మద్నూర్‌-బోధన్‌ జాతీయ రహదారి పనులకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2023-03-24T00:06:27+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మరో జాతీయ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మద్నూర్‌-బోధన్‌ జాతీయ రహదారి పనులకు గ్రీన్‌ సిగ్నల్‌
మద్నూర్‌-బోధన్‌ జాతీయ రహదారి కోసం అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ధారించిన దృశ్యం

- ఎన్‌హెచ్‌-161 బీబీ పరిపాలన అనుమతులు జారీ చేసిన కేంద్రం

- జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం రూ.429 కోట్లు మంజూరు

- 76 కి.మీ.ల వరకు విస్తరించనున్న జాతీయ రహదారి

- గతంలోనే ఈ రహదారి విస్తరణకు పూర్తయిన సర్వే

- ఇప్పటికే కొనసాగుతున్న బోధన్‌-బాసర-భైంసా పనులు

కామారెడ్డి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మరో జాతీయ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్‌హెచ్‌ 161 జాతీయ రహదారి పనులు చేపట్టెందుకు పరిపాలన అనుమతులను ఇస్తూ జీవోను జారీ చేసింది. అంతేకాకుండా ఈ పనులు చేపట్టేందుకు రూ.429కోట్లను సైతం మంజూరు చేసింది. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ నుంచి మద్నూర్‌ వరకు ఉన్న రెండు లైన్ల ప్రధాన రహదారిని నాలుగు లైన్ల జాతీయ రహదారిగా మార్చనున్నారు. ఇటీవల జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మద్నూర్‌-బోధన్‌ జాతీయ రహదారి పనులు చేపట్టాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరికి పలుమార్లు విన్నవిస్తూ వచ్చారు. దీంతో కేంద్రం ఈ రహదారి పనులకు అనుమతులు జారీ చేయడంపై ఎంపీ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగులైన్ల జాతీయ రహదారి పనులు పూర్తయితే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉమ్మడి జిల్లాల స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న మద్నూర్‌-బోధన్‌ జాతీయ రహదారి కల త్వరలోనే నెరవేరనుంది.

గతంలోనే ఎన్‌హెచ్‌ 166 జాతీయ రహదారికి శంకుస్థాపన

భైంసా-బాసర-బోధన్‌-మద్నూర్‌ వరకు జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ 166 బీబీ నామకరణం చేసి మంజూరు చేసింది. అయితే ఏడాది కిందట మొదటి విడత కింద భైంసా-బాసర-బోధన్‌ వరకు ఎన్‌హెచ్‌ 161 జాతీయ రహదారి విస్తరణ పనులకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తిచేసి భూ సేకరణలో ఉన్నారు. దీంతో పాటు మద్నూర్‌ వరకు సైతం ఇదివరకే సర్వే పూర్తి చేశారు. బోధన్‌ నుంచి మద్నూర్‌ వరకు ప్రస్తుతం రెండు లైన్ల రహదారి ఉంది. ప్రస్తుతం ఈ రహదారి విస్తరణకు పరిపాలన అనుమతులు రావడంతో ఆయా మండలాల స్థానిక గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మద్నూర్‌ ప్రజలు తమ రోడ్డు కూడా పూర్తవుతుందని ఎదురుచూస్తూ వచ్చారు. బోధన్‌ నుంచి మద్నూర్‌ వరకు 161 జాతీయ రహదారి పనులకు సైతం కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేశారు.

76 కి.మీ.ల వరకు

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలోని జుక్కల్‌, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ 161 బీబీ జాతీయ రహదారిని గతంలోనే మంజూరు చేసింది. ఈ జాతీయ రహదారి ఉమ్మడి జిల్లాల పరిధిలో బోధన్‌, కోటగిరి, మద్నూర్‌ మండలాల పరిధిలోని పలు గ్రామాలను కలుపుతూ నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 76 కి.మీల మేర ఈ జాతీయ రహదారి పనులు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాల పరిధిలో 5 మండలాలైన బోధన్‌, కోటగిరి, రూద్రుర్‌, పొతంగల్‌, బీర్కూర్‌, డీంగ్లి, మద్నూర్‌ వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరగనున్నాయి. అయితే 2018లోనే ఈ జాతీయ రహదారి పనులకై సర్వే సైతం పూర్తి చేయడమే కాకుండా హద్దురాళ్లను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బోధన్‌, మద్నూర్‌ వరకు జాతీయ రహదారి పనులకై కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేయడమే కాకుండా రూ.429 కోట్ల నిధులను మంజూరు చేయడంతో పనులు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రోడ్డు విస్తరణకు భూ సేకరణ చేపట్టాల్సి ఉంది.

Updated Date - 2023-03-24T00:06:27+05:30 IST