Double bedroom houses: డబ్బుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ABN , First Publish Date - 2023-05-13T03:00:12+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపుతోపాటు సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల మంజూరులో బీఆర్‌ఎస్‌ నాయకులు వసూళ్ల పర్వానికి తెర లేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Double bedroom houses: డబ్బుల్‌  బెడ్‌రూం ఇళ్లు

లబ్ధిదారుల నుంచి రూ.50వేల దాకా వసూలు

కామారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయకుల నిర్వాకం

వీరికి వంత పాడుతున్న అధికార యంత్రాంగం

నేతలు చెప్పిన పేర్లే లబ్ధిదారుల జాబితాలోకి

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దరఖాస్తుదారులు

బాన్సువాడలో స్పీకర్‌ పోచారం ‘ప్రత్యేక’ చొరవ

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పథకం అమలు

సొంత జాగాలో ఇల్లు కట్టుకున్నా బిల్లులు

వాటిని సైతం వదలిపెట్టని నాయకులు

బిల్లులు కావాలంటే ముడుపులు

ఇవ్వాల్సిందేనని లబ్ధిదారులకు స్పష్టీకరణ

’’కామారెడ్డి, మే 12 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపుతోపాటు సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల మంజూరులో బీఆర్‌ఎస్‌ నాయకులు వసూళ్ల పర్వానికి తెర లేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్లు ఇవ్వకపోతే జాబితాలో లబ్ధ్దిదారుడి పేరు ఉన్నా.. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తొలగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మునిసిపాలిటీల్లో జరుగుతున్న అవకతవకలపై అధికారులు, ప్రజాప్రతినిధులను పలువురు దరఖాస్తుదారులు నిలదీస్తుండడం చర్చనీయాంశంగామారింది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు విడుతల వారీగా 15,862 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇందులో స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే 11 వేల డబుల్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 8,051 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 2,949 ఇళ్లు ప్లాస్టరింగ్‌, స్లాబ్‌, గోడల, పునాదుల దశల్లో ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గానికి 1,715 ఇళ్లు మంజూరు కాగా, 1,497 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. మిగతా 218 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జుక్కల్‌ నియోజకవర్గంలో 963 ఇళ్ల నిర్మాణం చేపట్టగా... 186 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మిగతా 777 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 850 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 48 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా 802 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఎక్కడికక్కడ అధికారులు లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. అయితే, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పిన వారికే, సొంత పార్టీ కార్యకర్తలకే కేటాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించడంలేదని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.

రూ.50వేల వరకు చెల్లించాల్సిందే..

అధికార పార్టీకి చెందిన కొందరు క్షేత్రస్థాయి నాయకులు ఒక్కో డబుల్‌ బెడ్‌రూం ఇంటి కోసం రూ.50 వేలవరకు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు చెల్లించిన వారికే ఇళ్లు కేటాయించడం, బిల్లుల మంజూరు చేయడం విమర్శలకు తావిస్తోంది. బీర్కూర్‌ మండలం దామరంచకు చెందిన సాయన్న స్థానికంగా తన సొంత ఖాళీ స్థలంలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేసి దరఖాస్తు చేసుకోగా, బిల్లు మంజూరుకు స్థానిక బీఆర్‌ఎస్‌ నేత రూ.50 వేలు డిమాండ్‌ చేస్తున్నారని బాధితుడు స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు నాయకుడిపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కామారెడ్డి నియోజకవర్గంలోనూ 620 ఇళ్లు పంపిణీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఇళ్ల కేటాయింపులోనూ ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50వేల వరకు స్థానిక నేతలు వసూలు చేశారని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనూ 30 డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ కోసం లక్కీ డ్రా తీయగా.. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయలేదంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. అయితే, క్షేత్రస్థాయి బీఆర్‌ఎస్‌ నేతలే దళారుల అవతారం ఎత్తి ముడుపులు ఇచ్చిన వారికే ఇళ్లను కేటాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. డబ్బులు ఇస్తేనే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు కేటాయిస్తామంటూ పలువురు దళారులు తెగేసి చెబుతున్నారు. అధికారులు సైతం వీరికి వత్తాసు పలుకుతుండడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక లబ్ధిదారులు సతమతమవుతున్నారు.

బాన్సువాడలో మాత్రమే ప్రత్యేకంగా..

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ప్రత్యేకంగా చేపడుతున్నారు. సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సైతం బిల్లులు మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రూ.3లక్షల చొప్పున సాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా... ఇంకా మార్గదర్శకాలే రూపొందించలేదు. కానీ, బాన్సువాడలో మాత్రం 3,849 మంది లబ్ధిదారులు సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకుంటుండగా, రూ.5.04లక్షల చొప్పున విడతల వారీగా బిల్లులు అందజేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, సీఎం స్పెషల్‌ ఫండ్‌ కింద వీరికి బిల్లులు మంజూరు చేయించినట్టు చెబుతున్నారు. సీఎంవో నుంచి ప్రత్యేక అనుమతులు తెప్పించుకుని, 90 గజాల సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పథకం కిందనే బిల్లులు అందజేస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 3,849 ఇళ్లకు రూ.192కోట్ల మేర నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటిదాకా రూ.60కోట్ల మేర బిల్లులు మంజూరైనట్లు సమాచారం. అయితే, ఇందులో నిబంధనల ఉల్లంఘన ఏమీ లేదని, కలెక్టర్‌ అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఈ బిల్లులను సైతం అధికార పార్టీ నాయకులు వదలడం లేదు. ముడుపులు ఇచ్చిన వారికే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2023-05-13T03:00:12+05:30 IST