మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తిచేస్తాం
ABN , Publish Date - Dec 19 , 2023 | 12:29 AM
రానున్న మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, ఆరు మాసాల్లో బ్రాహ్మణవెల్లంల సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సోమవారం నల్లగొండకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
ఆరు నెలల్లో బి.వెల్లెంల పూర్తి చేయిస్తా
నల్లగొండలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తాం
అక్రమ ఇసుకదందా, బెల్టు షాపుల ఆట కట్టిస్తా
రోడ్లుభవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెంకట్‌రెడ్డి
తొలిసారిగా వచ్చిన మంత్రికి ఘనస్వాగతం
నల్లగొండ. డిసెంబరు 18 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రానున్న మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, ఆరు మాసాల్లో బ్రాహ్మణవెల్లంల సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సోమవారం నల్లగొండకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మర్రిగూడ బైపాస్ వద్ద మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం రేణుకఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో నియంతపాలన పోయి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ప్రతీ పేదవాడి కళ్లల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నల్లగొండలో రౌడీయిజం, గుండాయిజం, భూకబ్జాలు, అక్రమ ఇసుకదందా కొనసాగించిందని, కాంగ్రెస్ హయాంలో అలాంటివాటికి చోటు ఉండదని స్పష్టం చేశారు. రోడ్లకు మరమ్మతు చేయిస్తానని, బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్నారు. వచ్చే ఆరునెలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చూడతామన్నారు. ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేశామని, ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరో రెండింటిని ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సలు చేయించుకునే అవకాశం కల్పించామన్నారు. స్వాగత ర్యాలీలో నాయకులు బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమే్‌షగౌడ్, జడ్పీటీసీ లక్ష్మయ్య, ఎంపీపీ సుమన్, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివా్‌సగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్, తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తా
ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. స్వాగత ర్యాలీ అనంతరం ఆయన కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చప్పట్లతో మంత్రికి అధికారులు, ఉద్యోగులు స్వాగతం పలికారు. పేదల సమస్యలు తీర్చే పౌరసరఫరాల శాఖలో ఎక్కడా డీలర్ల ఖాళీలు ఉండకూడదని అధికారులకు మంత్రి సూచించారు. ఆరోగ్యం సహకరించకున్నా నల్లగొండ మీద ప్రేమతో వచ్చానన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో అఽధికారులు భాగస్వాములు కావాలన్నారు. రూ.50వేల కోట్లపై చిలుకు ఖర్చు చేసిన మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు ఇవ్వకపోవడం అత్యంత ఘోరమన్నారు. అధికారులు నిస్పక్షపాతంగా పనిచేయాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారని, దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మిర్యాలగూడలో నీటికల్తీపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, విస్తరణకు టెండర్లు పిలిచి పనులు చేయకపోవడంపై వివరణ కోరారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన 32 మందికి పరిహారం నేటికీ ఇవ్వకపోవడం బాధాకరమని, వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనీల్‌కుమార్‌రెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్, అదనపు కలెక్టర్ కేశవ్ పాటిల్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
హెలికాప్టర్‌తో పూలవర్షం
మాటలు, చేతల ద్వారా నిత్యం చర్చల్లో నిలిచే కోమటిరెడ్డి బ్రదర్స్ సోమవారం మరోమారు వార్తల్లో నిలిచారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తన సమీప బంధువు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నేత చల్లూరి మురళీధర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల జల్లు కురిపించడం చర్చనీయాంశమైంది.
నాలుగే లేన్లుగా అమ్మనబోలు రోడ్డు
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి-అమ్మనబోలు రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. బీ.వెల్లెంల-ఎలికట్టె, నేరడ, అప్పాజిపేట రోడ్లను బీటీగా మారుస్తామన్నారు. మంత్రిగా సోమవారం తొలిసారిగా వచ్చిన ఆయనకు నార్కట్‌పల్లి వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల అభివృద్ధి తనతోపాటు నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముగ్గురిదీ బాధ్యతేనన్నారు. సీఎంతో మాట్లాడి నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం తెస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు దైద రవీందర్, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, వివేక్, దూదిమెట్ల సత్తయ్య, స్రవంతి, ఉండ్ర భాగ్యమ్మ, చంద్రశేఖర్, పాశం శ్రీనివా్‌సరెడ్డి, సట్టు సత్తయ్య, పుల్లెంల అచ్చాలు, వడ్డే భూపాల్‌రెడ్డి, జెరిపోతుల భరత్, నేతకాని కృష్ణయ్య, వారాల రమేశ్, గడుసు శశిధర్‌రెడ్డి, రాధారపు భిక్షపతి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
రూ.400కోట్లతో చిట్యాల-భువనగిరి రహదారి విస్తరణ
చిట్యాల: రూ.400కోట్లతో చిట్యాల-భువనగిరి రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నల్లగొండకు వెళ్తున్న ఆయనకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుడిపాటి లక్ష్మినర్సింహ, పోకల దేవదాస్, జడల చినమల్లయ్య, ఎద్దులపురి కృష్ణ, కాటం వెంకటేశం, ఏర్పుల పరమేషం, పాల్గొన్నారు.