ప్రీ ఫైనల్స్‌పై ముందు చూపేది..!
ABN , First Publish Date - 2023-02-21T23:54:17+05:30 IST
పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రీ ఫైనల్స్ పరీక్షలపై ఇటు డీసీఈబీ(డిస్ర్టిక్ట్ కామన్ ఎగ్జామ్ బోర్డు) అటు విద్యాశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు, ప్రిన్సిపాళ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ ప్రశ్న పత్రాలను సరఫరా చేయని డీసీఈబీ
- ప్రిన్సిపాళ్లకు వాట్సాప్‌లో ప్రశ్న పత్రాలు
- జిరాక్స్ తీసుకోవాలంటూ డీసీఈబీ ఆదేశాలు
- జిరాక్స్ సెంటర్ల చుట్టూ ప్రిన్సిపాళ్లు.. విద్యార్థులపై ఆర్థిక భారం
- ఇది వరకు విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులు సరిపోవంటున్న డీసీఈబీ అధికారులు
- నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలు
కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 21: పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రీ ఫైనల్స్ పరీక్షలపై ఇటు డీసీఈబీ(డిస్ర్టిక్ట్ కామన్ ఎగ్జామ్ బోర్డు) అటు విద్యాశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు, ప్రిన్సిపాళ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రీ ఫైనల్స్ పరీక్షల నిర్వహణకు డీసీఈబీ ఇది వరకే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినా అవి సరిపోవంటూ ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు డీసీఈబీ అధికారులు జారీ చేయడం విడ్డూరం. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ప్రశ్నపత్రాల కోసం జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుందని అంతేకాకుండా విద్యార్థులపై తమపై ఆర్థిక భారం పడనుందని పలువురు ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. డీసీఈబీ ప్రశ్నపత్రాలను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి నుంచి జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో 7వేల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు
జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో సుమారు 7 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముందస్తుగా ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తుంటారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్లను ప్రభుత్వం సరఫరా చేయదు. విద్యాశాఖనే ఆయా జిల్లాల్లోని అధికారులు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ పరీక్షలపై విద్యాశాఖ, జిల్లా పరీక్షల విభాగం ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలి. కానీ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రీ ఫైనల్స్‌పై ఇరు విభాగాలు ఎలాంటి ప్రణాళికను రూపొందించకుండా పరీక్షలు నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నారు.
రెండు విడతలుగా ప్రీ ఫైనల్స్
పదో తరగతి విద్యార్థుల కోసం ప్రతీ ఏటా విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు విడతలుగా ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తుంటారు. ఈ ప్రీ ఫైనల్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ జనవరి 1నే విడుదలైంది. ఫిబ్రవరిలో ఎస్‌ఏ 1, మార్చి రెండో వారంతో ఎస్‌ఏ 2 పరీక్షలను డీసీఈబీ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలను, ఆన్సర్ షీట్లను డీసీఈబీ సమకుర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం పదో తరగతి ప్రతీ విద్యార్థి నుంచి రూ.100 వసూలు చేశారు. ఈ డబ్బులతో విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ ప్రశ్న పత్రాలను సరఫరా చేయాలి. ఈ డబ్బులు సరిపోవడం లేదంటూ ప్రశ్న ప్రతాలను సరఫరా చేయలేమని డీసీఈబీ అధికారులు చేతులెత్తిసినట్లు ప్రిన్సిపాళ్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు పేద, మధ్య తరగతి వారే ఉండడంతో జిరాక్స్‌తో ఆర్థిక భారం పడుతుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
జిరాక్స్ సెంటర్ల చుట్టూ ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు
జిల్లా విద్యాశాఖ పట్టింపు లేకపోవడం, డీసీఈబీ అధికారుల నిర్లక్ష్యం కారణం, ముందు చూపు లేకపోవడంతో పరీక్షలకు సిద్ధం కావాల్సిన విద్యార్థులు ప్రశ్నపత్రాల కోసం జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రీ ఫైనల్స్‌కు సంబంధించి ప్రశ్న పత్రాలను డీసీఈబీ సరఫరా చేయకుండా ఒకే ఒక ప్రశ్న పత్రాన్ని ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లకు వాట్సప్ పెడుతున్నారు. ఈ ఒక్క ప్రశ్నపత్రాన్ని విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు జిరాక్స్‌లు తీసుకోవాలని డీసీఈబీ ఆదేశించింది. నేటి నుంచి జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిరాక్స్ తీసుకోవడంతో విద్యార్థులకు ఆర్థిక భారం పడనుందని ప్రిన్సిపాళ్లు జిరాక్స్ తీసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒక్కో పాఠశాలలో 40 నుంచి 100 మంది వరకు పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఒక్కో సబ్జెక్ట్‌కు మూడు నుంచి ఐదు ప్రశ్న పేపర్లు ఉన్నాయని వీటిని జిరాక్స్ తీస్తే విద్యార్థులకు రూ.100కు పైగానే ఖర్చు అవుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ ప్రశ్న పత్రాల సరఫరా విషయంలో డీసీఈబీ అధికారులను ఆయా పాఠశాల ప్రిన్సిపాళ్లు నిలదీసినట్లు తెలిసింది. సరఫరా చేయలేమని డీసీఈబీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. ఎలాగైన విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రీ ఫైనల్స్‌కు డీసీఈబీ ప్రశ్నపత్రాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.