పంచాయతీల్లో నీటి పరీక్షల్లేవ్‌

ABN , First Publish Date - 2023-03-02T00:52:20+05:30 IST

ప్రతి పదిహేను రోజులకోసారి చేయాల్సిన నీటి పరీక్షలను అధికారులు వదిలేశారు. భగీరథ నీటిని అందిస్తున్నామనే నెపంతో నీటి పరీక్షల నిబంధనను తుంగలో తొక్కారు. 2014-15లో ప్రతి గ్రామపంచాయతీలో నీటి పరీక్షల కోసం కిట్లు(నీటిని ప

పంచాయతీల్లో నీటి పరీక్షల్లేవ్‌
నీటి పరీక్షలు చేయాల్సిన పరికరాలు

వృథాగా నీటి పరీక్షల పరికరాలు

భానుపురి, మార్చి 1 : ప్రతి పదిహేను రోజులకోసారి చేయాల్సిన నీటి పరీక్షలను అధికారులు వదిలేశారు. భగీరథ నీటిని అందిస్తున్నామనే నెపంతో నీటి పరీక్షల నిబంధనను తుంగలో తొక్కారు. 2014-15లో ప్రతి గ్రామపంచాయతీలో నీటి పరీక్షల కోసం కిట్లు(నీటిని పరీక్షించే పరికరాలు) అందజేశారు. అయితే కొన్నాళ్ల వరకు అడపాదడపా పరీక్షలు చేసిన అధికారులు ఆ తర్వాత నీటి పరీక్షలనే మాటనే మరిచిపోయారు. ఒక్కో కిట్టుకు అప్పట్లో రూ.1,700 వెచ్చించి 12 రకాల వస్తువులను ప్రతీ గ్రామపంచాయతీకి అందజేశారు. అయితే జిల్లాలోని 475 గ్రామపంచాయతీల్లో ఎక్కడా కూడా నీటి పరీక్షలు చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో వాటర్‌మనలకు సైతం శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాల్సి ఉంది.

మూలకు పడిన కిట్లు

జిల్లాలోని ఏ పంచాయతీల్లోనూ నీటి పరీక్ష పరికరాలను వాడుతున్న దాఖలాలు లేవు. ఆ వస్తువులన్నీ మూలనపడ్డట్లు తెలుస్తోంది. మిషన భగీరథ నీరు పంపిణీ తర్వాత వాటర్‌మనలు ట్యాంకుల వద్ద నీటి పరీక్షలు చేయాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద ప్రతి నెలా 1వ, 11వ, 21వ తేదీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌తో నీటి ట్యాంకులను శుభ్రం చేసి, నీటిని పరీక్షించాల్సి ఉంది.

మురికి నీటితో ఇబ్బందులు

భగీరథ నీరు ప్రతి ఇంటికీ సరఫరా చేస్తుండడంతో శుద్ధి చేసి వచ్చిన నీరుఅడుగున మడ్డి పేరుకుంటుందని, ఆ నీరు తాగితే దద్దుర్లు రావడంతో పాటు విరోచనాలు అవుతాయని పలువురు వాపోతున్నారు. కొత్త, పాత పైపులైన్లు సక్రమంగా లేకపోవడంతో నీరు కలుషితం అవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. నీటిని పరీక్షించిన తర్వాతే పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-03-02T00:52:20+05:30 IST