చివరి భూములకు నీరందేనా?
ABN , First Publish Date - 2023-02-13T00:30:28+05:30 IST
శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు నీరందడంలేదు. దీంతో రైతులకు ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. ఆయకట్టు కింద 69, 70, 71 డీబీఎం మెయిన్‌కాల్వలు ఉన్నాయి. 2.36 లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా 2004లో రూ.1100 కోట్లతో మెయిన్ కాల్వలు, ఉపకాల్వలు, పంటక్వాలలు తవ్వారు.
నిధులు మంజూరైనా జాడలేని ఆధునికీకరణ పనులు
తూతూమంత్రంగా మెయిన్‌కాల్వ లైనింగ్ పనులు
కంపచెట్లతో నిండి ధ్వంసమైన ఉపకాల్వలు
అర్వపల్లి, ఫిబ్రవరి 12: శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు నీరందడంలేదు. దీంతో రైతులకు ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. ఆయకట్టు కింద 69, 70, 71 డీబీఎం మెయిన్‌కాల్వలు ఉన్నాయి. 2.36 లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా 2004లో రూ.1100 కోట్లతో మెయిన్ కాల్వలు, ఉపకాల్వలు, పంటక్వాలలు తవ్వారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, తిరుమలగిరి, నూతన్‌కల్, ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్, నడిగూడెం, మునగాల, గరిడేపల్లి, చిలుకూరు, కోదాడ, నల్లగొండ జిల్లాలో కేతేపల్లి, వేములపల్లి, తిప్పర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు మండలాల్లో సాగునీరందించేందుకు శ్రీరాంసాగర్ రెండోదశ కాల్వల ద్వారా గోదావరి జలాలు వస్తున్నా నేటివరకు చివరి భూములకు నీరు అందడంలేదు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాల్వలు తవ్వినా గోదావరి జలాలు ఏనాడూ పంటపొలాలకు అందించిన దాఖలాలులేవు. గత రెండేళ్లుగా శ్రీరాంసాగర్ నీటిని జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి వారబంధితో రోజుకు 1,700 క్యూసెక్కుల నీటిని 69, 70, 71 డీబీఎం మెయిన్ కాల్వల ద్వారా విడుదల చేసినా చెరువులు, కుంటలకు సరిపోను నీళ్లు అందడంలేదు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ప్రధాన కాల్వలు
69 డీబీఎం మెయిన్‌కాల్వ తిరుమలగిరి మండలం వెలిశాల నుంచి మొదలవుతుంది. మొత్తం ఈ కాల్వను 27 కిలోమీటర్ల వరకు తవ్వారు. ఈ క్వాలల కింద 69,956 ఎకరాల ఆయకట్టు ఉంది. నూతన్‌కల్, తుంగతుర్తి, మద్దిరాల మండలాల్లో నీరు అందుతుంది. కానీ ఇక్కడ కూడా చివరి భూములకు నీరందకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. 70డీబీఎం మెయిన్ కాల్వ మామిడిపెల్లి మొదలుకొని అర్వపల్లి మండలంలో 10కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అక్కడక్కడ పెద్దపెద్ద రాళ్లు వచ్చినా తొలగించలేదు. 7,173 ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. ప్రధాన కాల్వగా 71 డీబీఎం మెయిన్‌కాల్వ నిలిచింది. ఈ కాల్వ నాగారం మండలం ప్రగతినగర్ వద్ద మొదలవుతుంది. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో 1,44,480 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కాల్వలను తవ్వించారు. ఈ కాల్వ 69 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అత్యధికంగా మైనర్, సబ్‌మైనర్ కాల్వలున్న ప్రధాన కాల్వ 71 డీబీఎం. మోతె, పెన్‌పహాడ్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లోని చివరి భూములకు నీరు అందకపోవడంతో గోదావరి జలాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
నీటి నిల్వకు రిజర్వాయర్లు ఎక్కడ?
సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలతో నాలుగు రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు ఆరేళ్ల క్రితం 10 టీఎంసీల నీటి నిల్వ చేయడమే లక్ష్యంగా చెరువులను రిజర్వాయర్లుగా చేసి నీటి సామర్థ్యం పెంచేందుకు పునర్జీన పథకంతో రూ.300కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. తుంగతుర్తి మండలంలోని రుద్రమ్మచెరువు, వెంపటి చెరువు, రావులపెల్లి చెరువు, కేతిరెడ్డి ఆనకట్టలను రిజర్వాయర్లుగా చేసి లక్ష ఎకరాలకు నీరు అందించాలని ప్రతిపాదనలు పంపినా నేటివరకు జాడలేదు.
ధ్వంసమైన కాల్వలు
శ్రీరాంసాగర్ 69, 70, 71 డీబీఎం మెయిన్ కాల్వలకు మరమ్మతులు కోసం ఎస్సారెస్పీ అధికారులు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైనా టెండర్లు వేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ మెయిన్‌కాల్వల కింద ఉన్న ఉప కాల్వలు 1ఆర్, 11ఆర్, 7ఆర్, 4ఆర్, 10ఎల్‌ఆర్ ధ్వంసమయ్యాయి. తుంగతుర్తి, నూతన్‌కల్, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లో ఉపకాల్వలు ధ్వసమై 40శాతం నీరు వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్వపల్లి మండలం రామన్నగూడెం సమీపంలో ఉపకాల్వ పూర్తిగా కంపచెట్లతో నిండి తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. తూములను తూతూమంత్రంగా మరమ్మతులు చేసినా అవి మరమ్మతులకు నోచడంలేదు. తూములు పైకి లేపాలంటే అధికారులే నానా కష్టాలు పడుతున్నారు. నాగారం మండలం నుంచి అర్వపల్లి మండలం వరకు 8 కి.మీ మేర రూ.12కోట్లతో సీసీ లైనింగ్ పూర్తి చేశారు. కానీ ఇంకా సుమారు 90 కిలోమీటర్ల వరకు సీసీ లైనింగ్ వేయాల్సి ఉంది.
నీరందక ఇబ్బందులు పడుతున్నాం : వీరబోయిన లింగయ్య, రైతు, సర్వారం, మోతె మండలం
చివరిభూములకు నీరు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఉప కాల్వలకు వెంటనే మరమ్మతులు చేయాలి. కంపచెట్లను తొలగించి ధ్వంసమైన కాల్వలను సరిచేయాలి.