దళితబంధుకు దరఖాస్తుల వెల్లువ

ABN , First Publish Date - 2023-03-31T02:02:12+05:30 IST

జిల్లాలో దళితబంధుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు వెలువడకుండానే అనేకమంది ఆశావహులు ఎమ్మె ల్యేలు, అధికారులను కలుస్తూ దరఖాస్తులను అంద జేస్తున్నారు.

దళితబంధుకు దరఖాస్తుల వెల్లువ

జిల్లాలో ఎమ్మెల్యేలు, అధికారులను కలుస్తూ దరఖాస్తుల అందజేత

నియోజకవర్గంలో 1100 మంది ఎంపిక

ఆయా నియోజకవర్గాల్లో జోరుగా పైరవీలు

ఏప్రిల్‌ మొదటి వారంలో నిబంధనలు వెలువడే అవకాశం

నిజామాబాద్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో దళితబంధుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు వెలువడకుండానే అనేకమంది ఆశావహులు ఎమ్మె ల్యేలు, అధికారులను కలుస్తూ దరఖాస్తులను అంద జేస్తున్నారు. తమను ఎంపిక చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్‌ మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అన్ని గ్రామాల పరిధిలో కొద్దిమందికైనా దళితబంధును అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనలు అనుసరించి అర్హుల ఎంపికతో పాటు వెంటనే యూనిట్లను మంజూరు చేసేవిధంగా సిద్ధమవుతున్నారు.

బడ్జెట్‌లో ప్రకటన

ప్రభుత్వం రెండో విడత దళితబంధు కింద లబ్ధి దారులను ఎంపిక చేస్తామని గత బడ్జెట్‌లో ప్రకటించినా ఇప్పటి వరకు మొదలుపెట్టలే దు. ఇప్పటి వరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదు. రెండో విడత కింద ఎంపిక చేస్తామని ప్రకటించిన ఈ ఆర్థిక సంవత్సరం రెండు రోజుల్లో ముగియనుంది. సీఎం కేసీఆర్‌ రెండు రోజుల క్రితం అధికారులతో సమీక్షించారు. వెంటనే మార్గదర్శకాలను విడుదల చేసి దళితబంధు కింద ఎంపిక చేయాలని ఆదేశాలను ఇచ్చారు. మొదటి విడత కింద ఈ పథకం లబ్ధి దారులను ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి వంద మంది చొప్పున సిఫారసు చేశారు. వారికే దళితబంధు యూనిట్లను మంజూరు చేశారు. జిల్లాలో మొదటి విడత కింద 550 మందికి దళితబంధును అందించారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడం వల్ల పలు ఆరోపణలు వచ్చాయి. ఎక్కు వశాతం అధికార పార్టీకి చెందిన వారికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించారు. కొంతమంది కోర్టుకు కూడా వెళ్లడంతో రెండో విడత కింద నిబంధనలు విడుదల చేయడంతో పాటు అధికారులకు కమిటీతో ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో గైడ్‌లైన్స్‌ విడుదల కానుండడంతో ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దళితబంధు కింద రెండో విడతలో మొదట నియోజకవర్గానికి 11వందల మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం రెండో విడత కింద 3వేల మందిని ఎంపిక చేస్తామని ప్రకటించిన తదనంతరం 11వందల మందికి అనుమతి ఇచ్చారు. ఇవి పూర్తయిన తర్వాత మిగతా వారిని ఎంపిక చేయనున్నారు. మూడో ఆర్థిక సంవత్సరం కూడా ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావడంతో ఎన్నికల సంవత్సరం అయినందున నియోజకవర్గానికి 2 విడతల్లో కలిపి 6వేల వరకు దళితబంధు కింద లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు, అనుమతులు, నిధులను బట్టి ఈ లబ్దిదారుల ఎంపిక జరగనుంది. జిల్లాలో మొద టి విడత అంతా అధికార పార్టీకి అనుకూలించే ఎం పిక చేయడంతో ఈ దఫా అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు ముందస్తుగానే అధి కార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళితబంధును అందిస్తున్న మండలస్థాయిలో అధికారుల ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలను విడుదల చేయకపోవడం వల్ల అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టడంలేదు.

జిల్లాలో పెరిగిన పోటీ

దళితబంధు కింద లబ్ధిదారులకు 10లక్షల రూపాయల యూనిట్‌ మంజూరు చేస్తుండడంతో జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో 15వేల నుంచి 20వేల మధ్య అర్హులైన కుటుంబాలు ఉన్నాయి. వారందరు దళితబంధు కింద ఎంపికకోసం ఎదురుచూస్తున్నారు. విడతల వారీగా ఎంపికచేస్తామని ప్రభుత్వం ప్రకటించిన వచ్చే ఎన్నికల తర్వాత ఏవిధంగా ఉంటుందోనని ఎక్కువమంది దరఖాస్తులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు, కలెక్టర్‌కు దరఖాస్తులను అందిస్తున్నారు. దళితబంధు కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసి యూనిట్లను మంజూరు చేయాలని కోరుతున్నారు.

రూ.3 లక్షల వరకు ఒప్పందాలు!

జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో పోటి ఎక్కువగా ఉండడంతో వీరి ఎంపిక కూడా ప్రజాప్రతినిఽధులకు, అధికారులకు కత్తిమీద సాములానే మారనుంది. ఈ దళితబంధు పథకానికి ఉన్న పోటీ వల్ల పైరవీలు కూడా భారీగా పెరిగాయి. లబ్ధిదారులను ఎంపికచేస్తే రెండు నుంచి 3 లక్షల వరకు వారికి ఇచ్చేవిధంగా ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత పంపిణీలో కూడా 2 లక్షల వరకు తీసుకోవడంతో ఈ దఫా కూడా అదే రీతిలో ఎంపిక జరుగుతాయని ఎక్కువమంది భావిస్తున్నారు. తమకు దగ్గరగా ఉన్న నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత మొత్తం అయిన చెల్లించి యూనిట్‌ను ద క్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మొదటి వారంలో విడుదల చేసే గైడ్‌లైన్స్‌ ప్రకారం అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ దళితబంధు ఎంపిక సక్రమంగా జరగకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రభావం కూడా చూపెట్టే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-31T02:02:12+05:30 IST