క్రమబద్ధీకరణ గడువు పొడగింపు

ABN , First Publish Date - 2023-03-26T00:26:51+05:30 IST

సొంత ఇల్లు కాని, స్థలం కాని లేకపోవడంతో ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఇంటి పట్టాలు లేక అనేక అవస్థలు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ జీవో నెంబర్‌ 58 ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది.

క్రమబద్ధీకరణ గడువు పొడగింపు
ఇళ్ల క్రమబద్ధీకరణ చేసుకున్న వారికి పట్టాలు అందిస్తున్న ప్రభుత్వ విప్‌, కలెక్టర్‌లు

- ఇళ్లు నిర్మించుకున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

- ఏప్రిల్‌ 30 వరకు గడువు పెంచిన ప్రభుత్వం

- జీవో 58 ప్రకారం 120 గజాలలోపు ఉన్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ

- జీవో 59 ప్రకారం 120 గజాల కంటే ఎక్కువగా ఉంటే మార్కెట్‌ విలువ ప్రకారం డబ్బులు చెల్లించేలా ప్రణాళిక

- జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకునేనా?

కామారెడ్డి టౌన్‌, మార్చి 25: సొంత ఇల్లు కాని, స్థలం కాని లేకపోవడంతో ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఇంటి పట్టాలు లేక అనేక అవస్థలు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ జీవో నెంబర్‌ 58 ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 2014 కంటే ముందు ఇల్లు నిర్మించుకున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతంలోనే అవకాశం కల్పించింది. అయితే విస్తృత స్థాయిలో ప్రచారం లేకపోవడంతో వేలల్లోనే ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు ఉన్నా కేవలం వందల సంఖ్యలోనే ఇళ్ల క్రమబద్ధీకరణను చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పిస్తూ క్రమబద్ధీకరణకు ఏప్రిల్‌ 30 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 58 జీవో కింద ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనుండగా, 59 జీవో ప్రకారం 120 గజాల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి మార్కెట్‌ విలువ చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకునేలా ప్రణాళికను తయారు చేశారు.

ప్రభుత్వానికి సమకురనున్న ఆదాయం

జిల్లాలో ఏళ్ల కిందటే పలువురు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 120 గజాలలోపు ఉంటే ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనుండగా 120 గజాలకు మించితే మార్కెట్‌ ధర ప్రకారం డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం 59 జీవో జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు ఇంటి యజమాని పేరున ఇల్లు క్రమబద్ధీకరణ జరగనుంది. అయితే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు వేలల్లో ఉన్న చాలా మంది ముందుకు రావడం లేదు, దీంతో ప్రభుత్వం ఆశించిన మేరకు ఆదాయం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి ఏప్రిల్‌ 30 వరకు గడువు పెంచింది. ఈసారి కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ముందుకు రాకపోతే ఇళ్ల యజమానులపై కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా క్రమబద్ధీకరణ చేసుకున్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న గృహాలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షల లబ్ధి సైతం చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

120 గజాలలోపు ఉచితంగా

120 గజాలలోపు ఉన్న వారికి జీవో 58 ప్రకారం ఉచితంగా, అంతకంటే ఎక్కువ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను మార్కెట్‌ విలువ ప్రకారం డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరించాలని 59 జీవోలో నిబంధనలను సడలించారు. దీని ప్రకారం వచ్చిన దరఖాస్తులను అధికారులు విచారణ చేసి మార్కెట్‌ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. తద్వారా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అయితే గతంలో క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడంతో స్పందన కరువైంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతో పాటు 526 గ్రామ పంచాయతీల్లో వేలల్లోనే క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఉండగా వందల సంఖ్యలోనే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. విస్తృతస్థాయిలో ప్రచారం లేకపోవడంతో కామారెడ్డి పట్టణంలో కేవలం 250లోపే దరఖాస్తులు చేసుకోగా అందులో 233 మందికి క్రమబద్ధీకరణ చేసి పట్టాలను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా అందజేశారు. అయితే విలీన గ్రామాల్లో పెద్ద సంఖ్యలోనే క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కలెక్టరేట్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ సమాచారం తెలుసుకున్న పలువురు అసలు ఎక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై కనీస అవగాహన లేకపోవడంతో మున్సిపల్‌, రెవెన్యూ, కలెక్టరేట్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు.

Updated Date - 2023-03-26T00:26:51+05:30 IST