భూసారం తెలిసేదెలా!

ABN , First Publish Date - 2023-03-12T00:07:38+05:30 IST

పంట భూముల్లో ఎలాంటి ఎరువులు వాడాలి.. ఎంత మొత్తంలో వినియోగించాలి.. ఏ రకం పంటలకు ఏ భూమి అనుకూలంగా ఉందో రైతులకు తెలిసినప్పుడే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

భూసారం తెలిసేదెలా!
సదాశివనగర్‌లో మట్టి నమునాలు సేకరిస్తున్న వ్యవసాయ అధికారులు (ఫైల్‌)

- రైతు వేదికల్లో అందుబాటులో లేని భూసార పరీక్షలు

- రసాయనాల సరఫరాను నిలిపివేసిన ప్రభుత్వం

- మోతాదుకు మించి ఎరువులు వినియోగిస్తున్న రైతులు

- దిగుబడి తగ్గి నిస్సారంగా మారుతున్న సాగు భూములు

సదాశివనగర్‌, మార్చి 11: పంట భూముల్లో ఎలాంటి ఎరువులు వాడాలి.. ఎంత మొత్తంలో వినియోగించాలి.. ఏ రకం పంటలకు ఏ భూమి అనుకూలంగా ఉందో రైతులకు తెలిసినప్పుడే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. భూసారాన్ని ఖచ్చితత్వంతో పరీక్షించినప్పుడే ఎరువుల వినియోగంపై అంచనా వస్తోంది. అయితే వ్యవసాయంలో ఎంతో కీలకమైన భూసార పరీక్షలను ప్రభుత్వం ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా భూసార పరీక్షలపై దృష్టి సారించకపోవడంతో రైతులు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడి పెరగడంతో భూములు నిస్సారంగా మారుతున్నాయి.

నిలిచిన రసాయనాల సరఫరా

జిల్లాలోని 22 మండలాల పరిధిలో సుమారు 7 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములు ఉన్నాయి. రైతులు ఏటా సుమారు 5.5 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. గతంలో ప్రతీ వానాకాలం సీజన్‌కు ముందే వ్యవసాయశాఖ భూసార పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరించేంది. విశ్లేషణ తర్వాత ఫలితాలను తెలిపేవారు. నేల స్వభావంతో పాటు సూక్ష్మజీవుల స్థాయి, ఎలాంటి పోషకాలు భూమిలో ఉన్నాయి. ఎలాంటి పంటలు సాగుచేస్తే లాభదాయకమో కూడా వివరించేవారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువచేసేందుకు ప్రతీ క్లస్టర్‌లో ఒక రైతువేదికను ఏర్పాటు చేసింది. ఆయా వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండడంతో పాటు భూసార పరీక్షలు చేయించేలా 100 చొప్పున భూసార పరీక్షల కిట్లను సైతం పంపిణీ చేసింది. సాగు భూముల్లో నమూనాలు సేకరించి భూసార పరీక్షల అనంతరం ఫలితాలకు రైతులకు తెలియజేసేవారు. అయితే ప్రారంభంలో అందించిన రసాయనాల సరఫరా నిలిచిపోవడంతో రైతు వేదికల్లో భూసార పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి.

అవగాహన లేక పరీక్షలకు దూరం

భూసార పరీక్షల ప్రయోజనాలపై అవగాహన లేని రైతులు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. స్థానికంగా అందుబాటులో లేకపోయినా ప్రతీ జిల్లాలో ఒక భూసార కేంద్రాన్ని ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచింది. గతంలో మాదిరిగా ప్రభుత్వం వ్యవసాయశాఖకు ప్రత్యేకంగా ఎలాంటి లక్ష్యాన్ని నిర్ధేశించకపోవడంతో ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోరితే తప్ప పరీక్షలు చేయించేందుకు ముందుకు రావడం లేదు. పంటల సాగు కాలానికి ముందు తూతూ మంత్రంగా కొన్ని శాంపిల్స్‌ సేకరించి జిల్లా భూసార పరీక్ష కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతీ మూడు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేయిస్తేనే భూమిలోని పోషకాలు, లవణాలు తెలుస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న భూసారపరీక్షలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Updated Date - 2023-03-12T00:07:38+05:30 IST