కామారెడ్డిలో దొంగ బంగారం దందా

ABN , First Publish Date - 2023-03-26T00:24:17+05:30 IST

కామారెడ్డి దొంగ బంగారం దందాకు అడ్డాగా మారింది. పలువురు బంగారం వ్యాపారులు నకిలీ బంగారాన్ని కొనుగోలుదారులకు అంటగట్టడమే కాకుండా దొంగతనం చేసిన బంగారాన్ని కొనుగోలు చేస్తు దందాకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డిలో దొంగ బంగారం దందా

- బంగారం దొంగలకు కొనుగోలు కేంద్రంగా కామారెడ్డి

- చుట్టు పక్కల జిల్లాల్లో దొంగలించిన బంగారాన్ని కామారెడ్డిలో విక్రయిస్తున్న దొంగలు

- ఓ బంగారం వ్యాపారి దొంగల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు

- తక్కువ ధరకు కొనుగోలు చేసి గుర్తుపట్టకుండా దొంగ బంగారాన్ని కరిగించేస్తున్న వ్యాపారి

- ఓ దొంగ ద్వారా కొనుగోలు చేసిన 9 తులాల బంగారం వ్యాపారి నుంచి రికవరీ

- దొంగ బంగారం దొరికిన వ్యాపారిపై చర్యలు తీసుకోని పోలీసులు

- బాధితులకు మొత్తం రికవరీ బంగారాన్ని పోలీసులు చూపించడం లేదంటూ ఆరోపణలు

- దొంగ బంగారంలో పోలీసులకు వాటాలు?

కామారెడ్డి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి దొంగ బంగారం దందాకు అడ్డాగా మారింది. పలువురు బంగారం వ్యాపారులు నకిలీ బంగారాన్ని కొనుగోలుదారులకు అంటగట్టడమే కాకుండా దొంగతనం చేసిన బంగారాన్ని కొనుగోలు చేస్తు దందాకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. దొంగల నుంచి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసి గుర్తుపట్టకుండా కరిగించేసి ఆ బంగారంతో కామారెడ్డిలోని ఓ గోల్డ్‌స్మిత్‌ జోరుగా దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చుట్టు పక్కల జిల్లాల్లో ఇళ్లలో దొంగతనానికి పాల్పడి దొంగిలించిన బంగారాన్ని దొంగలు సైతం విక్రయించేందుకు కామారెడ్డిని కేంద్రంగా ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఓ దొంగను పోలీసులు విచారించగా జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి వద్ద విక్రయించగా సదరు బంగారం వ్యాపారి నుంచి 9 తులాల బంగారాన్ని పోలీసులు రికవరి చేసినట్లు తెలిసింది. అయితే కొందరు పోలీసులకు సైతం ఈ దొంగ బంగారం దందాలో వాటాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. దీనికి నిదర్శనం దొంగ బంగారం రికవరీ చేసిన బంగారం వ్యాపారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. రికవరీలో బాధితులకు దొరికిన బంగారంలో పూర్తిస్థాయిలో చూపించకుండా మిగిలిన బంగారంలో సదరు వ్యాపారి, పోలీసులు వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దొంగ బంగారం దందాపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అడ్డుకట్ట వేయాలని ఇంటి దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.

కొనుగోలు కేంద్రంగా కామారెడ్డి

కామారెడ్డి చుట్టు పక్కల జిల్లాలైన మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్లాల్లోని రామాయంపేట, గంభీరావుపేట, కామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడి విలువైన వస్తువులతో పాటు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇళ్లలో దొంగతనాలు చోటు చేసుకోవడం బాధిత ఇళ్లల్లోంచి వందల తులల్లోనే బంగారు, వెండి ఆభరణాలను దొంగలించినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. అయితే దొంగలించిన బంగారాన్ని దొంగలు విక్రయించేందుకు కామారెడ్డిని కేంద్రంగా ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలుతుంది. ఇటీవల కాలంలో రామాయంపేట, మెదక్‌, సిద్దిపేట, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో దొంగలు దొంగలించిన బంగారాన్ని కామారెడ్డిలోని పలువురు బంగారు వ్యాపారులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన పలువురు బంగారు వ్యాపారులపై పోలీసులు నిఘాపెడుతున్నప్పటికీ దొంగ బంగారం కొనుగోళ్ల దందా మాత్రం ఆగడం లేదని ఆ వ్యాపారంలో ఉండే పలువురు వ్యాపారులే చెప్పుకురావడం గమనార్హం.

దొంగల నుంచి బంగారం కొనుగోలు చేస్తున్న ఓ బంగారు వ్యాపారి

బంగారం ధర రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ క్రయ విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. ఏ శుభకార్యానికి, అలంకరణకు బంగారం కొనుగోళ్లకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం వ్యాపారం బాగానే సాగుతోంది. ధరలు ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు సైతం తక్కువగా వచ్చే బంగారం కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు వక్రమార్గంలో దొంగ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారాన్ని కస్టమర్లు సకాలంలో డబ్బులు చెల్లించక బ్యాంకర్లు వేలం వేయడంతో బంగారు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు దొంగలు దొంగలించిన బంగారాన్ని కొనుగోలు చేసి దొంగ బంగారం దందాకు తెరలేపుతున్నారు. ఈ దొంగ బంగారం కొనుగోళ్లకై కామారెడ్డిలోని గంజ్‌రోడ్డులోని ప్రధానగేట్‌ దగ్గరనే ఉంటే ఓ బంగారం వ్యాపారి గత కొన్ని రోజులుగా దొంగ బంగారం కొనుగోలు చేస్తూ దందా జోరుగా సాగిస్తున్నాడు. దొంగల నుంచి కొనుగోలు చేసిన దొంగ బంగారాన్ని తక్కువ ధరకు సేకరించి ఆ అభరణాలను గుర్తుపట్టకుండా కరిగించేసి ఆ బంగారాన్ని కస్టమర్లకు విక్రయిస్తూ కోట్లలో దందా సాగిస్తున్నారు. కామారెడ్డిలో దొంగతనం చేసిన బంగారాన్నే కాకుండా పక్క జిల్లాల్లోని బ్రోకర్లను పెట్టుకుని దొంగల నుంచి చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేస్తూ సదరు వ్యాపారి జోరుగా దందా చేస్తున్నట్లు పోలీసుల నిఘాలోనే తేలడమే కాకుండా పలువురు బంగారు వ్యాపారులు సైతం చెప్పుకొస్తున్నారు.

రెండు రోజుల కిందట సదరు వ్యాపారి నుంచి 9 తులాల బంగారం రికవరీ

కామారెడ్డి పట్టణంలోని గంజ్‌రోడ్డులో గల ప్రధాన గేటు దగ్గరలో ఉండే ఓ బంగారం వ్యాపారి గత కొన్ని రోజులుగా దొంగ బంగారం దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల కామారెడ్డి, రామాయంపేటలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడి బంగారాన్ని దొంగిలించిన ఓ దొంగను కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సదరు దొంగ దొంగిలించిన బంగారాన్ని ఎక్కడెక్కడ విక్రయించారనే దానిపై పోలీసులు ఆరా తీయగా సదరు దొంగ కామారెడ్డిలోని గంజ్‌రోడ్డులో గల ఓ బంగారం వ్యాపారికి విక్రయించినట్లు వివరాలను పోలీసులకు వెల్లడించారు. అయితే పోలీసులు సదరు బంగారు వ్యాపారి వద్దకు వెళ్లి విచారించారు. దొంగ నుంచి బంగారం సదరు వ్యాపారి కొనుగోలు చేసినట్లు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు సదరు వ్యాపారి నుంచి 9 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. దొంగపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కానీ దొంగ బంగారం కొనుగోలు చేసిన వ్యాపారిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఇలా సదరు వ్యాపారే కాకుండా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లంలోనూ కొందరు బంగారు వ్యాపారులు దొంగల నుంచి దొంగ బంగారం కొనుగోలు చేస్తున్నా స్థానిక పోలీసులు మామూలుగానే తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దొంగ బంగారం దందాలో పోలీసులకు వాటా?

కామారెడ్డి పట్టణంలోనే కాకుండా ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద లాంటి ప్రాంతాల్లో దొంగ బంగారం దందాలో పలువురు పోలీసులకు వాటాలు ఉన్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు రావడమే కాకుండా పోలీసుశాఖలోని నిఘా వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద నుంచి బంగారం రికవరీ చేస్తే అందులో సగం మాత్రమే రికవరి అయినట్లు చూపుతున్నారని పలువురు బాధితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ సగం బంగారాన్ని మాత్రమే ఇస్తూ మిగితా బంగారంలో పోలీసులు వాటాలు పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి నిదర్శనం కామారెడ్డి పట్టణంలోని గంజ్‌ రోడ్డులో ఓ బంగారం వ్యాపారి ఓ దొంగ నుంచి 9 తులాల బంగారం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బంగారం వ్యాపారం చేసే దుకాణదారులు తాము దొంగ బంగారం కొనుగోలుచేయమని అసలే తీసుకోమంటూ పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లినప్పుడు వ్యాపారులు చెబుతుంటారు. కానీ కామారెడ్డి పట్టణానికి చెందిన ఆ బంగారం వ్యాపారి మాత్రం పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లగానే కొనుగోలు చేసిన దొంగ బంగారంలోంచి వాటాలు ఇస్తామంటూ పోలీసులను మభ్యపెట్టడం గమనార్హం. ఇదేక్రమంలో సదరు వ్యాపారి దొంగ నుంచి కొనుగోలు చేసిన 9 తులాల బంగారాన్ని పోలీసులు రికవరీ చేసినప్పటికీ కేసు నమోదు చేసిన రిపోర్టులో మాత్రం 50 శాతం దొరికినట్లు చూపించి రికవరీ బాధితులకు సగం బంగారం మాత్రమే అంటగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితులు సైతం వచ్చిందే చాలు అనుకుని పోలీసులను సైతం గట్టిగా అడగలేకపోతున్నారు. ఇలా దొంగ బంగారం దందాలో పలువురు పోలీసులు సైతం వాటాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2023-03-26T00:24:17+05:30 IST