ఆహార కల్తీపై నియంత్రణ ఏదీ?

ABN , First Publish Date - 2023-02-05T01:17:59+05:30 IST

జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది.

ఆహార కల్తీపై నియంత్రణ ఏదీ?
జిల్లాలోని ఓ దాబా హోటల్‌లో కస్టమర్‌కు వడ్డించిన చికెన్‌ బిర్యానీ(ఫైల్‌)

నాసిరకం ఆహార తయారీతో వినియోగదారులకు అనారోగ్య సమస్యలు

బ్రాండెడ్‌ వస్తువుల పేర్లతో నకిలీ ఆహార పదార్థాల తయారీ

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 4: జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. అధికారులు అడపా దడప దాడులు చేస్తున్నా.. ఆహార కల్తీ నియంత్రణ మాత్రం జరగడం లేదు. జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ శాఖలో అవసరం మేర సిబ్బంది లేక పోవడంతో నియంత్రణ కట్టడి వట్టిమాట గానే మారుతోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రజలకు బయట హోటళ్లలో తినడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇదే అధనుగా భావించిన కొందరు వ్యాపారులు ఇటు వైపు దృష్టిసారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు ఉండ డంతో హోటళ్లు నెలకొల్పడం జిల్లా వ్యాప్తంగా ఎక్కువైంది. జిల్లా వ్యాప్తం గా ప్రతీ మండలంలో ఇష్టారీతిన దాబా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు పుట్టగొడుగుల్లా వ్యాప్తి చెందుతు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయి. ముఖ్యంగా దాబా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో నాసిరకం వస్తువులు వాడుతు ఇష్టారీతిన వ్యాపరం చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా హోటళ్ల యజమానులు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీటిని సరిదిద్దాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మండలాల్లో ఉన్న దాబా హోటళ్లు ఇతర హోటళ్లపై అధికారుల దృష్టి లేకపోవడంతో యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆహార కల్తీ నియంత్రణ శాఖలో సరిపడా అధికారులు లేకపోవడం జిల్లావ్యాప్తంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల యజమానులకు కలిసి వస్తుంది. లోకల్‌గా ఉన్న నియంత్రణ అధికారులు అటువైపు దృష్టిసారించకపోవడం వారిపాలిట వరంగా మారింది. జిల్లావ్యాప్తంగా హోటళ్లు, దాబా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఎన్ని ఉన్నాయో లెక్క కూడా దొరక్కపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. హోటళ్లు, దాబా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మొదటగా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా.. జిల్లాలో అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. కొందరు మాత్రమే అనుమతులు తీసుకొని తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో అనుమతులు లేకుండానే తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇలాంటి వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

బ్రాండెడ్‌ పేర్లతో నకిలీ వస్తువులు

జిల్లాలో బ్రాండెడ్‌ పేర్లతో నకిలీ వస్తువులు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే బ్రాండెడ్‌ పేర్లను పోలి ఉండేలా ఒక అక్షరాన్ని చేర్చి యదేచ్ఛగా మార్కెట్లో విక్రయిస్తు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్‌తోపాటు మారుమూల ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది తెలియని అమాయక ప్రజలు మోసపోతున్నారు. వీటిపై కూడా కల్తీ నియంత్రణ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో ఇలాంటి వాటిపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు తూతూ మంత్రంగా హడావిడి చేసి మమ అనిపిస్తున్నారు. ముఖ్యంగా వంటనూనె, బిస్కట్లు, మినరల్‌ వాటర్‌ బాటిల్‌, చిప్స్‌, కురుకురే లాంటి వాటితో పాటు తదితర తినుబండారాలను యదేచ్ఛగా కల్తీచేసి బ్రాండెడ్‌కు సమానంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీటిలో ఎక్కువగా చిన్న పిల్లలు నాసిరకం తినుబండారాలతో అనారోగ్యాల పాలవుతున్నారు. దుకాణ యజమానులు సైతం అన్‌బ్రాండెడ్‌ వస్తువులలో ఎక్కువ మార్జిన్‌ ఉండడంతో చిన్న పిల్లలకు అన్‌బ్రాండెడ్‌ వస్తువులను అంటగడుతున్నారు. వ్యాపారమే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాలపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.

కల్తీ చేస్తే చర్యలు

: నాయక్‌, ఆహార కల్తీ నియంత్రణ జిల్లా అధికారి

హోటల్స్‌,ఫాస్ట్‌ఫుడ్‌, తదితర ఆహార పదార్థాల్లో కల్తీచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చాలాచోట్ల తనిఖిలు చేసి హోటల్స్‌కు నోటీసులు ఇచ్చాం. మూడు నోటీసులు ఇచ్చిన పద్దతి మార్చుకోకపోతే హోటల్స్‌ సీజ్‌ చేస్తాం. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ నిబంధనలకు లోబడి తినుబండారాలు అమ్మాలి. లేనిచో అలాంటి దుకాణ సముదాయాలపై కఠిన చర్యలు ఉంటాయి.

Updated Date - 2023-02-05T01:18:00+05:30 IST