ అధికారిక లెక్కల ప్రకారం 275 బడి బస్సులున్నాయి అందులో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చుట్టు పక్కల ఉన్న మండలాల్లోనే ఎక్కువగా పాఠశాలలు ఉండడం ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకుండా గడువు చివరి వరకు వేచి ఉండి గాబరా గాబరాగా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నట్ల్లు సమాచారం. అందుకు ఉదాహరణనే ఆర్‌టీఏ కార్యాలయంలో నమోదు అయిన ఫిట్‌నెస్‌ బస్సుల సంఖ్య వివరాలు. ఏటా పాఠశాల పునఃప్రారంభం నాటికి ఫిట్‌నెస్‌ కోసం బస్సులను రవాణా శాఖ కార్యాలయానికి తీసుకెళ్తున్నా విద్యా సంస్థల నిర్వాహకులు వారికి సంబంధించిన ఏజెంట్ల ద్వారానే బడిబస్సును ఫిట్‌నెస్‌కు తీసుకె ళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే నిబంధనల ప్రకారం ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రమాణాలపై అనుమానాలెన్నో..

బడి బస్సుల ప్రమాణాలపై ప్రతీ ఏడాది లాగానే.. ఎన్నో అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పాటిస్తున్నాయా.. లేదా.. ఒకవేళ ఫిట్‌నెస్‌ లేకపోయినా అధికారులు చూసీచూడనట్లుగా వదిలేసి వాటికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారా...? అనే ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సరిగా లేని బస్సులకు చిన్న చిన్న మరమ్మతులు చేసి రంగులు వేసి తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఫిట్‌నెస్‌ పరీక్షలకు పంపుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో 12 రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ పరీక్షలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించని అధికారులు హడావుడిగా ఆ ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉందని, తద్వారా ఈ పరీక్షలు తూతూ మంత్రంగా సాగుతాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వాటి ప్రమాణాలపై అధికారులు పకడ్బందీగా వ్యవహరించాల్సిందేనని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు.

ఫిట్‌నెస్‌ నిబంధనలు ఇలా..

- బస్సుకు నాలుగు వైపుల పైభాగం మూలల్లో బయటివైపు గాడ పసుపుపచ్చని రంగు గల ప్లాషింగ్‌ లైటు అమర్చాలి. విద్యార్థులు బస్సు నుంచి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఈ లైట్లను వెలిగించాలి.

- బస్సు ముందు భాగంలో 400 ఎంఎం సైజు బోర్డును పాఠశాల పేరుతో రాయించి అమర్చాలి. ఈ బోర్డుపై 250 ఎంఎంలకు తగ్గకుండా ఇద్దరు పాఠశాల విద్యార్థుల బొమ్మలను నల్లరంగులో చిత్రీకరించాలి. ఈ చిత్రం కింద స్కూల్‌ బస్సు అని నల్లరంగులో కనీసం 100 ఎంఎం అక్షరాలతో రాయాలి.

- ప్రతీ విద్యాసంస్థ సీటింగ్‌ కెపాసిటీ కన్నా ఎక్కువగా విద్యార్థులను తీసుకొని వెళ్లరాదు.

- ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం, ట్రాన్స్‌పోర్టు శాఖ, పోలీస్‌ శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంవత్సరానికి ఒకరోజు రోడ్‌సేఫ్టీ తరగతులు నిర్వహించాలి.

- బస్సు ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు నుంచి 325 ఎంఎం ఎత్తుకు మించరాదు. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహాలతో అమర్చాలి.

- బడి బస్సును నడిపే డ్రైవర్‌ వయస్సు 60 సంవత్సరాలు మించరాదు. బస్సు, డ్రైవర్‌ పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి.

- డ్రైవర్‌కు హేవీ లైసెన్స్‌తో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని మూడు నెలలకు ఒకసారి యాజమాన్యమే చెక్‌ చేయించాలి.

- ప్రతీనెల స్కూల్‌ ప్రిన్సిపాల్‌, పేరెంట్స్‌ కమిటీ తప్పనిసరిగా బస్సులను తనిఖీ చేయాలి.

- బస్సులో ప్రఽథమ చికిత్స బాక్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉన్నట్లు తెలిసేలా పెద్ద అక్షరాలతో రాయించాలి.

- ఇంజన్‌, బాడీ కండీషన్‌లో ఉండాలి. కన్వెక్షన్‌ క్రాస్‌ మిర్రర్‌ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. బ్యాగ్‌లను భద్ర పరుచుకునేందుకు సీట్ల కింద ర్యాక్‌లు ఉండాలి.

- బస్సు వయస్సు (తయారైన తేది నుంచి) 15 సంవత్సరాలు మించకూడదు. పూర్తి స్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి.

- విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారి సెల్‌ నెంబర్‌ సహ పూర్తి చిరునామా బస్సు ఎడమ భాగంలో, ముందు భాగంలో కనపడేలా రాయించాలి.

Updated Date - 2023-05-31T23:26:41+05:30 IST